Private Employees
-
ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా!
ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) శుభవార్త అందించింది. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే పన్నుకు సంబంధించి విలువను నిర్ణయించే నిబంధనలను సీబీడీటీ సవరించింది. దీంతో ఉద్యోగులకు మరింత ఎక్కువ పన్ను ఆదా అవుతుంది. టేక్-హోమ్ జీతం పెరుగుంది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను నిబంధనలకు సవరణలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు యాజమాన్యాలు కల్పించే అన్ఫర్నిష్డ్ గృహాలకు సంబంధించిన వ్యాల్యుయేషన్ నిబంధనలు మారాయి. తగ్గిన పన్నులు 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులకు వసతిపై పన్ను వారి జీతంలో 10 శాతం ఉంటుంది. ఇది ఇంతకు మందు 15 శాతంగా ఉండేది. ఇక 15 లక్షలకు మించి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది జీతంలో 7.5 శాతం ఉంటుంది. గతంలో 10 శాతంగా ఉండేది. వసతి వ్యాల్యుయేషన్ నిబంధనలను సీబీడీటీ మార్చడం వల్ల అధిక జీతం పొందుతూ యాజమాన్యాలు కల్పించే వసతిలో నివాసముంటున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుకుందని, పెద్ద పన్ను ఆదాతోపాటు వారు పొందే టేక్ హోమ్ జీతం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు! -
ప్రైవేట్ కంపెనీలకు ఆధార్ ప్రమాణీకరణ
-
ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. వాళ్లకి ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పెన్షన్!
మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ 10 సంవత్సరాలు పూర్తి చేశారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ప్రయివేటు రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కొన్ని షరతులకు లోబడి ప్రభుత్వం ఈ పెన్షన్‌ని అందిస్తోంది. అవేంటో చూద్దాం! నిబంధనలు ఏం చెప్తోంది! ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం.. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 10 ఏళ్ల పూర్తయిన వారికి పింఛన్ సౌకర్యం లభిస్తుంది. అయితే సదరు ఉద్యోగికి 58 ఏళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా వారికి పెన్షన్ అందుతుంది. కాగా ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి కొంత సొమ్ము మినహాయించడమే ఇందుకు కారణం. 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఏ ఉద్యోగి అయినా పెన్షన్ పొందడానికి అర్హత పొందుతాడు. అయితే ఉద్యోగ కాలపరిమితి మాత్రం ఖచ్చితంగా 10 ఏళ్లు ఉండాలనే నిబంధన ఉంది. ఇందులో ఒక మినహాయింపు కూడా ఉంది. ఉద్యోగి 9 సంవత్సరాల 6 నెలల సర్వీస్‌ను కూడా 10 సంవత్సరాలకు సమానంగా లెక్కిస్తారు. ఉద్యోగం పదవీకాలం తొమ్మిదిన్నర సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే, అది 9 సంవత్సరాలుగా మాత్రమే పరిగణిస్తారు. ఉద్యోగి పదవీ విరమణ వయస్సు కంటే ముందు పెన్షన్ ఖాతాలో జమ చేసిన నగదుని విత్‌డ్రా చేసుకుంటే అటువంటి వారికి పెన్షన్‌కు అర్హత ఉండదు. కాగా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల ప్రాథమిక జీతం, డియర్నెస్ అలవెన్స్‌లో 12 శాతం ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్‌కు ఇవ్వబడుతుంది. అలాగే, ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్‌కి వెళ్తుంది. కంపెనీలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో డిపాజిట్ అవుతుంది. అదే సమయంలో, ప్రతి నెలా 3.67 శాతం ఈపీఎఫ్‌కి వెళుతుంది. ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి ►పని చేస్తున్న సంస్థను విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగంలో గ్యాప్ ఉంటే, మీరు మళ్లీ ఉద్యోగం ప్రారంభించినప్పుడు, మీ UAN నంబర్‌ను మార్చకూడదు. ►ఉద్యోగాలు మారినప్పుడు, మీ కొత్త కంపెనీ తరపున ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది. అలాగే, మీ మునుపటి ఉద్యోగం మొత్తం పదవీకాలం కొత్త ఉద్యోగానికి జత చేస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు మళ్లీ 10 సంవత్సరాల ఉద్యోగాన్ని పూర్తి చేయవలసిన అవసరం లేదు. ►ఉద్యోగి 5-5 సంవత్సరాలు రెండు వేర్వేరు సంస్థలలో పనిచేసినట్లయితే, అటువంటి ఉద్యోగికి కూడా పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. చదవండి: ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్! -
ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్.. కేంద్రం గుడ్ న్యూస్!
పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు బడ్జెట్ 2022-2023లో స్పష్టంగా కనిపిస్తున్నాయి!. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ(ప్రైవేట్ కూడా!) వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా ఉన్న పీఎఫ్ ట్యాక్స్ ఫ్రీ పరిమితిని.. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది. జీతం ఉన్న ఉద్యోగులందరికీ సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు చేయొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ ఉద్యోగులను ఈ గొడుగు కిందకు తీసుకొచ్చేందకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు కొన్ని ఆర్థిక సంబంధమైన బ్లాగుల్లో కథనాలు కనిపిస్తున్నాయి. 2021-22 ఉద్యోగుల సమయంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. అయితే పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, ఇది వివక్షతో కూడుకున్నదని నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. తాజా నిర్ణయం అమలులోకి వస్తే.. జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఈ లిమిట్‌ను 5 లక్షల దాకా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనను సవరించాలంటూ ప్రభుత్వానికి అనేక ప్రాతినిధ్యాలు అందాయి. ప్రాథమికంగా ఈ నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే అంశం కాబట్టి, ఇది వివక్షత లేనిదిగా ఉండాలని, జీతాలు తీసుకునే ఉద్యోగులందరినీ దీని పరిధిలోకి తీసుకురావాలని నొక్కిచెప్పాయి. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. లక్ష రూ. దాకా.. -
ఉద్యోగుల ‘వెత’నాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు రంగం ఉద్యోగులు వేతనాల కోసం కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు. సాధారణంగా ప్రతి నెలా తొలివారంలోనే యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంటాయి. లాక్డౌన్ కారణంగా ఈసారి ఏప్రిల్ తొలివారం గడిచినా మెజార్టీ ఉద్యోగులకు వేతనాలందలేదు. రాష్ట్రంలో సంఘటిత రంగంలో దాదాపు 45లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా విద్యారంగానికి సంబంధించిన స్కూళ్లు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు, కోచింగ్ సెంటర్లలో 20లక్షల మంది వరకు ఉన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించట్లేదు. దీంతో సంఘటిత రంగంలో అధికారిక లెక్కల ప్రకారం 19.5లక్షల మంది ఉన్నారు. కరోనా కట్టడికి ఈనెల 14 వరకు లాక్డౌన్ ప్రకటించడంతో అత్యవసర సేవలందించే సంస్థలు మినహా మిగతావన్నీ మూతబడ్డాయి. దీంతో రోజువారీ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆయా సంస్థలకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు చెల్లించే ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 వరకు వేతనంతో కూడిన సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిబంధన ప్రకారం ప్రతి కంపెనీలో ఉద్యోగికి పూర్తి వేతనం ఇవ్వాలి. అయితే ఏప్రిల్ తొలివారం గడిచినా చాలా సంస్థలు వేతనాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. కోతలు.. ఎగవేతలు కొన్ని సంస్థలు రెండుమూడు రోజుల నుంచి వేతనాలు చెల్లిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం సంస్థలు వేతనాలిచ్చినట్లు కార్మిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే చాలా సంస్థలు వేతనాల్లో సగమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్గనైజ్డ్ సెక్టార్లో వేతన చెల్లింపుల ప్రక్రియ కార్మికశాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించకున్నా పని దినాల ప్రకారం వేతనాలు చెల్లిస్తాయి. నిర్దేశిత తేదీలను ప్రామాణికంగా తీసుకుని ఆ మేరకు వేతనాలిస్తారు. అయితే గతనెల 22 నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు పనిచేసిన రోజులను ప్రామాణికంగా తీసుకున్న కంపెనీలు పూర్తి వేతనం ఇస్తుండగా, ఆ తర్వాత పనిదినాలను పరిగణనలోకి తీసుకున్న కంపెనీలు మాత్రం కోత విధిస్తున్నాయి. కొన్ని కంపెనీలు.. పరిస్థితులు కుదుటపడ్డాక చూద్దామన్నట్టు ఉద్యోగులకు చెబుతున్నాయి. ప్రతిపాదనల్లోనే ‘అడ్వాన్స్’.. వేతనాలు చెల్లించని పలు సంస్థలు ఉద్యోగులతో కొన్ని రకాల ప్రతిపాదనలు తెస్తున్నాయి. లాక్‌డౌన్‌తో సంస్థ లావాదేవీలు నిలిచిపోవడంతో కుటుంబ ఆర్థిక అవసరాలకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ, ఇంతవరకు ఇచ్చిన దాఖలాల్లేవు. కొన్ని సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చి ఆమేరకు చెల్లింపులు చేసినట్లు కార్మికశాఖ అధికారి ఒకరు చెప్పారు. లాక్డౌన్ నిబంధనల్లో భాగంగా ఉద్యోగులకు వేతనాలిచ్చిన అనంతరం కార్మికశాఖకు సమాచారమివ్వాలనే నిబంధన ఆధారంగా అన్ని సంస్థల వివరాలు తెలుసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆర్నెల్లపాటు ప్రైవేట్ ఉద్యోగుల్ని తొలగించొద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా మూతబడిన ప్రైవేట్ పరిశ్రమలు తమ ఉద్యోగులను ఆరు నెలలపాటు అంటే మార్చి నుంచి ఆగస్టు వరకు తొలగించేందుకు వీలులేకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగంలోని సిబ్బంది వేతనంలో 70 శాతం ప్రభుత్వమే మార్చి నుంచి మే వరకు చెల్లించాలని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కోరారు. 2019 లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 4.25 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 కోట్ల మంది పనిచేస్తుండగా, ఈ రంగం రూ.61 లక్షల కోట్లు అంటే జీడీపీలో 29 శాతం మేర సమకూర్చుతోందని వివరించారు. (55 ఏళ్లు దాటిన పోలీసులకు కరోనా డ్యూటీ ‘నో’) చదవండి: కరోనాకు 35,349 మంది బలి -
జగ్గారెడ్డిపై ఎచ్ఆర్సీలో ఫిర్యాదు..
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మంత్రి హరీష్ రావుపై అసభ్యపదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మంగళవారం ఖండించింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రైవేటు ఉద్యోగ సంఘం నేతలు మండిపడ్డారు. అదేవిధంగా జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశామని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తెలిపింది. చదవండి: ‘సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడారు’ ఈ సందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగ్గారెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి హరీష్‌రావుపై అనుచిత వాఖ్యలు చేశారని మండిపడ్డారు. జగ్గారెడ్డి తక్షణం హరీష్ రావుకి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై అనుచితన వాఖ్యలు చేస్తే ఉరుకోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. జగ్గారెడ్డి భాష మార్చుకోకపోతే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తామనాని గంధం రాములు పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్‌కు భజన చేసుకో.. చెంచాగిరి కాదు..! -
ప్రైవేట్ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : పదవీవిరమణ అనంతరం పెద్దగా ప్రయోజనాలు అందుకోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరట లభించింది. ప్రైవేట్ ఉద్యోగులు సైతం రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ అందుకునేందుకు మార్గం సుగమమైంది. పూర్తిస్దాయి వేతనం ప్రాతిపదికన ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాలంటూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులతో ప్రైవేట్ ఉద్యోగులకూ భారీగా పెన్షన్ అందుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు వారి వాస్తవ వేతనంపై కాకుండా రూ.15,000 వేతనం ప్రాతిపదికన పెన్షన్‌ను లెక్కగడుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు నిర్ణయంతో ఉద్యోగులకు వారి పూర్తి వేతనం ప్రాతిపదికన పెన్షన్‌ను లెక్కగట్టడంతో ఉద్యోగులు పదవీవిరమణ అనంతరం పెద్దమొత్తంలో పెన్షన్ అందుకునే వెసులుబాటు కలిగింది. ఇక సుప్రీం కోర్టులో ఈపీఎఫ్‌వో అప్పీల్ తిరస్కరణ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ భారీగా పెరగనుండగా ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గనుంది. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్‌కు కాకుండా ఈపీఎస్‌కు వెళ్తుంది. ఈపీఎస్ మదింపే కీలకం.. కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)ను ప్రారంభించింది. ఇందులో కంపెనీ ఉద్యోగి వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ స్కీమ్‌లో జమచేయాలి. అయితే ఈ కంట్రిబ్యూషన్ ఉద్యోగి వాస్తవ వేతనంతో నిమిత్తం లేకుండా రూ.6,500లో 8.33 శాతానికి మాత్రమే పరిమితం. అంటే ఈపీఎస్ ఖాతాకు నెలకు గరిష్టంగా కేవలం రూ.541 మాత్రమే జమవుతాయి. ఇక 1996 మార్చిలో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేసింది. 2014 సెప్టెంబర్ 1న మళ్లీ ఈపీఎఫ్‌వో ఈపీఎస్ నిబంధనలను సవరించింది. ఉద్యోగి వేతనం ఎంతైనా రూ.15,000 ప్రాతిపదికన 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు జమ చేసుకోవచ్చని మార్పులు చేసింది. అంటే నెలకు గరిష్టంగా రూ.1,250 ఈపీఎస్ ఖాతాకు జమవుతుంది. మరోవైపు పూర్తి వేతనంపై పెన్షన్ అవకాశాన్ని ఎంపిక చేసుకుంటే గత ఐదేళ్ల వేతనం సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని పేర్కొంది. గత ఏడాది వేతనం సగటును పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యోగులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా నిబంధనలను పక్కనపెట్టిన కోర్టు పా విధానాన్నే అనుసరించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఈపీఎఫ్‌వో సుప్రీం కోర్టుకు వెళ్లగా పూర్తిస్దాయి వేతనంపైనే పెన్షన్ లెక్కగట్టాలన్న హైకోర్టు వాదనను సమర్ధిసూ ఈపీఎఫ్ఓ అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తిరస్కరించింది. -
ప్రైవేట్ ఉద్యోగుల చేతివాటం...అరెస్ట్
కాకినాడ: ప్రైవేట్ ఉద్యోగుల ఘరానా మోసం కాకినాడలో కలకలం రేపింది. సీఎంఎస్ సంస్థ స్థానిక ఏటీఎంలలో నగదు పెట్టే కాంట్రాక్టును నిర్వహిస్తుంది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మోసానికి పాల్పడ్డాడు. కాకినాడ టెంపుల్ వీధిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో డబ్బులు నింపే క్రమంలో సీఎంఎస్ ఉద్యోగి భరణీకుమార్ రూ. 10 లక్షలను అందులో పెట్టకుండా సొంతంగా ఖర్చుపెట్టుకున్నాడు. దీంతో సీఎంఎస్ సంస్థ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి మరో ఇద్దరు ఉద్యోగులు సహకరించినట్లు తెలుస్తోంది. భరణీకుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. -
కార్మికుడిని దేశ నిర్మాత చేస్తాం
* కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ * ప్రైవేటు ఉద్యోగులకూ సామాజిక భ ద్రత కల్పించాం * ఎన్డీఏ ఏడాది పాలనలో ఇదే మా ఘన విజయం సాక్షి,హైదరాబాద్: మేకిన్ ఇండియాతో కార్మికుడిని దేశ నిర్మాతగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎన్డీయే ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దత్తాత్రేయ శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేటు, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించామని పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వ ఘన విజయమని చెప్పారు. మేకిన్ ఇండియాతో దేశ స్వరూపం పూర్తిగా మారనున్న నేపథ్యంలో తొలుత కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, పని ప్రదేశాల్లో సరైన వసతులు కల్పించడంతో పాటు కార్మికులకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని చట్టాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్మికుల కనీస పింఛనుగా రూ.1,000 అందించటంతో పాటు ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్ల వివరాలను సంబంధిత కార్మికులకు తెలియచేసేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వసతులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయటం, ఉన్న ఆస్పత్రుల స్థాయి పెంచేందుకు కార్యాచరణ ప్రారంభించామని, వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల్లో సేవలను విస్తృతం చేస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన కు కేంద్ర సాయం... తెలంగాణ ప్రభుత్వ స్వచ్ఛ హైదరాబాద్ పథకానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, మూసీని ప్రక్షాళన చేసేందుకు రూ.875 కోట్ల పథకానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని దత్తాత్రేయ వెల్లడించారు. -
మానసిక ఆందోళన ప్రైవేట్ ఉద్యోగుల్లోనే అధికం!
న్యూఢిల్లీ: భారత్‌లో దాదాపు 42.5 శాతం ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువ షెడ్యూళ్లు, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల పలు మానసిక ఆందోళనలతో బాధపడుతున్నట్లు అసోచామ్ తెలిపింది. దాదాపు 18 రంగాలకు చెందిన 150 కంపెనీలకు సంబంధించిన 1,250 మంది ప్రైవేట్ ఉద్యోగులు అసోచామ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్నారు. సర్వే ప్రకారం, మానసిక ఆందోళనల బారిన పడుతున్న ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంఖ్య దేశ రాజధాని ఢిల్లీలో అధికంగా ఉంది. దీని తర్వాత బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, హైదరాబాద్, పుణేలు ఉన్నాయి.‘పోటీ ప్రపంచంలో మనుగడ సాగించటానికి అవసరమైన ఉద్యోగాలను కాపాడుకోవాలనే ధ్యాసలో ప్రైవేట్ ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురవుతున్నారు’ అని అసోచామ్ జనరల్ సెక్రటరి రావాత్ అన్నారు. మహిళల్లోనే స్థూలకాయం ఎక్కువ! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనారోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఊబకాయం మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తోందంటోంది హైదరాబాద్‌కు చెందిన ప్రివెంటివ్ హెల్త్‌కేర్ సంస్థ అయిన ఈకిన్‌కేర్.కామ్. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘పర్సనల్ హెల్త్ రికార్డ్ అకౌంట్’ను ఈకిన్‌కేర్.కామ్ ఫౌండర్, సీఈఓ కిరణ్ కే కలకుంట్ల సోమవారమిక్కడ ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం ఈకిన్‌కేర్.కామ్ సేవల్ని 1,500 మందికి పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. ఇందులో 70 శాతం మంది 20-30 ఏళ్ల వయస్సు వారే’ అని ఈ సందర్భంగా అన్నారు. మెడికల్ రికార్డుల్ని భద్రపర్చే సేవల్ని ఈకిన్‌కేర్.కామ్ అందిస్తోంది. -
తప్పు మాదేనా?
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19? నాకు ఒక్కగానొక్క కొడుకు. వచ్చే నెలకి పదిహేడేళ్ల్లు నిండుతాయి. పేరు వరుణ్. నేనూ, మా వారు ప్రైవేట్ ఉద్యోగులం. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్లడం లేదు. వరుణ్ని చూసుకోవడానికే పూర్తి సమయం కేటాయిస్తున్నాను. ఎప్పటికి కోలుకుంటాడో అని కొండంత దిగులును దిగమింగుకొని గంపెడాశతో బతుకుతున్నాను. నాలాంటి సమస్య పిల్లలున్న తల్లిదండ్రులకు ఎవరికీ రాకూడదని, ముందే జాగ్రత్త తీసుకుంటారని చెబుతున్నాను. మా వరుణ్ బాగా చదివేవాడు. చూడటానికి సినిమా హీరోలా ఉంటాడని మా బంధువులు, స్నేహితులు ఎప్పుడు కలిసినా అనేవారు. పదవ తరగతి 9.5 శాతం మార్కులతో పాసయ్యాడు. ఇంకో నాలుగైదేళ్లు కష్టపడితే చాలు వాడి జీవితం ఒక గాడిన పడుతుందని సంబరపడ్డాను. అప్పటి వరకు ఉద్యోగం చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆలోచించాను. కానీ, నా ఆలోచనను మా వాడు తలకిందులు చేశాడని తెలిసేవరకు చాలా ఆలశ్యమైంది. ఓ రోజు ఆఫీస్‌లో ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్... ‘ఔటర్‌రింగ్‌రోడ్డు యాక్సిడెంట్లో మీ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం...’ అని. విలవిల్లాడిపోయాను. కాలేజీలో ఉండాల్సిన వాడు ఔటర్‌రింగ్ రోడ్డుకు ఎందుకెళ్లాడు?! ఎప్పుడెళ్లాడు?! అనుకుంటూనే ఆసుపత్రికి వెళ్లాను. మా అదృష్టం బాగుండి వాడు ప్రాణాలతో మాకు దక్కాడు. కానీ, ఎటూ కదల్లేక పడి ఉన్న వాడిని చూస్తూ ప్రతి క్షణం మేమే ప్రాణాలతో ఎందుకున్నామా? అని బాధపడుతూ ఉన్నాం. మా తప్పిదమే మా ఈ శిక్షకు కారణమైందని ఇప్పటికీ తిట్టుకుంటున్నాం. టెన్త్‌లో డిస్టింక్షన్లో పాసైన వరుణ్ ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో 40 శాతం అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. వచ్చే ఏడాది బాగానే కవర్ చేస్తాడులే అని సరిపెట్టుకున్నాను. కానీ, సెకండియర్‌లో రెండు సబ్జెక్టులు మిగిలిపోయాయి. వీడి క్లాసు పిల్లలు బి.టెక్కు వెళుతున్నారు. వీడు ఫెయిలై మళ్లీ అదే క్లాస్‌కి వెళుతున్నాడు. ఇంట్లోనే ఉంటే ఆ సబ్జెక్టులు కూడా పాసవలేడని, డబ్బులు కట్టి మళ్లీ కాలేజీకి పంపిస్తున్నాం. అసలేమైందంటే, పదవతరగతి పూర్తయ్యాక డబ్బులు ఎక్కువైనా పర్వాలేదని, ముందే మంచి కాలేజీలో ఎం.పి.సి సీటు తీసుకున్నాం. మొదట్లో వరుణ్ కాలేజీకి వెళ్లనంటే వెళ్లనన్నాడు. వాడికి హిస్టరీ అంటే ఇష్టం. అందుకే అదే సబ్జెక్ట్ ఉన్న కోర్స్ చేస్తానన్నాడు. దాంట్లో భవిష్యత్తు ఉండదని మేం వారించాం. తిట్టాం. బుజ్జగించాం. ఎమ్‌టెక్ చేసి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయితే విదేశాలకు వెళ్లి లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చని నచ్చజెప్పాం. ఎట్టకేలకు ‘సరే’ అన్నాడు. కానీ, కాలేజీకి వెళ్లాలంటే ఫోన్ కావాలన్నాడు. ల్యాప్ టాప్ అవసరమన్నాడు. వాడు చదువుకుంటే చాలు అనుకొని మా శక్తికి మించి వాడు కోరినవన్నీ కొనిస్తూనే వచ్చాం. కొనిచ్చిన వస్తువులు కనపడక అడిగితే అరిచేవాడు. తప్పు పడుతున్నారని కోపం తెచ్చుకొని చేతికి అందిన వస్తువునల్లా విసిరికొట్టేవాడు. వీడి ప్రవర్తనకు విసిగి వరుణ్ నాన్నగారు కొన్నిసార్లు వాడి మీద చేయి కూడా చేసుకున్నారు. మా వారికి తెలియకుండా వరుణ్ బుద్దిగా ఉండటానికి నేనే అడిగినప్పుడల్లా ఎంతో కొంత డబ్బిచ్చేదాన్ని. అప్పటికి చెప్పింది బాగానే వినేవాడు. వరుణ్ రోజూ కాలేజీకి వెళుతున్నాడనే అనుకున్నాను. కానీ, కాలేజీ ఎగ్గొట్టి స్నేహితులతో సినిమాలకు, షికారులకు, బైక్ రేసింగ్‌లకు వెళుతున్నాడని, ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తున్నాడని, దగ్గర ఉన్న వస్తువులు అమ్మేసి స్మోకింగ్ వంటి వ్యసనాల వైపుకు మళ్లాడని తెలిసేసరికి చాలా ఆలశ్యమైపోయింది. క్లాసులకు హాజరవకుండా కాలేజీవారినే ఏమార్చేవాడని, చదువుకోకుండా డబ్బులిచ్చి రికార్డులు రాయించుకునేవాడని తెలిసి ఆశ్చర్యపోయాను. టాలెంట్ ఉండీ, ఇలా అడ్డదారిలో ఆనందాలను వెతుక్కోవడానికి మేమే కారణం అని తెలిసి నివ్వెరపోయాం. - గాయత్రి (వరుణ్ తల్లి) -
ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ స్కీమ్..
నేనొక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మాలాంటి వాళ్ల కోసం ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌లు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇలాంటి స్కీముల్లో నెలకు ఎంత మొత్తం కనీసంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది? - సూర్యప్రకాశ్, అనంతపురం భారత ప్రభుత్వం ద నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)ను ఆఫర్ చేస్తోంది. భారతీయులెవరైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. 2004, ఏప్రిల్ 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఇది తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగులు కాని వారూ ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఏడాదికి కనీస మొత్తం రూ.6,000 ఇన్వెస్ట్ చేయాలి. ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. మీరు రిటైరయ్యేంత వరకూ మీరు మీ సొమ్ములు వెనక్కి తీసుకోవడానికి లేదు. మీరు రిటైరైన తర్వాత మీరు పొదుపు చేసిన దాంట్లో 40% మొత్తం యాన్యూటీగా మారుతుంది. దీంతో మీకు క్రమం తప్పకుండా పెన్షన్ వస్తుంది. మిగిలిన 60 శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను రాయితీలు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను రాయితీ పొందొచ్చు. పెన్షన్ ఫం డ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) అధీకృత ఏ పాయింట్-ఆఫ్-సేల్(పీఓఎస్) వద్దనైనా మీరు ఎన్పీఎస్ అకౌంట్ ప్రారంభించొచ్చు. నేను పూర్తి వివరాలు తెలుసుకోకుండానే అవైవా సేవ్‌గార్డ్ యులిప్‌లో 2006లో ఇన్వెస్ట్ చేశాను. ఆ తర్వాత ఈ స్కీమ్‌లో భారీగా చార్జీలు ఉన్నాయని గుర్తిం చాను. కానీ సరెండర్ చార్జీలు కూడా అధికంగా ఉండటంతో చేసేదేం లేక ఈ స్కీమ్‌లోనే కొనసాగుతున్నాను. ఎనిమిదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ నాకు చెప్పుకోదగ్గ రాబడులు రాలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? - సువర్చల, హైదరాబాద్ అవైవా సేవ్‌గార్డ్ అనేది నాన్-పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. ప్రతీ ఏడాది ఈ స్కీమ్‌లో వ్యయాల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తారు. ప్రతీ ఏడాది ప్రీమియం అలకేషన్ చార్జీల కింద 4 నుంచి 6 శాతం వసూలు చేస్తారు. ఇక ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు 0.75 శాతం నుంచి 1.75 శాతం రేంజ్లో ఉంటాయి. పాలసీ నిర్వహణ చార్జీలు కూడా ఉంటాయి. మీ పాలసీ టెర్మ్, మీరు చెల్లించే ప్రీమియమ్‌లను బట్టి నెలా నెలా విభిన్నమైన రేట్లలో వీటిని వసూలు చేస్తారు. ఇక చివరగా మోర్టాలిటీ చార్జీ కూడా ఉంటుంది. ఇలాంటి ప్లాన్‌లో ఈ తరహా అధిక చార్జీలు ఉంటాయి. కాబట్టి వీటి రాబడులు తక్కువగా ఉంటాయి. సాంప్రదాయ బీమా స్కీమ్‌లు భారీ స్థాయి రిటర్న్‌లు ఇవ్వలేవు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ స్కీమ్‌లు సురక్షితమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ పాలసీని ఏడు నుంచి ఎనిమిదేళ్లలోపు సరెండర్ చేస్తే ముఖ విలువలో 1 శాతంగా సరెండర్ చార్జీలు చెల్లించాలి. ఎనిమిదేళ్లు దాటితో ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. ఇప్పటిదాకా ఎదురు చూశారు. కాబట్టి ఎనిమిదేళ్లు పూర్తయ్యేదాకా వేచి ఉండి, అ తర్వాత ఈ ప్లాన్ నుంచి వైదొలగండి. ఆ వచ్చిన మొత్తాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు కేటాయించండి. ఎక్కువ కవర్ ఉండే టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. ఈ తరహా టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. రెండో భాగాన్ని బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోండి. హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, టాటా బ్యాలెన్స్డ్, బిర్లా సన్‌లైఫ్ 95 వంటి ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. మా నాన్నగారు ఇటీవలనే ఆస్తి పంపకాలు చేశారు. నా వాటా కింద రూ.90 లక్షల వరకూ వచ్చాయి. మరో 5 నుంచి 8 ఏళ్ల వరకూ నాకు వీటితో అవసరం లేదు. గతంలో మీ జవాబులను చదివి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ మొత్తాన్ని మొదట ఏదైనా డెట్ లేదా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా ఏదైనా బ్యాలెన్స్డ్/ఈక్విటీ ఫండ్‌కు బదిలీ చేయాలి. అయితే ఈ విధానంలో పన్ను సంబంధ అంశాలు ఎలా ఉంటా యి? డెట్ ఫండ్స్ నుంచి మూడేళ్లలోపు ఇన్వెస్ట్మెంట్స్ ను ఉపసంహరించుకుటే ఆదాయపు పన్ను చెల్లిం చాల్సి ఉంటుందా? - రామారావు, హైదరాబాద్ ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయవచ్చు. ఇలా చేస్తే ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని కొత్తగా మరో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లుగా భావిస్తారు. అందుకే డెట్ ఫండ్ నుంచి మూడేళ్లలోపే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరిస్తే దానిపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులను మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. -
ప్రైవేట్ ఉద్యోగులూ అర్హులే..
భువనగిరి :ఆహారభద్రతా (రేషన్) కార్డులకు ప్రైవేటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అర్హులేనని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభలో జరిగిన చర్చలు, సభ్యులనుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను కొంతమేర సడలించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి అదివారం ఈ అదేశాలు అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.లక్షన్నర, పట్టణ ప్రాం తాల్లో రూ.2లక్షల అదాయ పరిమితినే ప్రాతిపదికగా తీసుకొని అర్హులకు కార్డులు జారీ చేయాలని అ శాఖ అధికారులు సూచించారు. అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లాలో 10,67,004 మంది ఆహార భద్రతాకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దర ఖాస్తుల పరిశీలనకు ఉన్న నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే వాటిపై పరిశీలనాధికారి పరిశీలించి సంతృప్తి చెందితే వారికి కార్డులు జారీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే పింఛన్ల దరఖాస్తులో ఆహార భద్రతాకార్డుల పరిశీలన చేశారు. మారిన నిబంధనల నేపథ్యంలో గతంలో పరిశీలన జరిపిన దరఖాస్తులకు కొత్త పరిమితుల మేరకు పునఃపరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆహార భద్రతా కార్డుల జారీలో ఎలాంటి అవకతవకలు జరిగినా, అర్హులకు అందకున్నా, అనర్హులకు అందినా సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం పకడ్బందీగా విచారణ జరపాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. కార్డులజారీపై వినతుల స్వీకరణకు గ్రీవెన్స్ సెల్ సీనియర్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వచ్చే నెలలో నూతనకార్డులు జారీ చేసే అవకాశం ఉంది. 16 నుంచి 30 కిలోలకు పెరగనున్న బియ్యం ఆహార భద్రతాకార్డు కింద యూనిట్‌కు బియ్యం కోటా పెరగనుంది. ఇప్పటివరకు రేషన్‌కార్డులో యూనిట్‌కు నాలుగు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేసేవారు. గరిష్టంగా 16 కిలోలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆహార భద్రత కార్డు కింద ఒక్కో సభ్యుడికి(యూనిట్) ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. కార్డుకు ఐదు యూనిట్లు వరకే పరిమితి చేశారు. కార్డుకు గరిష్టంగా 30 కిలోలు అందజేస్తారు. అంత్యోదయ కార్డులకు గతంలో ఇచ్చినట్టుగానే 3 కిలోల బియ్యం ఇస్తారు. కిలో బియ్యం రూపాయికే సరఫరా చేస్తారు. -
ఓటుహక్కుపై నిరాసక్తత వద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని ప్రతి ఓటరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఓటు విషయంలో నిరాసక్తత ప్రదర్శించకూడదని కలెక్టర్ బి. శ్రీధర్ సూచించారు. ఓటు హక్కు వినియోగంపై కలెక్టర్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ‘ఓటు వేస్తాం’ అంటూ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించి ఆ ఫొటోలను తనకు పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పనిచేసే ఉద్యోగులందరూ జిల్లాలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని, జీహెచ్ఎంసీ పంపిన ఉత్తర్వులను తగు వివరణలతో తిప్పి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు 33 వేల మంది సిబ్బంది అవసరమవగా ఇప్పటి వరకూ 20 వేల మంది వివరాలు మాత్రమే అందాయని, ఇంకా 13 వేల మంది సిబ్బంది కొరత ఉందని తెలిపారు. పదవీ విరమణ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ముందుకు రావాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు 98663 06532 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికల విధులు నిర్వహిస్తామంటూ జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రమాణం చేయించారు. సమావేశంలో ఓటర్ల అవగాహన నోడల్ అధికారి డాక్టర్ అనంతం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సెల్‌చల్ హైటెక్ హరీష్!
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: రాజకీయ నాయకులు ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వినూత్న హైటెక్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. వాల్ పెయింటింగ్స్, పోస్టర్లు, ఫ్లెక్సీలు, సమావేశాలు ప్రచార సాధనాలుగా ఇంతవరకు ఉపయోగపడిన విషయం విదితమే. కాలం మారింది ఇంటికొక్క వాహనం ఉన్నా లేకున్నా ఇంట్లో ఉన్న వారందరికీ దాదాపుగా సెల్ఫోన్లుండటం అనివార్యంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ నేత హరీష్‌రావు సెల్ఫోన్ల ద్వారా నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడటానికి, వారి సమస్యలు వినడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది ఎన్నికలకే కాకుండా ఆ తర్వాత కూడా ఉపయోగపడే విధంగా ఈ నూతన విధానాన్ని రూపొందించుకుంటున్నారు. సెల్‌ఫోన్ నంబర్ల సేకరణ సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, రైతులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కుల సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. ఇందులో యూత్ వింగ్ ప్రతినిధులు సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల నుంచి ఇప్పటికే వేలాది సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. వీటితో పాటు వారి పుట్టిన రోజు తేదీలు, మరిన్ని వివరాలను నమోదు చేస్తున్నారు. నెట్ వర్క్‌తో నేరుగా పలకరింపు.. సేకరించిన సెల్‌ఫోన్ నంబర్ల ద్వారా హరీష్‌రావు నేరుగా వారి పేరుతో పలకరించే విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో శుభాకాంక్షలు ప్రకటిస్తారు. వివిధ సందర్భాలలో కేసీఆర్, హరీష్‌రావులు చేసిన ప్రసంగాలను వినే అవకాశం కూడా కల్పిస్తారు. అభివృద్ధి పనులను ప్రచారం చేయడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబరును త్వరలో ప్రకటించబోతున్నారు. ఏ ఊరికి ఎప్పుడు వస్తారో పార్టీ వర్గాల ద్వారా ప్రజలకు నేరుగా సమాచారం అందడానికి ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వాడుకుని ప్రజలతో నేరుగా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే ఇంట్లో ప్రత్యేక కంప్యూటర్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని సాంకేతిక నిపుణులతో కలిసి ఈ నెట్వర్క్ పనిచేయనుంది. -
కొనుగోళ్లు అంతంత మాత్రమే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో విశేషంగా జరిపే గౌరీ, గణేశ పండుగల పట్ల ఈసారి పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. మార్కెట్లలో కొనుగోళ్లు నీరసంగా సాగుతున్నాయి. ఉన్న సరుకును అమ్ముకుంటే చాలనే భావన వ్యాపారుల్లో కనిపిస్తోంది. ఆదివారం గౌరీ, సోమవారం గణేశ పండుగలను ఆచరిస్తారు. ఇప్పటికే మార్కెట్లు కిటకిటలాడడం ఆనవాయితీ కాగా, ఈసారి ఆ ఛాయలే కనిపించడం లేదు. కొనుగోళ్లు 40 శాతం వరకు తగ్గాయని వ్యాపారుల అంచనా. దీనికి వివిధ రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న చాలా మందికి జీతాలు 8 నుంచి 10 తేదీల మధ్య లభించడం, ఒత్తిడి జీవితంతో విసిగిపోయిన ప్రజలు ఉత్సాహాన్ని కోల్పోవడం, అడపా దడపా పడుతున్న వాన....వల్ల పండుగలంటే ప్రజలు ఉత్సాహం చూపించడం లేదని వినవస్తోంది. ఇక ధరల విషయానికొస్తే... అరటి పండ్లు మినహా మిగిలిన పళ్ల ధరలన్నీ సాధారణంగానే ఉన్నాయి. కూరగాయల్లో ఉల్లి మినహా మిగిలిన వాటి ధర ఏమంత భారమనిపించడం లేదు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మల్లెలు రూ.400, కనకాంబరాలు రూ.1,500 ధర పలుకగా, ఇప్పుడు మల్లెలు ఉదయం పూట రూ.240, సాయంత్రాల్లో రూ.100 పలుకుతోంది. కనకాంబరాల ధర రూ.500-600 మధ్య ఉంది. విగ్రహాలకు కూడా... నగరంలోని ట్యానరీ రోడ్డు, శివాజీ నగర, బాణసవాడి, హలసూరు, మల్లేశ్వరం, యశవంతపుర తదితర అనేక చోట్ల గౌరీ, గణేశుల విగ్రహాలను తయారు చేస్తుంటారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి విగ్రహాలకు అంతగా డిమాండ్ లేదు. ఇక్కడ విగ్రహాల ధరలు రూ.20 మొదలు రూ.లక్ష వరకు పలుకుతుంటాయి. -
ప్రైవేట్ ఉద్యోగులను సభకు అనుమతించని పోలీసులు
హైదరాబాద్: ఎపి ఎన్జీఓలు ఎల్బి స్టేడియంలో నిర్వహించే 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులను తప్ప ఇతరులు ఎవరినీ అనుమతించడంలేదు. కేవలం గుర్తింపు కార్డులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన కళాకారులను కూడా స్టేడియం లోపలకు అనుమతించలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు నగరంలోని ప్రవేట్ ఉద్యోగులు ముఖ్యంగా సాప్ట్వేర్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే పోలీసులు వారిని స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో వారు బయటే నిలబడి నిరసన తెలుపుతున్నారు. వేల మంది జనం స్టేడియం బయట మానవహారంగా ఏర్పడి నినాదాలు చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. స్టేడియం లోపల, బయట సమైక్యాంధ్ర నినాదాల హోరు కొనసాగుతోంది. బహిరంగ సభలో పాటలు పాడేందుకు వచ్చిన గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాద్‌లను కూడా తొలుత లోపలకు అనుమతించలేదు. తాను విఐపి పాస్‌తో వచ్చానని గజల్ శ్రీనివాస్ తెలిపారు. బి గేట్ ద్వారా రమ్మన్నారని, తాను అటువైపు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సమైక్యవాదాన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వినిపించడానికి వచ్చినట్లు వంగపండు ప్రసాద్ తెలిపారు. తనని పోలీసులు ఎల్బి స్టేడియం లోపలకు అనుమతించలేదని చెప్పారు. అయితే ఆ తరువాత గజల్ శ్రీనివాస్‌ను లోపలకు అనుమతించారు. ప్రైవేటు ఉద్యోగులు మాత్రం స్టేడియం బయటే ఉండి నినాదాలు చేస్తున్నారు. తమను లోపలకు అనుమతించకపోయినా తాము సభ ముగిసే వరకు తాము బయటే ఉండి మద్దతు తెలుపుతామని చెప్పారు.