పదో పీఆర్సీ అమలుకు వినతి
సాక్షి, హైదరాబాద్: సచివాలయం నుంచి కిందిస్థాయి కార్యాలయాల వరకు రకరకాల పోస్టుల్లో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వం ఇస్తున్న అరకొర వేతనాలు చాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూటు బూటు ధరించే కన్సల్టెంట్లకు నెలకు రూ.లక్షల్లో చెల్లిస్తున్న రాష్ట్ర సర్కారు ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై మాత్రం కనికరం చూపడం లేదు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో కలిపి 60 వేల మంది ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పని వేళల్లో కూడా మార్పు లేదు. కానీ, రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది.
ప్రభుత్వ అటెండర్, ప్రభుత్వ డ్రైవర్, ప్రభుత్వ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్‌లకు వేతనాలు భారీగా ఉంటాయి. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే అటెండర్, డ్రైవర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్‌లకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే వేతనాల్లో సగం కూడా రాకపోవడం గమనార్హం. నాలుగో తరగతి ఉద్యోగాలను భర్తీ చేయకుండా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి డ్రైవర్, అటెండర్‌లను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విధానంలో పనిచేసే అటెండర్‌కు నెలకు రూ.7,500, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు నెలకు రూ.9,500 ఇస్తున్నారు.
ఇదే పనిని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఇస్తున్నారు. తొమ్మిదో పీఆర్సీ లాస్ట్ గ్రేడ్ పే సిఫార్సులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం అమలు చేసింది. పదో పీఆర్సీ లాస్ట్ గ్రేడ్ పేగా రూ.14,860ను సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే అటెండర్లకు నెలకు రూ.14,860, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు రూ.18,400 పెంచాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫార్సులపై దృష్టి సారించడం లేదు. సచివాలయంలో ఒకచోటు నుంచి మరో చోటుకి ఫైళ్లు కానీ, కాగితం కానీ కదలాంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుండాలి. వారు రాకపోతే ఫైళ్లు కదలవు. ఉన్నతాధికారుల వాహనాల డ్రైవర్లు ఔట్ సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తున్నారు. వారు లేకపోతే అధికారులు సచివాలయానికి రాలేరు. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో తమ వేతనాలను వెంటనే పెంచాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు.
సర్కారుకు పట్టని ‘ఔట్ సోర్సింగ్’ గోడు
Published Mon, Oct 26 2015 4:07 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement