జాబు ఇస్తామని ఉన్న వారినే తొలగిస్తారా?
అనంతపురం అగ్రికల్చర్ : ‘బాబు వస్తే జాబు’ అంటూ ఎన్నికల ముందు నిరుద్యోగ వర్గాల్లో లేనిపోని ఆశలు కల్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఉన్నవారినే తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయం ఎదుట ఉద్యాన సిబ్బంది, ఏపీఎంఐపీలో పనిచేస్తున్న సిబ్బంది ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
‘జాబు కావాలంటే బాబు రావాలి’ అంటూ ఎన్నికల ముందు గ్రామ గ్రామాన గోడరాతలతో పాటు ఉపన్యాసాలతో నిరుద్యోగ వర్గాలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిల్లో ఆశలు రేకెత్తించారని వారు మండిపడ్డారు. అధికారం చేపట్టగానే అన్నీ మరచిపోవడం దారుణమన్నారు. కొత్తవి అటుంచితే ఉన్నవాటినే తొలగిం చడానికి ప్రయత్నించడం సమంజసం కాదన్నారు.
11 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతోనే పనిచేస్తున్నామని, ఏదో ఒక రోజు శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తారనే ఆశతో నెట్టుకొస్తున్నామన్నారు. ఉన్నఫలంగా ఇప్పుడు తొలగించే ప్రయత్నాలు చేస్తే తమ కుటుంబాల గతి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.