‘విద్యుత్’ సమ్మె విరమణ | power department retirees strike | Sakshi
Sakshi News home page

‘విద్యుత్’ సమ్మె విరమణ

Published Wed, Jun 15 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

‘విద్యుత్’ సమ్మె విరమణ

‘విద్యుత్’ సమ్మె విరమణ

ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ నేతలతో మంత్రి జగదీశ్‌రెడ్డి చర్చలు సఫలం
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలకు ప్రభుత్వం సుముఖం
మూడు నెలల్లో డిమాండ్ల పరిష్కారానికి హామీ

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వమే నేరుగా తమకు జీతాలు చెల్లించాలన్న ఔట్‌సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్‌ను మూడు నెలల్లో పరిష్కరిస్తామని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,100 మంది కాంట్రాక్టు జూనియర్ లైన్‌మెన్లను వెంటనే క్రమబద్ధీకరిస్తామన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న 34 డిమాండ్లను పరిష్కరించకుంటే బుధవారం నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ ప్రకటించిన నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో ఫ్రంట్ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఫ్రంట్ నేతలను సమ్మె విరమణకు ఒప్పించారు. అనంతరం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రేడ్ యూనియన్ల నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడంతో మధ్య దళారి వ్యవస్థ లేకుండా మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. అలాగే విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృత్యువాతపడే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను ప్రస్తుతమున్న రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచేందుకు (గతంలో రూ. 2 లక్షలుగా ఉన్న ఎక్స్‌గ్రేషియాను తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రూ. 5 లక్షలకు పెంచింది. దీన్ని రూ. 25 లక్షలకు పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి) అంగీకరించామన్నారు. అలాగే విధి నిర్వహణలో గాయపడే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పూర్తి వైద్య ఖర్చులను విద్యుత్ సంస్థలే భరిస్తాయని హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ కార్మికుల బీమాను రూ. 10 లక్షలకు పెంచేందుకు చట్టపరమైన అడ్డంకులున్నాయని, వాటిని అధిగమించి ఈ డిమాండ్‌ను సైతం నెరవేరుస్తామని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు అదనపు పోస్టులను మంజూరు చేసి సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగుల కోసం వైద్యశాఖ త్వరలో ప్రకటించనున్న నూతన పాలసీ అమల్లోకి వచ్చాక విద్యుత్ ఉద్యోగులకు సైతం వర్తింపజేస్తామన్నారు. రెండు వేర్వేరు మాస్టర్ పే స్కేళ్ల అమలు వల్ల నష్టపోతున్న కొందరు విద్యుత్ ఉద్యోగులకు రాబోయే పీఆర్సీ నుంచి ఒకే మాస్టర్ పే స్కేల్‌ను అమలు చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్చే అంశాన్ని పరిశీలిస్తామని... దీనివల్ల పడే అదనపు భారాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు ట్రస్ట్ ద్వారా పెన్షన్‌ను చెల్లించేందుకు అంగీకరించామన్నారు. విద్యుత్ ట్రేడ్ యూనియన్లు తొందరపడి సమ్మె నోటిసు ఇచ్చినప్పటికీ సానుభూతితో స్పందించిన సీఎం కేసీఆర్ ఏళ్ల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ఒప్పుకున్నారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌శాఖ పనితీరుపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తగ్గించుకోవాలని ఫ్రంట్ నేతలకు ఆయన సూచించారు.

 ప్రభుత్వానికి కృతజ్ఞతలు యూనియన్ల ఫ్రంట్ నేతలు
మంత్రి జగదీశ్‌రెడ్డితో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, 3 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని ట్రేడ్ యూనియన్ల ఫ్రం ట్ చైర్మన్, కన్వీనర్‌లు పద్మారెడ్డి, శ్రీధర్ తొలుత ప్రకటించారు. అయితే వెంటనే కలగజేసుకున్న జగదీశ్‌రెడ్డి సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాలని కోరగా ‘ప్రస్తుతానికి సమ్మెను విరమిస్తున్నాం’ అని వారు ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాల చెల్లింపుతోపాటు 22 వేల అదనపు పోస్టుల మంజూరు తదితర ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించినందుకు మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు సీఎండీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement