జీతాలు ఇస్తారా.. చావమంటారా..!
నీటి ట్యాంక్ ఎక్కిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
ఏడు నెలలుగా ఇవ్వకుంటే ఎలా బతకాలి?
రెండు గంటల పాటు జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
డీఎస్పీ చొరవతో ఆందోళన విరమణ
ప్రొద్దుటూరు క్రైం: ‘మీరైతే నెల ఒకటో తారీఖున జీతాలు తీసుకుంటారే.. చిన్న ఉద్యోగస్తులం.. పైగా మాలో కొంత మందికి ఉద్యోగాలు పీకేశారు.. ఏడు నెలలుగా జీతాలు రాకుంటే ఎలా బతకాలి.. ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా మా మొర ఆలకించరా.. బాడుగ ఇవ్వలేదని ఇంటికి తాళం వేసి బయటికి గెంటేస్తున్నారు..ఇంతటి అవమానాల మధ్య మేం ఎలా బతకాలి.. ఇంతటి మానసిక వేదనను అనుభవిస్తూ బతకడం ఎందుకు.. ఈ బతుకు బతకడం కన్నా చావడమే మేలు కదా’.. అని జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు. వీరంతా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆస్పత్రిలో ఉన్న నీటి ట్యాంక్ ఎక్కారు. ఆస్పత్రి ప్రాంగణమంతా పెద్ద ఎత్తున కేకలు.. వద్దూ వద్దూ దిగండి అంటూ కింద ఉన్న వారంతా అరవ సాగారు. అయితే ఉద్యోగులు మాత్రం నేరుగా ట్యాంక్ చివరకు వెళ్లారు. ఇదంతా సోమవారం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో జరిగింది. విషయం తెలియడంతో డీఎస్పీ పూజిత నీలం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
7 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి మేడం..
అప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ బుసిరెడ్డి, ఆర్‌ఎంఓ డేవిడ్ సెల్వరాజ్‌లు ట్యాంక్ వద్దకు చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వడం అనేది మా చేతుల్లో లేనిదని వారు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ఉందని అధికారులు చెప్పారు. అయినప్పటికీ ట్యాంక్‌పై ఉన్న యూనియన్ నాయకులు, ఉద్యోగులు వినిపించుకోలేదు. డీఎస్పీ పూజిత నీలం సంఘటనా స్థలానికి వచ్చారు. జీతాలు ఇవ్వలేదని ఇలా ట్యాంక్ ఎక్కి బెదరించడం మంచిది కాదన్నారు. మీకేదైనా అన్యాయం జరిగిందనిపిస్తే ఉన్నతాధికారులకు తెలపాలన్నారు. ఇప్పటికే అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నాం, ధర్నాలు చేశాం, నిరాహారదీక్షలు చేసినా ఫలితం లేదని ఉద్యోగులు డీఎస్పీతో అన్నారు. ఇక చేసేదేమిలేక చివరి ప్రయత్నంగా ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు రాకుంటే ఊరుకుంటారా- జయశ్రీ
ఒక్క నెల జీతం ఇవ్వకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఊరుకుంటారా అని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అన్నారు. చాలీ చాలని జీతంతో పని చేస్తున్న వీళ్లకి ఏడు నెలల నుంచి జీతం రాకుంటే ఎలా బతుకుతారని ఆమె పేర్కొన్నారు. 106 మందికి జూలై నుంచి జీతాలు రావాల్సి ఉందని, వీరితో వెట్టి చాకిరి చేయించుకున్న అధికారులకు ఆ మాత్రం బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు తొలగించిన 58 మందికి పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
డీఎస్పీ చొరవతో ఆందోళన విరమణ
అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన డీసీహెచ్‌ఎస్‌లతో డీఎస్పీ పూజిత నీలం ఫోన్‌లో మాట్లాడారు. ఈ జిల్లాల్లో కూడా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు మంజూరు కాలేదన్నారు. ఇదే విషయాన్ని డీఎస్పీ యూనియన్ నాయకులకు వివరించారు. తర్వాత ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కనకదుర్గతో మాట్లాడారు. మూడు రోజుల క్రితమే ఫైల్‌పై సంతకం చేశానని, ఆర్థిక శాఖ అనుమతి అనంతరం జీతాలు వస్తాయని కమిషనర్ తెలిపారు. ఇదే విషయాన్ని డీఎస్పీ ఆందోళన చేస్తున్న వారితో చెప్పారు. ఆమె హామీ మేరకు ఆందోళన విరమిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, నారాయణయాదవ్, సిబ్బంది ఆస్పత్రి ప్రాంగణంలో పరిస్థితిని సమీక్షించారు. సీఐటీయూ నాయకుడు రామ్మోహన్‌రెడ్డి, రాజు, లత, ప్రసాద్, కృష్ణాలతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ధనుంజయరెడ్డి, సీఐటీ యూ నాయకులు అన్వేష్, గురుస్వామితోపాటు పలువురు నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.