కార్మికుడిని దేశ నిర్మాత చేస్తాం
* కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ
* ప్రైవేటు ఉద్యోగులకూ సామాజిక భ ద్రత కల్పించాం
* ఎన్‌డీఏ ఏడాది పాలనలో ఇదే మా ఘన విజయం
సాక్షి,హైదరాబాద్: మేకిన్ ఇండియాతో కార్మికుడిని దేశ నిర్మాతగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎన్డీయే ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దత్తాత్రేయ శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేటు, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించామని పేర్కొన్నారు.
ఇది మోదీ ప్రభుత్వ ఘన విజయమని చెప్పారు. మేకిన్ ఇండియాతో దేశ స్వరూపం పూర్తిగా మారనున్న నేపథ్యంలో తొలుత కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, పని ప్రదేశాల్లో సరైన వసతులు కల్పించడంతో పాటు కార్మికులకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని చట్టాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్మికుల కనీస పింఛనుగా రూ.1,000 అందించటంతో పాటు ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్ల వివరాలను సంబంధిత కార్మికులకు తెలియచేసేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వసతులు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన ప్రాంతాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయటం, ఉన్న ఆస్పత్రుల స్థాయి పెంచేందుకు కార్యాచరణ ప్రారంభించామని, వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల్లో సేవలను విస్తృతం చేస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళన కు కేంద్ర సాయం...
తెలంగాణ ప్రభుత్వ స్వచ్ఛ హైదరాబాద్ పథకానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, మూసీని ప్రక్షాళన చేసేందుకు రూ.875 కోట్ల పథకానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని దత్తాత్రేయ వెల్లడించారు.