సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు... ఈరోజు ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయంటే దిగువస్థాయిలో వీరి సేవలు కీలకం! ప్రతి శాఖలోనూ వీరెంతో కీలకమయ్యారు. కానీ దీపావళి పండుగ వచ్చినా వారి కుటుంబాల్లో మాత్రం వెలుగులు పూయని జీవితం అయిపోయింది. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న వీరికి మూడు నుంచి ఆర్నెళ్లుగా జీతాలు అందలేదు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వీరికి అప్పులు కూడా దొరకని పరిస్థితి. ఇప్పటికే తిత్లీ తుపాను చేసిన గాయంతో జిల్లాలో ప్రజలు నిరాశల్లో ఉన్నారు. పంటలు, తోటలు, పాడి, ఇళ్లు నష్టపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో చిరుద్యోగులూ ఇబ్బంది పడుతున్నారు. జీతాల బకాయిలతో వారిని ప్రభుత్వం కష్టాల్లో ముంచేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సుమారుగా పదివేల మందికి పైగా ఉన్నారు. వీరంతా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం జీతాలు విడుదల చేయకపోవడంతో నిరాశ, నిçస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు.
♦ ప్రధాన ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు విడుదల కాని దుస్థితి ఏర్పడింది.
♦ రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులు, ఎస్టీపీ ప్లాంట్ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇతర సిబ్బందికిమూడు నెలలుగా జీతాలు లేవు.
♦ రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు విడుదల కాలేదు.
♦ రాజీవ్ విద్యామిషన్ పరిధిలో ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాలేదు. అదే పాఠశాలలో వివిధ చిరుద్యోగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు మంజూరు చేయలేదు.
♦ వైద్య ఆరోగ్యశాఖ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు ఆర్‌సీహెచ్–1, ఆర్‌సీహెచ్–2, ఆర్‌సీహెచ్–3లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా బకాయిలు ఉన్నాయి. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఉద్యోగులకు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు, ఆరోగ్యమిత్రలకు ఆరు నెలలుగా జీతాలు విడుదల కాలేదు.
♦ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కుక్, హమాటీ, వాచ్‌మన్‌లకు గడచిన మూడు నెలలుగా జీతాలు అందలేదు.
♦ విద్యాశాఖలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంఆర్‌సీల్లో పనిచేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేవు.
♦ రెవెన్యూ విభాగంలో తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్‌డీవో కార్యాలయాలు, కలెక్టరేట్, ప్రత్యేక భూసేకరణ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఎటెండర్‌లు, రికార్డు అసిస్టెంట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుకు మూడు నెలలుగా జీతాలు బకాయి ఉంది.
♦ నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పారిశుద్ధ్య కార్మికులకు, పర్యవేక్షకులకు మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు.
♦ పై శాఖలే కాకుండా పశుసంవర్ధకశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనం, ఏపీఎంఐపీ తదితర ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు బకాయిలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment