‘బాబు’ రాగానే జాబు పోయింది | job was gone when after chandrababu came | Sakshi
Sakshi News home page

‘బాబు’ రాగానే జాబు పోయింది

Published Sat, Aug 23 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

job was gone when after chandrababu came

ఒంగోలు అర్బన్ : జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేశారని, కానీ, బాబు రాగానే జాబు పోయిందని గృహ నిర్మాణ సంస్థ (హౌసింగ్) ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా పదో రోజైన శుక్రవారం ఉద్యోగులంతా నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 స్థానిక కలెక్టరేట్ నుంచి సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగింది. అనంతరం నిర్వహించిన ధర్నాలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి.మస్తాన్‌రావుమాట్లాడుతూ హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు గృహాలు నిర్మించడంలో హౌసింగ్ శాఖలోని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు.

వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అడకా స్వాములు, జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్, నగర ప్రెసిడెంట్ తాడి శ్రీనివాసులు, యునెటైడ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఏవీబీ బ్రహ్మచారి, కార్యదర్శి జీవీ రాగయ్య, యూనియన్ జిల్లా కోశాధికారి ఆర్.ఉదయ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ మురళీమోహన్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement