నిడమర్రు : చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయుతనిచ్చేలా 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ(ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకూ రుణాలు అందిస్తుంది.
ఈ పథకం రూ.20 వేల కోట్ల కార్పస్ నిధి ఏర్పాటు చేసింది. బ్యాంకులకు గ్యారంటీగా ఉండటానికి ప్రభుత్వం ఈ మూలధనాన్ని కేటాయించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఎలా ప్రయోజనం పొందాలో, అర్హతలు ఏమి ఉండాలో తెలుసుకుందాం.
ముద్ర పథకంలో రుణాలు
మైక్రో యూనిట్స్ అభివృద్ధి, రీఫైనాన్సింగ్ కార్యకలాపాల కోసం చిన్నతరహా వ్యాపారవేత్తలకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకూ ముద్ర రుణాలు ఇస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు 7 శాతం వడ్డీ రేటుపై రీఫైనాన్స్ సేవలను అందిస్తుంది.
తయారీ, సర్వీసులు తదితర రంగాల్లోని చిన్న వ్యాపారులకు రుణాలు కల్పించే సంస్థల మార్గదర్శకాలు రూపొందించడం, ఎంఎఫ్‌ఐల రిజిస్ట్రేషన్, రేటింగ్ మొదలైన అంశాలను ముద్ర పర్యవేక్షిస్తుంది. ముద్ర నుంచి తీసుకునే మొత్తాన్ని రుణంగా ఇచ్చేటప్పుడు నిర్దిష్ట వడ్డీ రేటుకు మించి వసూలు చేయకుండా పరిమితి విధిస్తుంది.
సూక్ష్మ రుణ సంస్థలు(ఎంఎఫ్‌ఐ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ) కూడా ముద్ర నుంచి రుణాలు తీసుకోవచ్చని, తదుపరి ఆ మొత్తాన్ని ఇతరులకు రుణాలిచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు.
రుణ రకాలు :
ఫండింగ్ దశను బట్టి ‘శిశు’, ‘కిశోర్’, ‘తరుణ్’ పేరిట మూడు రకాల పథకాల కింద ముద్ర యోజన నిధులు సమకూర్చుతుంది. శిశు: రూ. 50 వేల వరకు, కిశోర్: రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ, తరుణ్: రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలను వర్గీకరించారు.
రుణం పొందుటకు అర్హతలు
వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగా ఉండాలి. ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో రుణ అవసరం రూ.10 లక్షలలోపు ఉండాలి. పైన పేర్కొన్న అర్హతగల వారు దగ్గరలో ఉన్న బ్యాంక్, సూక్ష్మ రుణ సంస్థ(ఎంఎఫ్‌ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అధికారులను సంప్రదించాలి.
ఈ పథకం వర్తించే రంగాలు
రవాణా/కార్యాచరణ
–ఆటో రిక్షా, చిన్న వస్తువులు రవాణా వాహనం, త్రిచక్ర వాహనాలు, ఈ–రిక్షా, ప్యాసింజర్ కార్లు, టాక్సీలు మొదలైనవి, సరుకుల రవాణా, వ్యక్తిగత రవాణా కోసం వాహనాలు కొనుగోలు, కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు కార్యక్రమాలు–బ్యూటీ పార్లర్స్, వ్యాయామశాల, షాపులు, టైలరింగ్ దుకాణాలు, డ్రై క్లీనింగ్, మోటర్ సైకిల్ మరమ్మతు దుకాణం, డీటీపీ, ఫొటో సౌకర్యాలు, మెడిసిన్ దుకాణాలు, కొరియర్ ఏజెంట్లు మొదలైనవి.
ఆహార ఉత్పత్తులు సెక్టార్ :
అప్పడాలు/పచ్చళ్లు/జామ్/జెల్లీ తయారీ, వ్యవసాయ ఉత్పత్తుల పరిరక్షణకు గ్రామీణస్థాయి, మిఠాయి దుకాణాలు, ఆహారం స్టాళ్లు, రోజూ క్యాటరింగ్/ రోజువారీ క్యాటరింగ్ సేవలకు/కోల్డ్ స్టోరేజ్/ఐస్ అండ్ ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్లు, బిస్కెట్స్, రొట్టె ల తయారీ మొదలైనవి.
వస్త్ర ఉత్పత్తుల సెక్టార్ :
చేనేత, జరీ మరియూ జర్దారీ పని, సంప్రదాయ ఎంబ్రాయిడరీ, చేతిపని, సంప్రదాయ అద్దకం, ప్రింటింగ్, దుస్తులు డిజైన్, అల్లడం, పత్తి జిన్నింగ్, కంప్యూటరీకరణ ఎంబ్రాయిడరీ, బ్యాగులు మొదలైనవి.
రుణం పొందే విధానం
ఈ ముద్ర పథకం కింద సహాయం పొందగోరేవారు వారి ప్రాంతాల్లో ఆర్థిక సంస్థల ఏ యొక్క స్థానిక శాఖ అధికారులనైనా సంప్రదించవచ్చును. పీఎస్‌యూ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు తదితర రుణ సంస్థలను సంప్రదించాలి.
రుజువుల కోసం ఇలా..
గుర్తింపు రుజువు :
ఓటరు ఐడీ కార్డు/డ్రైవింగ్/ఆధార్ కార్డు వంటి ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన గుర్తింపు కార్డు, నివాస రుజువు కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలు. రెండు ఫొటోలు, మెషినరీ/ఇతర వస్తువులను కొనుగోలు కొటేషన్, సరఫరాదారు పేరు/యంత్రాలు ధర కొనుగోలు వివరాలు, వ్యాపార సంస్థకు సంబంధించిన లైసెన్స్/నమోదు సర్టిఫికెట్లు, వ్యాపార యూనిట్ చిరునామా రుజువు, ఎస్టీ /ఎస్సీ/ఓబీసీ/మైనార్టీ ధ్రువీకరణ పత్రం.
ఈ పథకం ప్రత్యేకతలు
బ్యాంక్‌లు/ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అలాగే అదనపు హామీ ఉండదు. రుణం తిరిగి చెల్లించే కాలం ఐదేళ్ల వరకు పొడిగించారు. అభ్యర్థి ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థకు డిపాల్టర్‌గా ఉండకూడదు.
Comments
Please login to add a commentAdd a comment