mudra yojana
-
ముద్రా రుణాల పరిమితి రెట్టింపు చేయాలి
రాబోయే బడ్జెట్లో ముద్రా యోజన కింద ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేయాలని, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) కేంద్రాన్ని కోరుతున్నాయి. అలాగే అన్సెక్యూర్డ్ రుణాలకు రుణ హామీ కవరేజీని రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచాలని ఆశిస్తున్నాయి. అటు అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి తగు మద్దతు కూడా కలి్పంచాలని కోరుకుంటున్నాయి. ఎంఎస్ఎంఈల వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తన ఎజెండాను కొనసాగించే అవకాశం ఉందని బడ్జెట్‌పై నెలకొన్న అంచనాలను అర్క ఫిన్‌క్యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ సైనీ తెలిపారు. ముద్రా రుణాల పరిమితిని పెంచడం తదితర అంశాలతో ఎంఎస్ఎంఈలకు మరిన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రాగలవని, వాటి ఎదుగుదలతో పాటు ఎకానమీ వృద్ధికి కూడా దోహదపడగలవని వివరించారు. రియల్టీ ఆశలు.. బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ఆశలు ఉన్నట్లు క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరడంలో వేతన జీవులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో గృహ రుణాలపై చెల్లించే అసలు, వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గత కొన్నాళ్లుగా ప్రాపరీ్టల విలువ భారీగా పెరిగినందున గృహ రుణ వడ్డీపై పన్ను రిబేటును ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పేర్కొన్నారు. మరోవైపు స్టార్టప్‌ల కోసం పన్నుల విధానాన్ని సరళతరం చేస్తే అంకుర సంస్థలకు ఊరట లభించగలదని సీఆర్ఐబీ సహ వ్యవస్థాపకుడు సన్నీ గర్గ్ తెలిపారు. ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం లేదా క్రమబదీ్ధకరించడమో చేస్తే దేశీయంగా నిధుల లభ్యత మెరుగుపడుతుందని, ప్రారంభ దశలోని అంకుర సంస్థలకు ఫండింగ్‌పరమైన వెసులుబాటు లభించగలదని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బీమా విక్రయాలపై బ్యాంకులకు లక్ష్యాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల విక్రయాలకు సంబంధించి 2023–24 సంవత్సరానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం లక్ష్యాలు విధించింది. అలాగే, ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాలకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక శాఖ లక్ష్యాలు విధించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈ పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. చౌక ధరకే బీమా రక్షణ కల్పించాలన్నది వీటి ఉద్దేశ్యం. 2023 మార్చి నాటికి పీఎంజేజేబీవై పరిధిలో 15.99 కోట్ల మంది పేర్లను నమోదు చేసుకోగా, పీఎంఎస్బీవై పరిధిలో 33.78 కోట్ల మంది సభ్యులుగా చేరారు. గతేడాది పీఎంజేజేబీవై ప్రీమియంను ఏడాదికి రూ.330 నుంచి రూ.436కు పెంచగా, పీఎంఎస్బీవై ప్రీమియాన్ని ఏడాదికి రూ.12 నుంచి రూ.20 చేశారు. పీఎంజేజేబీవై అనేది రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీనిస్తుంది. పీఎంఎస్బీవై అనేది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి స్థాయి అంగవైకల్యం పాలైన సందర్భంలో రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం లభిస్తుంది. పీఎంజేజేబీవైని 18–50 ఏళ్ల వారు, పీఎంఎస్బీవైని 18–70 ఏళ్ల వారు తీసుకోవచ్చు. బ్యాంకుకు దరఖాస్తు ఇస్తే, వారి ఖాతా నుంచి ప్రీమియాన్ని డెబిట్ చేస్తారు. ప్రోత్సహించాలి.. కస్టమర్లు ఏటా ఈ పథకాలను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఒకటికి మించిన సంవత్సరాలకు కొనుగోలు చేసేలా వారిని ప్రోత్సహించాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. గత వారం పీఎస్‌బీల సారథులతో, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు గాను వివిధ పథకాల పరిధిలో 2023–24 సంవత్సరానికి విధించిన లక్ష్యాలను బ్యాంకులు సాధించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాలపై మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 1ను ప్రారంభించడం గమనార్హం. బ్యాంకులు తమ కరస్పాండెంట్ నెట్వర్క్ ద్వారా మరింత మంది కస్టమర్లతో ఈ బీమా పథకాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. -
ఆరేళ్లలో రూ.15 లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన పథకం కింద గణనీయమైన స్థాయిలో రుణ వితరణ నమోదైంది. ఆరేళ్లలో 28 కోట్ల మందికి పైగా లబ్దిదారులకు రూ.15 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం కింద ఎటువంటి తనఖా లేకుండానే రూ.10 లక్షల వరకు రుణ సాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు విభాగాలు కింద.. తయారీ, ట్రేడింగ్, సేవల రంగం, వ్యవసాయం రంగ సంబంధిత పరిశ్రమలకు ఈ పథకం కింద రుణ వితరణ చేయాలన్నది లక్ష్యం. శిశు విభాగం కింద రుణ గ్రహీతలకు 2 శాతం వడ్డీ రాయితీని ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా లాక్డౌన్ల వల్ల ఎదురైన సమస్యల నుంచి చిన్న పరిశ్రమలు గట్టెక్కేందుకు ఈ సాయాన్ని ప్రకటించింది. శిశు విభాగం కింద తనఖా లేకుండా ఒక్కో పరిశ్రమకు రూ.50,000 వరకు రుణం మంజూరవుతుంది. 2020 మార్చి నాటికే శిశు విభాగం కింద 9.37 కోట్ల రుణ ఖాతాలున్నాయి. చదవండి: ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ -
సంపాదనలో సగానికి పైగా ఆదా చేస్తున్న మహిళలు
న్యూఢిల్లీ: పట్టణ మహిళలు (ఉద్యోగం, ఆర్జనలో ఉన్నవారు) పొదుపునకు, పెట్టుబడులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్.. మహిళలను తమ విశ్రాంత జీవనం గురించి ఆలోచింపజేసినట్టు మ్యాక్స్‌లైఫ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. విచక్షణారహితంగా ఖర్చు పెట్టడానికి బదులు పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు.. సంపాదనలో 52 శాతాన్ని తమ లక్ష్యాల కోసం మహిళా ఉద్యోగులు కేటాయిస్తున్నారు. కనీస అవసరాలకు వారు కేటాయిస్తున్న మొత్తం 39 శాతం మించడం లేదు. ఇక దుబారా, ఖరీదైన వాటి కోసం వారు చేస్తున్న ఖర్చు కేవలం 9 శాతంగానే ఉందని మ్యాక్స్‌లైఫ్ ఇండియా సర్వే స్పష్టం చేసింది. సర్వేలో అభిప్రాయం తెలిపిన మహిళల్లో.. 56 శాతం మంది తమ వృద్ధాప్య జీవన అవసరాలు, భద్రత కోసం పొదుపు చేస్తున్నట్టు చెప్పారు. 64 శాతం మంది పిల్లల విద్య కోసం పక్కన పెట్టగా.. అకాల మరణం చెందితే కుటుంబానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో 39 శాతం మంది రక్షణాత్మక చర్యలు తీసుకున్నారు. 40 శాతం మంది వైద్య అత్యవసరాల కోసం పొదుపు చేసినట్టు చెప్పారు. జన్ ధన్ అకౌంట్లలో మెజారిటీ ‘మహిళ’దే!: ఆర్థికశాఖ ప్రకటన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద అకౌంట్లు కలిగివున్న వారిలో 55 శాతం మంది మహిళలేనని ఆర్థికశాఖ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములుగా చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రత్యక్షంగా లబ్దిదారులకు అందాలని లక్ష్యంగా 2014 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. అదే ఏడాది ఆగస్టు 28న పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల్లో మహిళా భాగస్వామ్యానికి సంబంధించి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థికశాఖ ఒక ప్రకటన చేసింది. మహిళల సాధికారితను పెంచే క్రమంలో జన్ ధన్ యోజన కీలకమైనదని ఈ ప్రకటనలో వ్యాఖ్యానించింది. 2018లో ఈ పథకం ప్రయోజనాలను మరింత పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రమాద బీమా రెట్టింపు, ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి పెంపు వంటి పలు కీలక ప్రయోజనాలు రెండవ వెర్షన్ కింద ప్రవేశపెట్టడం జరిగింది. 2021 ఫిబ్రవరి 24వ తేదీ నాటికి జన్ ధన్ యోజన కింద అకౌంట్ల సంఖ్య 41.93 కోట్లుగా పేర్కొంది. ఇందులో 23.21 కోట్లు మహిళలకు చెందినవని వివరించింది. ముద్రా యోజన ద్వారా మహిళలకు రూ.6.36 లక్షల కోట్లు కాగా, ప్రధానమంత్రి ముంద్ర యోజన (పీఎంఎంవై) అకౌంట్ల విషయంలో 68శాతం(19.04 కోట్లు)తో మహిళలే మందున్నారని ఆర్థికశాఖ ప్రకటన పేర్కొంది. 2021 ఫిబ్రవరి 26వ తేదీనాటికి రూ.6.36 లక్షల కోట్లను మహిళా పారిశ్రామికవేత్తలకు మంజూరు చేసినట్లు తెలిపింది. 2015 ఏప్రిల్ 8వ తేదీన ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. లఘు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షలవరకూ రుణం అందజేయాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఈ రుణాలను మంజూరుచేస్తాయి. స్టాండ్–అప్ ఇండియా స్కీమ్‌లోనూ అగ్రస్థానం స్టాండ్–అప్ ఇండియా స్కీమ్‌కు సంబంధించి 81 శాతానికిపైగా (91,109 అకౌంట్లు) అకౌంట్ల విషయంలో రూ.20,749 కోట్లను మహిళలకు మంజూరుచేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. 2016 ఏప్రిల్ 5వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. క్రింది స్థాయి మహిళలు, బలహీన వర్గాల ఆర్థిక సాధికారత, ఉపాధి కల్పన లక్ష్యంగా 2016 ఏప్రిల్ 5న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం బ్యాంక్ ద్వారా కింద రూ.10 లక్షల నుంచి కోటి వరకూ రుణ సౌలభ్యం పొందే వెసులుబాటు ఉంది. ప్రత్యేకించి మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలన్నది లక్ష్యం. -
చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా..
నిడమర్రు : చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయుతనిచ్చేలా 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ(ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకూ రుణాలు అందిస్తుంది. ఈ పథకం రూ.20 వేల కోట్ల కార్పస్ నిధి ఏర్పాటు చేసింది. బ్యాంకులకు గ్యారంటీగా ఉండటానికి ప్రభుత్వం ఈ మూలధనాన్ని కేటాయించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఎలా ప్రయోజనం పొందాలో, అర్హతలు ఏమి ఉండాలో తెలుసుకుందాం. ముద్ర పథకంలో రుణాలు మైక్రో యూనిట్స్ అభివృద్ధి, రీఫైనాన్సింగ్ కార్యకలాపాల కోసం చిన్నతరహా వ్యాపారవేత్తలకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకూ ముద్ర రుణాలు ఇస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు 7 శాతం వడ్డీ రేటుపై రీఫైనాన్స్ సేవలను అందిస్తుంది. తయారీ, సర్వీసులు తదితర రంగాల్లోని చిన్న వ్యాపారులకు రుణాలు కల్పించే సంస్థల మార్గదర్శకాలు రూపొందించడం, ఎంఎఫ్‌ఐల రిజిస్ట్రేషన్, రేటింగ్ మొదలైన అంశాలను ముద్ర పర్యవేక్షిస్తుంది. ముద్ర నుంచి తీసుకునే మొత్తాన్ని రుణంగా ఇచ్చేటప్పుడు నిర్దిష్ట వడ్డీ రేటుకు మించి వసూలు చేయకుండా పరిమితి విధిస్తుంది. సూక్ష్మ రుణ సంస్థలు(ఎంఎఫ్ఐ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ) కూడా ముద్ర నుంచి రుణాలు తీసుకోవచ్చని, తదుపరి ఆ మొత్తాన్ని ఇతరులకు రుణాలిచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. రుణ రకాలు : ఫండింగ్ దశను బట్టి ‘శిశు’, ‘కిశోర్’, ‘తరుణ్’ పేరిట మూడు రకాల పథకాల కింద ముద్ర యోజన నిధులు సమకూర్చుతుంది. శిశు: రూ. 50 వేల వరకు, కిశోర్: రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ, తరుణ్: రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలను వర్గీకరించారు. రుణం పొందుటకు అర్హతలు వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగా ఉండాలి. ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో రుణ అవసరం రూ.10 లక్షలలోపు ఉండాలి. పైన పేర్కొన్న అర్హతగల వారు దగ్గరలో ఉన్న బ్యాంక్, సూక్ష్మ రుణ సంస్థ(ఎంఎఫ్ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) అధికారులను సంప్రదించాలి. ఈ పథకం వర్తించే రంగాలు రవాణా/కార్యాచరణ –ఆటో రిక్షా, చిన్న వస్తువులు రవాణా వాహనం, త్రిచక్ర వాహనాలు, ఈ–రిక్షా, ప్యాసింజర్ కార్లు, టాక్సీలు మొదలైనవి, సరుకుల రవాణా, వ్యక్తిగత రవాణా కోసం వాహనాలు కొనుగోలు, కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు కార్యక్రమాలు–బ్యూటీ పార్లర్స్, వ్యాయామశాల, షాపులు, టైలరింగ్ దుకాణాలు, డ్రై క్లీనింగ్, మోటర్ సైకిల్ మరమ్మతు దుకాణం, డీటీపీ, ఫొటో సౌకర్యాలు, మెడిసిన్ దుకాణాలు, కొరియర్ ఏజెంట్లు మొదలైనవి. ఆహార ఉత్పత్తులు సెక్టార్ : అప్పడాలు/పచ్చళ్లు/జామ్/జెల్లీ తయారీ, వ్యవసాయ ఉత్పత్తుల పరిరక్షణకు గ్రామీణస్థాయి, మిఠాయి దుకాణాలు, ఆహారం స్టాళ్లు, రోజూ క్యాటరింగ్/ రోజువారీ క్యాటరింగ్ సేవలకు/కోల్డ్ స్టోరేజ్/ఐస్ అండ్ ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్లు, బిస్కెట్స్, రొట్టె ల తయారీ మొదలైనవి. వస్త్ర ఉత్పత్తుల సెక్టార్ : చేనేత, జరీ మరియూ జర్దారీ పని, సంప్రదాయ ఎంబ్రాయిడరీ, చేతిపని, సంప్రదాయ అద్దకం, ప్రింటింగ్, దుస్తులు డిజైన్, అల్లడం, పత్తి జిన్నింగ్, కంప్యూటరీకరణ ఎంబ్రాయిడరీ, బ్యాగులు మొదలైనవి. రుణం పొందే విధానం ఈ ముద్ర పథకం కింద సహాయం పొందగోరేవారు వారి ప్రాంతాల్లో ఆర్థిక సంస్థల ఏ యొక్క స్థానిక శాఖ అధికారులనైనా సంప్రదించవచ్చును. పీఎస్‌యూ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు తదితర రుణ సంస్థలను సంప్రదించాలి. రుజువుల కోసం ఇలా.. గుర్తింపు రుజువు : ఓటరు ఐడీ కార్డు/డ్రైవింగ్/ఆధార్ కార్డు వంటి ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన గుర్తింపు కార్డు, నివాస రుజువు కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలు. రెండు ఫొటోలు, మెషినరీ/ఇతర వస్తువులను కొనుగోలు కొటేషన్, సరఫరాదారు పేరు/యంత్రాలు ధర కొనుగోలు వివరాలు, వ్యాపార సంస్థకు సంబంధించిన లైసెన్స్/నమోదు సర్టిఫికెట్లు, వ్యాపార యూనిట్ చిరునామా రుజువు, ఎస్టీ /ఎస్సీ/ఓబీసీ/మైనార్టీ ధ్రువీకరణ పత్రం. ఈ పథకం ప్రత్యేకతలు బ్యాంక్‌లు/ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అలాగే అదనపు హామీ ఉండదు. రుణం తిరిగి చెల్లించే కాలం ఐదేళ్ల వరకు పొడిగించారు. అభ్యర్థి ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థకు డిపాల్టర్‌గా ఉండకూడదు. -
ముద్రా యోజనకు రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరాల జల్లు కురిపించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ముద్రా పథకం కింద రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. 2015 ఏప్రిల్‌లో ప్రారంభించిన ముద్రా యోజన పథకం ద్వారా రూ.4.6 లక్షల కోట్ల రుణాలను ఇచ్చారు. ఈ పథకం కింద 10.38 కోట్ల మంది లబ్ధిపొందారు. రుణ ఖాతాలు ఉన్న వారిలో 76 శాతం మంది మహిళలు ఉండగా, 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారని జైట్లీ తెలిపారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన(పీఎమ్ఎమ్వై)లో శిశు, కిషోర్, తరుణ్ అనే పథకాల కింద రుణాలను ఇస్తారు. -
ముద్ర యోజనతో 5.5 కోట్ల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్న వ్యాపారస్తులకు వరం లాంటి ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం(పీఎంఎంవై) భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించిందని తాజా రిపోర్టులో తెలిసింది. ఈ పథకం పారిశ్రామిక రాష్ట్రాల్లో దాదాపు 5.5 కోట్ల మందికి ఉద్యోగవకాశాలు కల్పించినట్టు స్కోచ్ రిపోర్టు పేర్కొంది.. ముద్ర పథకంతో ఎక్కువగా లబ్ది పొందిన రాష్ట్రాల్లో కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నట్టు చెప్పింది. 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముద్ర స్కీమ్‌ను లాంచ్ చేశారు. ఈ స్కీమ్ కింద 8 కోట్లకు పైగా ప్రజలకు రూ.3.42 లక్షల కోట్ల రుణాలు అందజేశారు. వీరిలో ఎక్కువగా చిన్న వ్యాపారస్తులే ఉన్నారని రిపోర్టులో తెలిసింది. వ్యవసాయేతర కార్యకలాపాలకు రూ.10 లక్షల వరకు ముద్ర రుణం అందుబాటులో ఉంటుంది. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు డెయిరీ, ఫౌల్ట్రీ, బీ-కీపింగ్ వంటి వాటికి ముద్ర పథకం రుణాలు అందిస్తోంది. -
చిరు వ్యాపారులకు వరం.. ముద్ర యోజన
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: చిరు వ్యాపారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురికాకుండా.. కాల్‌మనీ వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా శాశ్వత పరిష్కారం చూపడం కోసమే కేంద్రం ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా రుణాలు మంజూరు చేసే ముద్ర యోజన పథకం చిరు వ్యాపారులకు వరం లాంటిదన్నారు. ముద్ర యోజన పథకంపై మంత్రి దత్తాత్రేయ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముద్ర యోజన కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 3,37,237 మంది లబ్ధిదారులకు రూ. 3,045 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. అదే విధంగా ఏపీలో కూడా 6,18,093 మంది లబ్ధిదారులకు రూ. 4,654 కోట్లు బ్యాంకుల ద్వారా ఇప్పించామన్నారు. దేశ వ్యాప్తంగా గతేడాది రూ. 85వేల కోట్ల రుణాలు ఇవ్వగా... ఈసారి లక్షా ఎనభైవేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా నినాదాలతో ముందుకెళ్తుంటే ... విపక్షాలు ఓర్వలేక బురద చల్లుతున్నాయని విమర్శించారు. వీసా కార్డు స్థానంలో రూపే కార్డును తీసుకురావడం ద్వారా రూ. 32వేల కోట్లు ఆదా చేయగలిగామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 64 లక్షల మందికి రూపే కార్డులను అందజేసినట్లు వివరించారు. అలాగే తాను ఈ ఏడాది మూడు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని అన్నారం షరీఫ్, సన్నూరు, నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలను దత్తత తీసుకున్నానని, ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పర్యటనలు నిర్వహిస్తామన్నారు. -
‘ముద్ర’ ప్రారంభం
జార్ఖండ్‌లో ప్రారంభించిన ప్రధాని ఖుంటి(జార్ఖండ్): జార్ఖండ్‌లో శుక్రవారం ముద్ర యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. సంథాల్ పరగణాలోని దుంకాలో ‘ముద్ర మహారుణ మేళా’ను, బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ పథకాన్ని ప్రారంభించారు. ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులకు తొలి విడతగా మోదీ రూ. 10 వేల చొప్పున రుణం అందించారు. ఇది రుణమని, దీన్ని నామమాత్ర వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వడ్డీ భారం పడకుండా విడతలవారీగా రుణం తీసుకోవడం ఉత్తమమని సూచించారు. పేదల జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజనను ముందుకు తీసుకువచ్చామన్నారు. సంథాల్ పరగణాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను ప్రస్తావిస్తూ.. పేదలకు బ్యాంకింగ్ సదుపాయాలు, బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ. 26 వేల కోట్లను 20 లక్షల మంది మహిళలు సహా అర్హులైన 42 లక్షల మందికి రుణాలుగా అందిస్తారు. అంతకుముందు, జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా కోర్టు, కలెక్టరేట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన 180 కేవీ సౌర విద్యుత్ ప్లాంటునూ మోదీ ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ, ఆయన జయంతి అక్టోబర్ 2 తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్నారు. పేదలకు న్యాయం జరగాలన్న బాపూజీ కల.. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు ద్వారానే సాకారమవుతుందన్నారు. దేశంలోనే సౌరవిద్యుత్ సౌకర్యమున్న తొలి కోర్టుగా ఖుంటి జిల్లా కోర్టు నిలిచిందని, ఇదే బాపూజీకి ఘన నివాళి అని అన్నారు. స్వచ్ఛభారత్‌కు కలసిరండి.. లేదా తప్పుకోండి! న్యూఢిల్లీ: ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తే తప్ప ‘స్వచ్ఛభారత్’ విజయం సాధించలేదని మోదీ తేల్చి చెప్పారు. ఆ ఉద్యమాన్ని ఏ ఒక్క వ్యక్తికో, ప్రభుత్వానికో, లేక ఏ ఒక్క పార్టీకో ఆపాదిస్తే అది విఫలమవుతుందన్నారు. ‘స్వచ్ఛభారత్ కార్యక్రమం నచ్చనివారు అందులో పాల్గొనకండి.. పక్కకు తప్పుకోండి.. అంతేకానీ విమర్శించకండి’ అంటూ విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛభారత్‌లో చురుగ్గా పాల్గొన్న వారికి శుక్రవారం ఆయన ఢిల్లీలో అవార్డులు అందజేసి ప్రసంగించారు.