భువనగిరి :ఆహారభద్రతా (రేషన్) కార్డులకు ప్రైవేటు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అర్హులేనని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభలో జరిగిన చర్చలు, సభ్యులనుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను కొంతమేర సడలించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి అదివారం ఈ అదేశాలు అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.లక్షన్నర, పట్టణ ప్రాం తాల్లో రూ.2లక్షల అదాయ పరిమితినే ప్రాతిపదికగా తీసుకొని అర్హులకు కార్డులు జారీ చేయాలని అ శాఖ అధికారులు సూచించారు. అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లాలో 10,67,004 మంది ఆహార భద్రతాకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే దర ఖాస్తుల పరిశీలనకు ఉన్న నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే వాటిపై పరిశీలనాధికారి పరిశీలించి సంతృప్తి చెందితే వారికి కార్డులు జారీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే పింఛన్ల దరఖాస్తులో ఆహార భద్రతాకార్డుల పరిశీలన చేశారు. మారిన నిబంధనల నేపథ్యంలో గతంలో పరిశీలన జరిపిన దరఖాస్తులకు కొత్త పరిమితుల మేరకు పునఃపరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆహార భద్రతా కార్డుల జారీలో ఎలాంటి అవకతవకలు జరిగినా, అర్హులకు అందకున్నా, అనర్హులకు అందినా సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం పకడ్బందీగా విచారణ జరపాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. కార్డులజారీపై వినతుల స్వీకరణకు గ్రీవెన్స్ సెల్ సీనియర్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వచ్చే నెలలో నూతనకార్డులు జారీ చేసే అవకాశం ఉంది.
16 నుంచి 30 కిలోలకు పెరగనున్న బియ్యం
ఆహార భద్రతాకార్డు కింద యూనిట్‌కు బియ్యం కోటా పెరగనుంది. ఇప్పటివరకు రేషన్‌కార్డులో యూనిట్‌కు నాలుగు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేసేవారు. గరిష్టంగా 16 కిలోలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆహార భద్రత కార్డు కింద ఒక్కో సభ్యుడికి(యూనిట్) ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. కార్డుకు ఐదు యూనిట్లు వరకే పరిమితి చేశారు. కార్డుకు గరిష్టంగా 30 కిలోలు అందజేస్తారు. అంత్యోదయ కార్డులకు గతంలో ఇచ్చినట్టుగానే 3 కిలోల బియ్యం ఇస్తారు. కిలో బియ్యం రూపాయికే సరఫరా చేస్తారు.
ప్రైవేట్ ఉద్యోగులూ అర్హులే..
Published Wed, Dec 3 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement