చిరు వ్యాపారులకు వరం.. ముద్ర యోజన
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: చిరు వ్యాపారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురికాకుండా.. కాల్‌మనీ వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా శాశ్వత పరిష్కారం చూపడం కోసమే కేంద్రం ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా రుణాలు మంజూరు చేసే ముద్ర యోజన పథకం చిరు వ్యాపారులకు వరం లాంటిదన్నారు. ముద్ర యోజన పథకంపై మంత్రి దత్తాత్రేయ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముద్ర యోజన కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో 3,37,237 మంది లబ్ధిదారులకు రూ. 3,045 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. అదే విధంగా ఏపీలో కూడా 6,18,093 మంది లబ్ధిదారులకు రూ. 4,654 కోట్లు బ్యాంకుల ద్వారా ఇప్పించామన్నారు. దేశ వ్యాప్తంగా గతేడాది రూ. 85వేల కోట్ల రుణాలు ఇవ్వగా... ఈసారి లక్షా ఎనభైవేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా నినాదాలతో ముందుకెళ్తుంటే ... విపక్షాలు ఓర్వలేక బురద చల్లుతున్నాయని విమర్శించారు. వీసా కార్డు స్థానంలో రూపే కార్డును తీసుకురావడం ద్వారా రూ. 32వేల కోట్లు ఆదా చేయగలిగామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 64 లక్షల మందికి రూపే కార్డులను అందజేసినట్లు వివరించారు. అలాగే తాను ఈ ఏడాది మూడు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని అన్నారం షరీఫ్, సన్నూరు, నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలను దత్తత తీసుకున్నానని, ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పర్యటనలు నిర్వహిస్తామన్నారు.