small industries
-
చిన్న పరిశ్రమలపై భారీ ఆశలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగం పురోగతి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడటం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆరు ప్రత్యేక విధానాలకు రూపకల్పన చేస్తోంది. ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఆరు విధానాల రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) పాలసీ–2024’ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. ఎంఎస్ఎంఈల స్థాపన, అభివృద్ధి దిశగా ఈ విధానం ఉంటుందని, కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త పాలసీ పరిష్కారం చూపుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.ఐదు అంశాలకు పెద్దపీట: రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 15కు పైగా పారిశ్రామిక సంఘాలను భాగస్వాములను చేస్తూ నిపుణుల నుంచి వందకు పైగా సలహాలు, సూచనలు స్వీకరించి ‘ఎంఎస్ఎంఈ పాలసీ 2024’ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. ఇందులో ఐదు అంశాలకు పెద్దపీట వేసినట్లు సమాచారం. ‘ఎస్సీ, ఎస్టీలు, మహిళలు సహా అందరికీ లబ్ధి’, ‘అన్ని ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు సమరీతిలో అభివృద్ధి’, ‘ఉత్పాదక సామర్థ్యం పెంపుదల’, ‘ఉపాధి కల్పన పెంచడం’, ‘టెక్నాలజీ ఆధునీకరణ’కు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఎంఎస్ఎంఈల సవాళ్లకు పరిష్కారం: భూమి, నిధులు, ముడి సరుకులు, కారి్మకులు, సాంకేతికత, మార్కెటింగ్ తదితర రూపాల్లో ఎంఎస్ఎంఈలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్ల పరిష్కారం కోసం నూతన పాలసీలో అనేక ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఎంఎస్ఎంఈ ల అభివృద్ధి కేంద్రాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు, ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలకు 10 శాతం వరకు రిజర్వేషన్లు కలి్పంచే అవకాశం ఉంది. మూల ధన పెట్టుబడిపై సబ్సిడీ, నైపుణ్య శిక్షణ కోసం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’లో ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడే కోర్సులు వంటివి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న ఎంఎస్ఎంఈల్లో సాంకేతికత ఆధునీకరణ కోసం రూ.100 కోట్ల నిధితో ఓ ప్రత్యేక పథకాన్ని కూడా ప్రవేశ పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల కొనుగోలుకు ప్రత్యేక సేకరణ విధానంపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. -
చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిస్తోన్న సీఎం జగన్ పారిశ్రామిక పాలసీలు
-
చిన్న పరిశ్రమలతో లక్షలాది ఉద్యోగాలు.. ఎంఎస్ఎంఈలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) నిరుద్యోగులకు వరం. వీటి ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్నిస్తోంది. వీటి ద్వారా లక్షలాది ఉద్యోగాలతోపాటు భారీగా పెట్టుబడులూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహకాలనిస్తున్నారు. కోవిడ్ సంక్షోభంలో కూడా ఈ పరిశ్రమలు నిలదొక్కుకొనేందుకు వివిధ రకాల ప్రోత్సాహకాలతో ఆదుకున్నారు. చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ దీంతో ఈ రంగం రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతోంది. 2019 జూన్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య మూడేళ్లలో 1,06,249 ఎంఎస్ఎంఈ యూనిట్లు కొత్తగా ఏర్పాటుకాగా, వీటి ద్వారా 7,22,092 మందికి ఉపాధి లభించింది. రూ.14,656 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన ఎంఎస్ఈ పోర్టల్ ‘ఉదయం’ కూడా ఈ వివరాలను పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 2,32,998 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండగా అందులో 45.6 శాతం ఈ మూడేళ్లలో వచ్చినవే. ఈ మొత్తం ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 19,41,974 మందికి ఉపాధి లభిస్తుండగా అందులో 7.22 లక్షల మందికి ఈ మూడేళ్లలో లభించినవే. ఎంఎస్ఎంఈ రంగంలో ప్రతి కోటి రూపాయల పెట్టుబడి మీద సగటున 61 మందికి ఉపాధి లభిస్తోంది. ప్రతి యూనిట్ సగటున 8 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుండటంతో యూనిట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ వంటి కష్ట కాలంలో రీస్టార్ట్ ప్యాకేజ్ రూపంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడమే కాకుండా వరుసగా ప్రతి ఏడాదీ రాయితీలను ఇవ్వడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో కలిపి అన్ని పరిశ్రమలకు రూ.3,409.66 కోట్ల పారిశ్రామిక బకాయిలు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని బాగా దెబ్బతీసింది. ఇటువంటి సమయంలో ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లతో పాటు ప్రస్తుత కాలానికి రూ.362.48 కోట్ల ప్రోత్సాహకాలు కలిపి మొత్తం రూ.1,324.53 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. వరుసగా మూడో ఏడాది మరో రూ.738.59 కోట్లు విలువైన ప్రోత్సాహక రాయితీలను చెల్లించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రతి జిల్లాలో రెండు క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 53 క్లస్టర్లను గుర్తించి, 16 క్లస్టర్లకు డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఈ 16 క్లస్టర్ల ద్వారా మరో 28,270 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ విక్రయానికి అవకాశం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు తయారు చేసిన ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకునేలా వీటిని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) ప్రవేశపెట్టిన ఎంఎస్ఎంఈ మార్ట్‌తో అనుసంధానం చేశాం. ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణాలిచ్చేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదన దగ్గర నుంచి విక్రయం వరకు అన్ని విధాలుగా చేయూతనిస్తున్నాం. – వంకా రవీంద్రనాథ్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ -
Andhra Pradesh: రీస్టార్ట్‌తో నవోదయం
సాక్షి, అమరావతి: చిన్న పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో రెండేళ్లలోనే దాదాపు 23 వేల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటినుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. పలు రాయితీలు, ఆర్థిక తోడ్పాటు కల్పిస్తూ కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రీస్టార్ట్... బకాయిల చెల్లింపు కోవిడ్ కష్ట కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ.. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు మూత పడకూడదన్న ఉద్దేశంతో సీఎం జగన్ దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ సత్ఫలితాలనిస్తోంది. గత సర్కారు పెట్టిన పారిశ్రామిక బకాయిలను సైతం ఒకేసారి చెల్లించి పరిశ్రమలు నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టారు. దీంతో పాత యూనిట్లు ఊపిరి పీల్చుకున్నాయి. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడటంతో కొత్త యూనిట్లు భారీగా ఏర్పాటవుతున్నాయి. కోవిడ్ ఉధృతిలోనూ... 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా 22,844 సూక్ష్మ, చిన్న మధ్య తరహా యూనిట్లు కొత్తగా ఏర్పాటు కావడం గమనార్హం. వీటి ద్వారా రూ.7,015.48 కోట్ల పెట్టుబడులు రాగా 1,56,296 మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పారిశ్రామిక రంగంలో ఎంత విశ్వాసాన్ని కల్పించాయంటే కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయిలో ఉన్న సమయం (2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్) మధ్య కొత్తగా 2,364 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. కోవిడ్ సమయంలో కూడా రూ.1,753.86 కోట్ల పెట్టుబడులతో 24,043 మందికి ఎంఎస్ఎంఈలు ఉపాధి కల్పించాయి. ప్రభుత్వం ఇలా ఆదుకుంది... ► కోవిడ్ విపత్తు సమయంలో పరిశ్రమలను ఆదుకుంటూ 2020 మేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1,110 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజిని ప్రకటించారు. దీనివల్ల 7,718 యూనిట్లు నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగించగలిగాయి. ► గత రెండేళ్లలో 13,844 ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ.2,086 కోట్ల పారిశ్రామిక రాయితీలను ప్రభుత్వం విడుదల చేసింది. ► ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలు ఇచ్చింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్లు రాయితీలిచ్చింది. ► రుణాలు తిరిగి చెల్లించలేక ఎన్పీఏలుగా మారిన 1,08,292 యూనిట్లకు సంబంధించి రూ.3,236.52 కోట్ల విలువైన మూలధన రుణాలను వైఎస్సార్ నవోదయం పథకం కింద పునర్వ్యవస్థీకరించింది. ► కోవిడ్ సమయంలో అదనపు మూలధనం సమకూర్చుకునేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ఈసీఎల్జీఎస్) ద్వారా రూ.5,973 కోట్ల రుణాలను అదనంగా ఎంఎస్ఎంఈలకు అందించింది. దీంతో పరిశ్రమలకు నూతనోత్తేజం లభించింది. పాతవి ఉత్పత్తిని కొనసాగిస్తుండగా కొత్తవి పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. లాక్డౌన్లో ఆదుకుంది లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా ప్రోత్సాహకాలను విడుదల చేసి పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద అందిన రూ.75 లక్షలతో రుణాలను సకాలంలో చెల్లించడంతోపాటు ఉత్పత్తి కొనసాగించడడానికి తగిన నగదు సమకూరింది. దీంతో లాక్డౌన్లో కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ కార్మికులకు జీతాలు చెల్లించగలిగాం. మళ్లీ ఉత్పత్తి కొనసాగించాం. కామాక్షి మెటల్ బిల్డింగ్ ప్రోడక్ట్స్, కొండ గుంటూరు, తూర్పు గోదావరి రీస్టార్ట్‌తో కొండంత ఉపశమనం కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అమ్మకం పన్ను రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఒకేసారి రూ.1.04 కోట్లు చెల్లించారు. ఇది మాకు కొండంత ఉపశమనాన్ని కలిగించింది. ఈ మొత్తంతో బ్యాంకు రుణాలను చెల్లించడంతో పాటు ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించగలిగాం. మళ్లీ పరిశ్రమను నడపగలుగుతున్నాం. దాల్మియా లామినేటర్స్ లిమిటెడ్, తడ, నెల్లూరు -
ఏపీ: ఉపాధికి ఊతమిచ్చేలా ఎంఎస్ఈ క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కువమందికి ఉపాధి కల్పించే చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎంఎస్ఈ–సీడీపీ) కింద ఐదు క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు ఏపీ ఎంఎస్ఎం ఈ కార్పొరేషన్ సీఈవో ఆర్.పవనమూర్తి తెలిపారు. ఎంఎస్ఈ–సీడీపీ కింద మొత్తం రూ.60.80 కోట్లతో 5 చోట్ల ఉమ్మడిగా వినియోగిం చుకునే విధంగా కామన్ ఫెసిలిటీ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఫర్నిచర్, మాచవరంలో పప్పు దినుసులు, కాకినాడలో ప్రింటింగ్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బంగారు ఆభరణాలు, నెల్లూరులో గార్మెంట్ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్టు పవనమూర్తి తెలిపారు. వీటికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో రూ.43.20 కోట్లు ఇవ్వనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.11.50 కోట్లు, క్లస్టర్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కంపెనీ రూ.6.10 కోట్లు వ్యయం చేయనున్నాయి. మహిళల కోసం గార్మెంట్ క్లస్టర్ ఈ ఐదు క్లస్టర్ల ద్వారా ఏటా రూ.117 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని, సుమారు 8,600 మందికి ఉపాధి లభిస్తుందని ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అంచనా వేసింది. నెల్లూరులో ఏర్పాటు చేసే గార్మెంట్ క్లస్టర్‌ను పూర్తిగా మహిళలకే ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చేస్తారు. కాకినాడలో ఏర్పాటు చేసే ప్రింటింగ్ క్లస్టర్లో అధునాతనమైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల తక్కువ వ్యయంతో నాణ్యతతో కూడిన ముద్రణ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరి కావడంతో జగ్గయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న జ్యూవెలరీ క్లస్టర్లో ఆభరణాల స్వచ్ఛతను పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇవి కాకుండా కాకినాడలో ఆటో ఇంజనీరింగ్ క్లస్టర్, నెల్లూరులో జ్యూవెలరీ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదనుల పంపామని, వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని పవనమూర్తి వెల్లడించారు. -
మరో 2 ఎంఎస్ఎంఈ క్లస్టర్లు
సాక్షి, అమరావతి: అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాజమహేంద్రవరంలో ఫర్నిచర్, నెల్లూరులో గార్మెంట్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తూ చిన్న పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఈ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవో పవనమూర్తి ‘సాక్షి’కి వెల్లడించారు. సుమారు రూ.14.98 కోట్లతో రాజమహేంద్రవరం వద్ద ఫర్నిచర్ క్లస్టర్, నెల్లూరు వద్ద రూ.8.23 కోట్లతో గార్మెంట్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. క్లస్టర్ అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ 10 % పెట్టుబడి పెడితే కేంద్రం 70 %, రాష్ట్రం 20 % నిధులను కేటాయిస్తుందన్నారు. వేలాది మందికి ఉపాధి రాజమహేంద్రవరం క్లస్టర్ పరిధిలో ఫర్నిచర్, డిజైనింగ్‌కు సంబంధించి 160 యూనిట్ల ద్వారా ఏటా రూ.60 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అంచనా వేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రెండేళ్లలో వ్యాపార పరిమాణాన్ని రూ.90 కోట్లకు పెంచడంతో పాటు అదనంగా 1,000 మంది వరకు ప్రత్యక్షంగా, 4,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. సాధారణంగా ఒక చెట్టును కొట్టిన తర్వాత కలపను ఎండబెట్టి ఫర్నిచర్‌గా మార్చేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ క్లస్టర్లో వుడ్ సీజనింగ్ మిషన్ టెక్నాలజీ అందుబాటులోకి తేవడం ద్వారా కలపను ఆరబెట్టడం ద్వారా వెంటనే ఫర్నిచర్ తయారీకి వినియోగించవచ్చు. అలాగే క్వాడ్‌కామ్ టెక్నాలజీతో కావాల్సిన డిజైన్లను వేగంగా తీర్చిదిద్దడంతో పాటు బొమ్మలు తయారీకి శాండింగ్, మౌల్డింగ్ టెక్నాలజీలను అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల ఎంఎస్ఎంఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ద్వారా లాభాలు 20 – 25 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. రెండేళ్లలో ఈ క్లస్టర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కనీసం నాలుగు నుంచి ఐదు ఎగుమతి ఆధారిత యూనిట్లను ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పవనమూర్తి తెలిపారు. రెడీమేడ్ క్లస్టర్‌తో మహిళలకు ఉపాధి నెల్లూరు జిల్లాలో పలువురు మహిళలు దీర్ఘకాలంగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి మెరుగైన ఆదాయం లభించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు నెల్లూరు జిల్లా మహిళా ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ రెడేమేడ్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. ఎంబ్రాయిడరీ, జాబ్ వర్క్, రెడీమేడ్ గార్మెంట్‌కు సంబంధించి అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మల్టీ కలర్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, 5/6 థ్రెడ్ వర్కింగ్, కంప్యూటరైజ్డ్ డిజైనింగ్‌లతోపాటు వీటిపై శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ ట్రైనింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా గార్మెంట్ వ్యాపారం రూ.25 కోట్లు ఉండగా ఈ క్లస్టర్ రాకతో ఈ పరిమాణం రూ.40 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ క్లస్టర్ ద్వారా నేరుగా 1,500 మందికి, పరోక్షంగా 5,500 మందికి ఉపాధి లభించనుందని అంచనా. కనీసం ఐదు ఎగుమతి ఆథారిత కంపెనీలు వస్తాయని కార్పొరేషన్ అంచనా వేసింది. ఇవి కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ప్రింటింగ్/ జీడిపప్పు క్లస్టర్ అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పవనమూర్తి తెలిపారు. -
చిన్న పరిశ్రమలతో..పెద్ద ఉపాధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్ఎంఈ) కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఎంఎస్ఎంఈ రంగం తక్కువ పెట్టుబడితో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో కలుపుకొని 13.95 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో ఒక్క ఎంఎస్ఎంఈ రంగంలోనే 9,68,448 మంది ఉన్నారు. కోటి రూపాయల పెట్టుబడితో ఎంఎస్ఎంఈ రంగంలో 28 మందికి ఉపాధి లభిస్తుండగా, భారీ ప్రాజెక్టుల్లో అయితే ఒకరికి, పెద్ద పరిశ్రమల్లో నలుగురికి ఉపాధి లభిస్తున్నట్లు సమగ్ర పారిశ్రామిక సర్వే ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, వాటికి కావాల్సిన మానవ వనరులు, ఇతర అవసరాలను తెలుసుకొని తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర పారిశ్రామిక సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 98,327 పరిశ్రమలు ఉండగా అందులో ఇప్పటి వరకు 53,945 యూనిట్లలో పూర్తి వివరాలను సేకరించారు. నెల రోజుల్లో మిగిలినవి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెగా ఇండస్ట్రీస్‌లో విద్యుత్ పరిశ్రమలే అధికం ► రాష్ట్రంలో 98 మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి ద్వారా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించింది. ఈ మెగా ఇండస్ట్రీస్‌లో 1,64,755 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీటిలో అత్యధికంగా 47 శాతం విద్యుత్ రంగానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయి. బేసిక్ మెటల్స్–అల్లాయిస్ 13 శాతం, ఆటోమొబైల్ కంపెనీలు 7 శాతం ఉన్నాయి. ► మెగా ఇండస్ట్రీస్‌లో ఉపాధి విషయానికి వస్తే 21 శాతంతో బేసిక్ మెటల్స్–అల్లాయిస్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత విద్యుత్ రంగంలో 13 శాతం, బల్క్ డ్రగ్–ఫార్మా 12 శాతం, టెక్స్‌టైల్‌లో 11 శాతం మంది పని చేస్తున్నారు. రాష్ట్రంలో 806 భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.0.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 2,62,307 మంది పని చేస్తున్నారు. పెట్టుబడుల పరంగా బల్క్ డ్రగ్ అండ్ ఫార్మా 14 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, విద్యుత్ 13 శాతం, టెక్స్టైల్.. బేసిక్ మెటల్స్, రసాయనాల రంగాలు 12 శాతం చొప్పున ఉన్నాయి. ► ఎంఎస్ఎంఈ రంగంలో 19 శాతం పెట్టుబడులతో ఆగ్రో–ఫుడ్ ప్రాసెసింగ్, సేవా రంగాలున్నాయి. సేవారంగం అత్యధికంగా 19 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంటే ఆగ్రో–ఫుడ్ ప్రాసెసింగ్‌లో 17 శాతం మంది, నిర్మాణ రంగ పరికరాల తయారీలో 11 శాతం మంది ఉన్నారు. 42 శాతం కంపెకనీలు రాయలసీమలోనే ► రాష్ట్రంలో అత్యధికంగా పరిశ్రమలు రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 98,327 పరిశ్రమలు ఉంటే అందులో రాయలసీమ నాలుగు జిల్లాల్లోనే 41,228 యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరున్న అనంతపురంలో అత్యధికంగా 14,273 యూనిట్లు ఉండటం విశేషం. ► ఆ తర్వాతి స్థానాల్లో 13,281 యూనిట్లతో గుంటూరు జిల్లా, 12,160 యూనిట్లతో చిత్తూరు, 10,535 యూనిట్లతో కర్నూలు జిల్లాలు ఉన్నాయి. విజయనగరంలో అత్యల్పంగా 2,530 పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. -
ఆరు నెలల్లో పూర్వ వైభవం..
అసలే లాక్డౌన్.. ఆపై ఉత్పత్తులు నిలిచిపోవడం.. దానికి తోడు ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు విడుదల కాకపోవడంతో చిన్న పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. లాక్డౌన్లో సడలింపు ఇచ్చినా కోలుకోలేనంతగా కష్టాల్లో కూరుకుపోయిన ఎంఎస్ఎంఈలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. తాళాలు వేసే స్థితికి చేరుకున్న పరిశ్రమలను రీస్టార్ట్ చేయించింది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) 13,548 ఉండగా.. ఇందులో నగర పరిధిలో 6,331 ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో 2 లక్షల మందికి పైగా నిర్వాహకులు, ఉద్యోగులు, కార్మికులున్నారు. అప్పోసప్పో చేసి పరిశ్రమను లాగిస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. 2014 నుంచి 2019 వరకూ రావల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలేవీ విడుదల చేయకపోవడంతో జిల్లాలో 40 శాతం వరకూ పరిశ్రమలు అంపశయ్యపైకి చేరుకున్నాయి. నష్టాలతో నడుస్తున్న ఈ పరిశ్రమలకు లాక్డౌన్ శరాఘాతంలా మారిపోయింది. వీటిని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ జీవం పోసింది. జిల్లాలో గాజువాక, ఆటోనగర్, అగనంపూడి, స్టీల్‌ప్లాంట్, పరవాడ, పెదగంట్యాడ, పెందుర్తి ప్రాంతాల్లో పలు ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి. ఇంజినీరింగ్ లేత్ వర్క్, ఫ్యాబ్రికేషన్, కాస్టింగ్, మెషినింగ్, కాయిర్ ప్రాసెసింగ్ పరిశ్రమలున్నాయి. అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, కంచరపాలెం, గంభీరం, గుర్రంపాలెం (పెందుర్తి), రాచపల్లి పారిశ్రామిక వాడల్లోనూ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఎస్ఎంఎంఈలకు ప్రభుత్వం ప్రకటించిన రీస్టాట్ ప్యాకేజీతో జిల్లాలోని పలు పరిశ్రమలకు కొత్త ఊపిరి వచ్చింది. 779 అకౌంట్లు.. రూ.53.35 కోట్లు గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీలు తదితర పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎంఎస్ఎంఈలకు విడుదల చేయకుండా విస్మరించింది. కాని కష్ట కాలంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సబ్సిడీ నిధుల బకాయిలను విడుదల చేసింది. దీంతో.. జిల్లాలోని 276 అకౌంట్లకు రూ.28 కోట్ల వరకూ ఈ నెల 22న అందాయి. జూన్ 29న 503 అకౌంట్లకు రూ.25.35 కోట్లు అందనున్నాయి. లాక్డౌన్ కాలంలో మూడు నెలల విద్యుత్ బిల్లులపై స్థిర విద్యుత్తు చార్జీలు మాఫీ చేయడంతో జిల్లాలో పదివేలకు పైగా ఎంఎస్ఎంఈలకు మేలు జరిగింది. మూడు నెలల పాటు ఈ చార్జీలను వాయిదా వేయడం వల్ల 140 భారీ పరిశ్రమలకు కూడా లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలోనే పలు పరిశ్రమలు సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. షిఫ్టుల వారీగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆరు నెలల్లో అధిగమించేలా... లాక్డౌన్లో నిబంధనలు సడలించినప్పటికీ.. పరిశ్రమలకు కారి్మకుల కొరత వేధిస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన కారి్మకుల్లో 80 శాతం వరకూ తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో కారి్మకులు దొరకడంలేదు. సాధారణంగా మార్చి నెల తర్వాత ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. కాని లాక్‌డౌన్‌తో పూర్తిగా వర్క్ ఆర్డర్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నా.. ఒక్కో పరిశ్రమలో 60 శాతం వరకు కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ తాత్కాలికమేనని.. ప్రభుత్వం అందించిన చేయూతతో కేవలం ఆరు నెలల్లో సమస్యలన్నింటినీ అధిగమించి.. ఎంఎస్ఎంఈలకు పూర్వ వైభవం వస్తుందని పారిశ్రామిక వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల సమస్య తాత్కాలికమే లాక్డౌన్లో కార్మికుల్లో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో కార్మికుల సమస్య వేధిస్తున్నప్పటికీ ఇది తాత్కాలికమే. ఉదాహరణకు రాష్ట్రం నుంచి 2.80 లక్షల మంది కారి్మకులు వెళ్లిపోతే.. 1.80 లక్షల మంది వచ్చారు. ఈ లెక్కన చూస్తే.. కార్మికుల కొరత కొంత మాత్రమే ఉంది. సీఎం జగన్ వల్ల ఆర్థిక సమస్య నుంచి ఎంఎస్ఎంఈలు గట్టెక్కడం సరికొత్త విప్లవమనే చెప్పాలి. – ములగాడ సుధీర్, ఏపీసీసీఐఎఫ్ చైర్మన్ పరిశ్రమలను బతికించారు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని బతికించారు. లాక్డౌన్ కాలంలో మూడు నెలల విద్యుత్తు బిల్లులపై స్థిర విద్యుత్తు చార్జీలు మాఫీ చేయడంతో జిల్లాలో పదివేలకు పైగా ఎంఎస్ఎంఈలకు మేలు జరిగింది. మూడు నెలల పాటు ఈ చార్జీలను వాయిదా వేయడం వల్ల 140 భారీ పరిశ్రమలకు కూడా దీనివల్ల లబ్ధి జరగనుంది. ముఖ్యమంత్రికి పరిశ్రమలన్నింటి తరఫునా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – ఏకే బాలాజీ, ఏపీ ఛాంబర్స్ డైరెక్టర్ సాహసోపేత నిర్ణయం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఏ సీఎం తీసుకోని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణ మూలధన రుణాల (వర్కింగ్ క్యాపిటల్ లోన్స్)కు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో 6 నుంచి 8 శాతం వరకూ వడ్డీతో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం కలి్పంచింది. వెబ్సైట్లో సాంకేతిక లోపాలు రెండు రోజుల్లో క్లియర్ అవుతాయి. ఆ తర్వాత నుంచి రీస్టాట్ ప్రయోజనాల కోసం ఆన్‌లైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. – జి. సాంబశివరావు, ఏపీ చాంబర్స్ మాజీ అధ్యక్షుడు కొనుగోళ్లనూ ప్రోత్సహించడం చరిత్రాత్మకం ప్రభుత్వ విభాగాల అవసరాలకు ఉద్దేశించిన వస్తువుల్లో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పరిశ్రమలకు లాభం చేకూరుతుంది. త్వరితగతిన కోలుకునేందుకు అవకాశం లభిస్తుంది. 4 శాతం ఎస్సీ ఎస్టీ పరిశ్రమల నుంచి, 3 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు చెందిన పరిశ్రమల నుంచి 18 శాతం ఓపెన్ కేటగిరీకి చెందిన వారి పరిశ్రమల నుంచి కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడం నిజంగా గ్రేట్. – పైడా కృష్ణప్రసాద్, ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ వెన్నెముక దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ సెక్టార్ వెన్నెముక వంటిది. అందుకే దాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంతో బూస్టప్ ఇస్తాయి. బకాయిలు అందడం వల్ల ముడి సరకు కొనుగోళ్లకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఉపయుక్తమవుతున్నాయి. అర్హులైనవారికి రుణాలందించాలని ఆదేశించడం సీఎం ఉదారతకు ఓ ఉదాహరణ. – డా.కె కుమార్‌రాజా, ఏపీ చాంబర్స్ వైస్ ప్రెసిడెంట్ -
యంత్ర సిద్ధి.. చేకూరేనా లబ్ధి!
సాక్షి, సిటీబ్యూరో: సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కష్టకాలం వచ్చింది. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో ఇవి తెరుచుకున్నా.. మనుగడ మాత్రం ప్రశ్నార్థకంగా పరిణమించింది. ఒకవైపు ముడిసరుకు కొరత సమస్య వెంటాడుతుండగా.. మరోవైపు నైపుణ్య కార్మికులు అందుబాటులో లేకపోవడంతో మరింత కుంగదీస్తోంది. దీంతో వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా పరిశ్రమలు మూతపడటంతో చిరు పారిశ్రామికవేత్తలను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా భవనాల అద్దె, విద్యుత్ బకాయిల చెల్లింపు, కార్మికుల వేతనాలు, ఇతరత్రా ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. ఇప్పటికే అరకొర వర్క్ ఆర్డర్లతో నష్టాల బాటలో నడుస్తున్న చిన్నతరహా పరిశ్రమలకు లాక్‌డౌన్‌తో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ముఖ్యంగా భారీ పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. వీటిపై ఆధారపడిన చిన్న పరిశ్రమలు ఆగమయ్యాయి. అప్పటికే తయారు చేసి గోడౌన్లలో ఉంచిన సరుకును కొనే దిక్కు లేకుండాపోయింది. మరోవైపు ముడిసరుకు కొరత, ఆర్డర్లు లేకపోవడంతో పరిశ్రమలపరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దివాలా అంచున నడుస్తున్న చిన్న పరిశ్రమలపై కరోనా విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. నిలిచిపోయిన సరఫరా.. చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలను ముడిసరుకు కొరత వెంటాడుతోంది. లాక్‌డౌన్‌తో పరిశ్రమల ఉత్పత్తి, ముడి సరుకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాధారణంగా మార్చి నెల తర్వాత పెద్దఎత్తున వర్క్ ఆర్డర్లు వచ్చేవి. దీంతో ముడి సరుకులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ కోవిడ్ పరిస్థితుల ప్రభావంతో ఆయా పరిశ్రమల్లో ముడిసరుకు ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఫలితంగా సరఫరా ఆగిపోయింది. తాజాగా చిన్న పరిశ్రమలకు వర్క్ ఆర్డర్లు వస్తున్నా.. ముడిసరుకు అందుబాటులో లేకుండా పోయింది. కొన్ని పరిశ్రమల్లో పాత ముడిసరుకు నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ వర్క్ ఆర్డర్లు లేకుండా పోయాయి. సూక్ష పరిశ్రమలు చాలా వరకు భారీ పరిశ్రమల జాబ్ ఆర్డర్లపై ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. భారీ పరిశ్రమలు కూడా నష్టాల ఊబిలో ఉండటంతో సూక్ష్మ పరిశ్రమలకు వర్క్ ఆర్డర్లు లేకుండా పోయాయి. నైపుణ్యాల కొరత.. ఆయా పరిశ్రమలకు నైపుణ్య కార్మికుల కొరత ఏర్పడింది. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ ట్రేడ్స్‌లో› నైపుణ్యం కలిగిన కార్మికులు స్వస్థలాల బాటపట్టారు. ప్రస్తుతం 20 శాతానికి మించి నైపుణ్యం కలిగిన కార్మికులు లేకుండాపోయారు. దీంతో ఉత్పతులు పునఃప్రారంభించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కార్మికులపరంగా ఎలా నిలదొక్కుకుని నడిపించాలో అర్థం కాని పరిస్ధితి నెలకొంది. కార్మికులను రప్పించి, ఉత్పత్తిని ప్రారంభిస్తే అన్నీ సర్దుకుంటాయన్నట్లు పైకి కనిపిస్తున్నా.. అంతర్గతంగా అనేక సమస్యలు పరిశ్రమలను చుట్టుముట్టనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్పత్తులు ప్రారంభించింది 60 శాతమే.. గ్రేటర్ పరిధిలో సుమారు 40వేలకుపైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ప్రధానంగా నగర పరిధిలో సనత్‌నగర్, ఆజామాబాద్, చందూలాల్ బారాదరి పారిశ్రామిక వాడలు ఉండగా, శివార్లలో ఉప్పల్, మౌలాలి, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, గాంధీనగర్, బాలానగర్, పటాన్చెరు, వనస్థలిపురం తదితర పారిశ్రామికవాడల్లో పెద్దసంఖ్యలో స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటికే 90 శాతానికిపైగా పరిశ్రమలు తెరుచుకున్నా వీటిలో ఉత్పత్తులు ప్రారంభించింది మాత్రం 60 శాత్రమే ఉన్నాయి. ఎంఎస్ఎంఈ వైపు చూపులు.. కష్టకాలంలో ఆర్థిక వెసులుబాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్థిక చేయూత కోసం దరఖాస్తులతో ఎంఎస్ఎంఈకి ఉరుకులు పరుగులు తీస్తున్నాయి. వాస్తవంగా వర్క్ ఆర్డర్ల ఉత్పత్తి ఆగిపోవడంతో చెల్లింపులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు, విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. నగదు కొరత, చెల్లింపుల్లో ఆలస్యం, నగదు రొటేషన్ ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. అప్పులపై వడ్డీ చెల్లింపులు కూడా భారంగా మారాయి. చేయూత అందించాలి.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని తక్షణమే వర్తింపజేయాలి. ఎంఎస్ఎంఈ ప్రత్యేక చొరవ చూపి పరిశ్రమను బట్టి చేయూత అందించాలి. లాక్డౌన్ పీరియడ్ ఎలక్ట్రిసిటీ బిల్లులను, చార్జీలను ప్రభుత్వం రద్దు చేయాలి. పరిశ్రమలు నైపుణ్యం గల కార్మికులు తిరిగి వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలి.– జహంగీర్, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బాలానగర్ -
గ్రేటర్ సిటీపై 'వలస' కూలీల ఎఫెక్ట్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరం నుంచి వలసకూలీలు ఇంటి బాటపట్టడంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. స్వరాష్ట్రంలో ఉపాధి కరువై..బతుకు బరువై భాగ్యనగరానికి పొట్టచేతబట్టుకొని వలసవచ్చి న కూలీలు ఇప్పుడు ప్రత్యేక రైళ్లలో సొంతరాష్ట్రాలకు తరలి వెళుతున్నారు. లక్షలాదిమందిని ఆదరించి అక్కున చేర్చుకొని ఉపాధి కల్పించిన నగరంలో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు రంగాలు కుదేలవుతున్నాయి. లాక్డౌన్ దెబ్బకు నిర్మాణరంగం సహా నగరంలో వేలాదిగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది తమ సొంతూళ్లకు పయనంకాగా..ఇక్కడున్న వారిలోనూ సింహభాగం ఇళ్లకు వెళ్లేందుకే సిద్ధమయ్యారు. ఇప్పుడిప్పుడే ఆయా రంగాలు తేరుకుంటున్న తరుణంలోనే పులిమీద పుట్రలా వలసకూలీలు తిరిగి వెళ్లడంతో పలు రంగాల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. నిర్మాణ రంగం గ్రేటర్ నగరానికి ఐటీ తరవాత మణిహారంగా నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్ రంగాలు నిలుస్తున్నాయి. ఈ రంగంలో సుమారు ఏడు లక్షలమంది వలస కూలీలు పనిచేస్తున్నట్లు నిర్మాణరంగ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో సుమారు 70 శాతం మంది ఇంటిబాట పట్టారని..మిగతా 30 శాతం మందితో పనులు నత్తనడకనసాగుతున్నాయని చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న పలు స్వతంత్ర గృహాలు, విల్లాలు, అపార్ట్మెంట్ నిర్మాణాలు మరో రెండు నెలలపాటు కూలీలు లేక పనులు అరకొరగా సాగుతాయని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. తయారీ పరిశ్రమ మహానగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేలాదిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా తయారీరంగం, ఫుడ్‌ప్రాసెస్ రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. వీటిల్లో సుమారు ఐదు లక్షలమంది వలసకూలీలు పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో60 శాతం మంది స్వరాష్ట్రాలకు తరలివెళ్లడంతో ప్లాస్టిక్, స్టీలు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ విడిభాగాలకు సంబంధించిన పరిశ్రమల ఉత్పత్తి అమాంతం పడిపోనుందని పరిశ్రమల వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ఆతిథ్య రంగం కోవిడ్ దెబ్బకు కుదేలైన ఆతిథ్యరంగంలోనూ లక్షలాదిమంది వలసకూలీలు పనిచేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం కూడా ఈ రంగం కోలుకొని పూర్వవైభవం సాధిస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్న వలసకార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ఆతిథ్యరంగానికి సమీప భవిష్యత్‌లోనూ ఆటుపోట్లు తప్పవని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇంటీరియర్, ఫర్నిచర్ నగరంలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన వేలాదిమంది వలసకూలీలు ఈ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో సింహభాగం సొంతిళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈ రంగం కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కోనుందని ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెయిరీ నగరంలోని పలు డెయిరీల్లో వేలాది మంది పనిచేస్తున్నారు. పాడిపశువుల పెంపకం, పలు ప్రైవేటు డెయిరీల్లో హెల్పర్లుగా పనిచేస్తున్నవారిలో చాలామంది వెళ్లిపోవడంతో ఈ రంగం సైతం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఫార్మా మహానగరానికి ఆనుకొని సుమారు వెయ్యి వరకు బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ పరిశ్రమలున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. -
వైఎస్సార్ నవోదయం పేరుతో కొత్త పథకం
ఉత్పత్తికి, వ్యయానికి తేడా రావడమో.. ఉత్పత్తులకు ఆశించిన మార్కెట్ లేకపోవడమో.. ప్రోత్సాహం కొరవడడమో తెలీదు గాని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. నష్టాలను భరించలేక పలు పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫలితంగా వాటిపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడుతున్నారు. జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో 25 శాతం వరకు çసూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. 45 శాతం వరకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల వేలల్లో కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్లడానికి గల కారణాలను ఆరా తీయడమే కాకుండా వాటిని ఆదుకోవాలని సంకల్పించింది. వైఎస్సార్ నవోదయం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఊతం ఇవ్వడంతో పాటు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా.. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కేటాయించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. – సాక్షి, విశాఖపట్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ‘వైఎస్సార్ నవోదయం’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం సుమారుగా 86 వేల వరకు గుర్తించింది. రూ.4 వేల కోట్ల రుణాలు వన్ టైం రీస్ట్రక్చర్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమల యజమానుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల ఏ ఒక్క చిన్న పరిశ్రమ ఎన్పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయంతో ఎంఎస్ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పించే చర్యలు చేపట్టనుంది. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తొమ్మిది నెలల వ్యవధిని ఏపీ కేబినెట్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరోగమనం నుంచి పురోగమనం దిశగా... జిల్లాలో 133 భారీ పరిశ్రమలుండగా 12,750 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో గ్రానైట్, ఆక్వా రంగంతో పాటు ఇటుకల పరిశ్రమలు, సిమెంట్ ఫ్లైయాష్ బ్రిక్స్, బీరువాల తయారీ, విస్తరాకుల తయారీ, పచ్చళ్ల తయారీ, పాడి పరిశ్రమ, కేబుల్ నెట్వర్క్, మంచినీటి వ్యాపారం, ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ, ప్రింటింగ్ రంగం, టైలరింగ్, జనపనార సంచుల తయారీ వంటి ఎన్నో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం చిన్న పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఎక్కువ పరిశ్రమలకు ప్రోత్సాహం లేక చాలా వరకు మూతపడినవి కూడా ఉన్నాయి. ఇలా మూతపడిన పరిశ్రమలలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారే ఉండటం గమనార్హం. గత మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 30 నుంచి 40 శాతం వరకు జిల్లాలో ఉన్నాయి. వీటిలో అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆర్థిక చేయూత కల్పించి.. తిరిగి జీవం పోసేందుకు సర్కారు శ్రీకారం చుట్టడంపై పరిశ్రమల వర్గాల్లో సర్వాత్ర హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చిన్న పరిశ్రమలకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలకు కోటి రూపాయల వరకు రుణం మంజూరుకు అవకాశం కల్పించే ప్రకటన చేయడం కూడా ఊరట కలిగించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల రానున్న ఐదేళ్లలో చిన్న పరిశ్రమలు ఊపందుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఫలితంగా మరికొంత మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగుతాయి. ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా.... చిన్న పరిశ్రమలకు చేయూతతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 3,29,486 మంది ఎస్సీలకు, 6,18,500 ఎస్టీలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకానికి రూ.411 కోట్లు ఖర్చు చేయనుంది. ఉచిత విద్యుత్ గతంలో కేవలం 100 యూనిట్ల వరకే ఉండేది. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం మరో 20 యూనిట్లను అదనంగా పెంచింది. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో.... సూక్ష్మ తరహా పరిశ్రమలు - 10,200 చిన్న తరహా పరిశ్రమలు - 2,100 మధ్య తరహా పరిశ్రమలు - 450 భారీ పరిశ్రమలు - 133 ఐదేళ్లలో మూతపడిన పరిశ్రమలు - 25 శాతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిశ్రమలు - 45 శాతం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలు - 10 శాతం -
‘టీ–ఐడియా’ నిబంధనల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించే ‘టీ–ఐడియా 2014’పథకం నిబంధనల్లో పరిశ్రమల శాఖ పలు మార్పులు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన నియమావళి ప్రకారం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లించే ప్రోత్సాహకాలను ఇకపై తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా విడుదల చేస్తారు. ప్రోత్సాహకాల చెల్లింపునకు అవసరమైన మొత్తాన్ని ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఖాతాకు పరిశ్రమల శాఖ కమిషనరేట్ బదిలీ చేస్తుంది. ఇప్పటివరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్ఎల్సీ) ఆమోదంతో దరఖాస్తుల సీనియారిటీ ఆధారంగా పరిశ్రమల శాఖ విడుదల చేస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల శాఖ విడుదల చేసే ప్రోత్సాహకాల మొత్తంలో ఇకపై 10 శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఎస్ఐహెచ్సీఎల్) ఖాతాకు జమ చేస్తారు. ప్రోత్సాహకాల విడుదల కోసం సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇకపై టీఎస్ఐహెచ్సీఎల్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆయా పరిశ్రమల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి తదితరాలపై అధ్యయనం చేసి, సంబంధిత జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ)తో సమన్వయం చేసుకున్న తర్వాతే ప్రోత్సాహకాలను విడుదల చేస్తారు. గతంలో కొన్ని పరిశ్రమలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు తీసుకుని మూత పడిన నేపథ్యంలో అవకతవకలు నివారించేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు ప్రోత్సాహకాల విడుదల బాధ్యతను అప్పగించారు. బ్రిడ్జి రుణాలు రాబట్టుకునేందుకే! నష్టాల బాటలోఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్‌ను (టీఎస్ఐహెచ్సీఎల్) రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. రాష్ట్రంలో 13,581 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఉండగా, రూ.1,018 కోట్ల పెట్టుబడితో స్తాపించిన సూక్ష్మ పరిశ్రమలు 62 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ.76,286 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన చిన్న తరహా పరిశ్రమలు సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల్లో చాలా మందికి వ్యాపార దక్షత లేకపోవడం, మార్కెటింగ్ ఒడిదుడుకులు తదితరాలతో నష్టాలబమS బాటన పయనిస్తున్నారు. నష్టాల బాటలో ఉన్న సుమారు 3,700 పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఉన్న ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ బ్రిడ్జి రుణాలను మంజూరు చేస్తోంది. తాజాగా సవరించిన టీ–ఐడియా నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి రుణగ్రస్త పరిశ్రమలకు విడుదలయ్యే ప్రోత్సాహకాలు ఇకపై హెల్త్ క్లినిక్ ఖాతాలో జమ అవుతాయి. తాము గతంలో ఆయా పరిశ్రమలకు ఇచ్చిన బ్రిడ్జి లోన్‌ను మినహాయించుకుని, మిగతా ప్రోత్సాహకాన్ని సంబంధిత పరిశ్రమలకు హెల్త్ క్లినిక్ విడుదల చేస్తుంది. -
చిన్న పరిశ్రమకు చేయూత
రాష్ట్రంలో నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు అవసరమైన నిధుల సేకరణపై కూడా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ దృష్టి సారించింది. రాష్ట్రంలో 13,581 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలుండగా, రూ.1,018 కోట్ల పెట్టుబడితో స్థాపించిన సూక్ష్మ పరిశ్రమలు 62 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ.76,286 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన చిన్న తరహా పరిశ్రమలు సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానుల్లో చాలా మందికి వ్యాపార దక్షత లేకపోవడం, మార్కెటింగ్ ఒడిదుడుకులతో ఆ పరిశ్రమలు కాస్తా నష్టాల బాట పడుతున్నాయి. అయితే ఇందులో సుమారు 3,700 పరిశ్రమలు 6 నెలలుగా కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను తొలి దశలో హెల్త్ క్లినిక్ వడపోస్తున్నది. వీటిలో నిర్వహణ లోపం, మార్కెటింగ్ ఉన్నా వర్కింగ్ క్యాపిటల్ పెట్టే పరిస్థితి లేక నష్టాల్లో కూరుకుపోతున్న పరిశ్రమలను గుర్తిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నష్టాల పాలవ్వకుండా గాడిన పెట్టి దానిపై ఆధారపడిన కార్మికులు నష్టపోకుండా కాపాడేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్’ను ఏర్పాటు చేసింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమల పునరుద్ధరణతో సరిపెట్టకుండా, వాటి వ్యాపార దక్షత పెంచే బాధ్యతను కూడా హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్‌సీఎల్) భుజాలకెత్తుకుంటోంది. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ టీఎస్ఐడీసీ అడుగుజాడల్లో ఏర్పాటైన టీఐహెచ్‌సీఎల్‌ను రూ.100 కోట్ల మూలనిధితో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో రాష్ట్రం తన వంతు వాటాగా రూ.10 కోట్లు, కేంద్రం నుంచి రూ.50 కోట్లు వాటాగా చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటివరకు రూ.7 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. మరో రూ.50 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించారు. హెల్త్ క్లినిక్ కార్యకలాపాలకు సలహాదారు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓతో కూడిన బోర్డుతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులతో ప్రత్యేక వ్యూహ బృందం కూడా పనిచేస్తోంది. ఏడుగురు సభ్యులున్న ఈ బృందంలో బ్యాంకింగ్, పాలన, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణులు, అధికారులున్నారు. ఏడాది పాటు పర్యవేక్షణ నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు, వాటి పనితీరును ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏడాది పాటు పర్యవేక్షిస్తోంది. సదరు పరిశ్రమలకు మార్కెటింగ్, ఉత్పత్తిలో మెళకువలపై కూడా హెల్త్ క్లినిక్ బృందాలు శిక్షణ ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తున్న హెల్త్ క్లినిక్ పనితీరుపై ఇతర రాష్ట్రాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. రుణా గ్రస్త పరిశ్రమలను తిరిగి గాడిలో పెట్టడంపై తమకు సహకారం అందించాల్సిందిగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వినతులు అందుతున్నట్లు హెల్త్ క్లినిక్ అధికారులు చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పర్వం ఇతర రాష్ట్రాల్లోనూ కన్సల్టెన్సీ సేవలు అందించడంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఎన్ని.. ఇకపై ఎన్ని.. - తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 149 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణపై ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్‌సీఎల్) దృష్టి సారించింది. - ఇప్పటివరకు 41 పరిశ్రమలను పునరుద్ధరించగా, మరో 14 పరిశ్రమల స్థితిగతులపై అధ్యయనం జరుగుతోంది. పునరుద్ధరించిన పరిశ్రమల్లో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 23, హైదరాబాద్‌లో 5, యాదాద్రి భువనగిరిలో 3, వరంగల్ అర్బన్ జిల్లాలో 2 పరిశ్రమలున్నాయి. - ఇక మేడ్చల్, జగిత్యాల, జనగామ, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో ఒక్కో పరిశ్రమను చొప్పున తిరిగి పట్టాలెక్కించారు. వీటిలో ఎక్కువగా మరమగ్గాలు, లోహ వస్తుత్పత్తికి సంబంధించిన పరిశ్రమలే ఉన్నాయి. -
చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా..
నిడమర్రు : చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయుతనిచ్చేలా 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ(ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకూ రుణాలు అందిస్తుంది. ఈ పథకం రూ.20 వేల కోట్ల కార్పస్ నిధి ఏర్పాటు చేసింది. బ్యాంకులకు గ్యారంటీగా ఉండటానికి ప్రభుత్వం ఈ మూలధనాన్ని కేటాయించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఎలా ప్రయోజనం పొందాలో, అర్హతలు ఏమి ఉండాలో తెలుసుకుందాం. ముద్ర పథకంలో రుణాలు మైక్రో యూనిట్స్ అభివృద్ధి, రీఫైనాన్సింగ్ కార్యకలాపాల కోసం చిన్నతరహా వ్యాపారవేత్తలకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకూ ముద్ర రుణాలు ఇస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు 7 శాతం వడ్డీ రేటుపై రీఫైనాన్స్ సేవలను అందిస్తుంది. తయారీ, సర్వీసులు తదితర రంగాల్లోని చిన్న వ్యాపారులకు రుణాలు కల్పించే సంస్థల మార్గదర్శకాలు రూపొందించడం, ఎంఎఫ్‌ఐల రిజిస్ట్రేషన్, రేటింగ్ మొదలైన అంశాలను ముద్ర పర్యవేక్షిస్తుంది. ముద్ర నుంచి తీసుకునే మొత్తాన్ని రుణంగా ఇచ్చేటప్పుడు నిర్దిష్ట వడ్డీ రేటుకు మించి వసూలు చేయకుండా పరిమితి విధిస్తుంది. సూక్ష్మ రుణ సంస్థలు(ఎంఎఫ్ఐ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ) కూడా ముద్ర నుంచి రుణాలు తీసుకోవచ్చని, తదుపరి ఆ మొత్తాన్ని ఇతరులకు రుణాలిచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. రుణ రకాలు : ఫండింగ్ దశను బట్టి ‘శిశు’, ‘కిశోర్’, ‘తరుణ్’ పేరిట మూడు రకాల పథకాల కింద ముద్ర యోజన నిధులు సమకూర్చుతుంది. శిశు: రూ. 50 వేల వరకు, కిశోర్: రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ, తరుణ్: రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలను వర్గీకరించారు. రుణం పొందుటకు అర్హతలు వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగా ఉండాలి. ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో రుణ అవసరం రూ.10 లక్షలలోపు ఉండాలి. పైన పేర్కొన్న అర్హతగల వారు దగ్గరలో ఉన్న బ్యాంక్, సూక్ష్మ రుణ సంస్థ(ఎంఎఫ్ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) అధికారులను సంప్రదించాలి. ఈ పథకం వర్తించే రంగాలు రవాణా/కార్యాచరణ –ఆటో రిక్షా, చిన్న వస్తువులు రవాణా వాహనం, త్రిచక్ర వాహనాలు, ఈ–రిక్షా, ప్యాసింజర్ కార్లు, టాక్సీలు మొదలైనవి, సరుకుల రవాణా, వ్యక్తిగత రవాణా కోసం వాహనాలు కొనుగోలు, కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు కార్యక్రమాలు–బ్యూటీ పార్లర్స్, వ్యాయామశాల, షాపులు, టైలరింగ్ దుకాణాలు, డ్రై క్లీనింగ్, మోటర్ సైకిల్ మరమ్మతు దుకాణం, డీటీపీ, ఫొటో సౌకర్యాలు, మెడిసిన్ దుకాణాలు, కొరియర్ ఏజెంట్లు మొదలైనవి. ఆహార ఉత్పత్తులు సెక్టార్ : అప్పడాలు/పచ్చళ్లు/జామ్/జెల్లీ తయారీ, వ్యవసాయ ఉత్పత్తుల పరిరక్షణకు గ్రామీణస్థాయి, మిఠాయి దుకాణాలు, ఆహారం స్టాళ్లు, రోజూ క్యాటరింగ్/ రోజువారీ క్యాటరింగ్ సేవలకు/కోల్డ్ స్టోరేజ్/ఐస్ అండ్ ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్లు, బిస్కెట్స్, రొట్టె ల తయారీ మొదలైనవి. వస్త్ర ఉత్పత్తుల సెక్టార్ : చేనేత, జరీ మరియూ జర్దారీ పని, సంప్రదాయ ఎంబ్రాయిడరీ, చేతిపని, సంప్రదాయ అద్దకం, ప్రింటింగ్, దుస్తులు డిజైన్, అల్లడం, పత్తి జిన్నింగ్, కంప్యూటరీకరణ ఎంబ్రాయిడరీ, బ్యాగులు మొదలైనవి. రుణం పొందే విధానం ఈ ముద్ర పథకం కింద సహాయం పొందగోరేవారు వారి ప్రాంతాల్లో ఆర్థిక సంస్థల ఏ యొక్క స్థానిక శాఖ అధికారులనైనా సంప్రదించవచ్చును. పీఎస్‌యూ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు తదితర రుణ సంస్థలను సంప్రదించాలి. రుజువుల కోసం ఇలా.. గుర్తింపు రుజువు : ఓటరు ఐడీ కార్డు/డ్రైవింగ్/ఆధార్ కార్డు వంటి ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన గుర్తింపు కార్డు, నివాస రుజువు కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలు. రెండు ఫొటోలు, మెషినరీ/ఇతర వస్తువులను కొనుగోలు కొటేషన్, సరఫరాదారు పేరు/యంత్రాలు ధర కొనుగోలు వివరాలు, వ్యాపార సంస్థకు సంబంధించిన లైసెన్స్/నమోదు సర్టిఫికెట్లు, వ్యాపార యూనిట్ చిరునామా రుజువు, ఎస్టీ /ఎస్సీ/ఓబీసీ/మైనార్టీ ధ్రువీకరణ పత్రం. ఈ పథకం ప్రత్యేకతలు బ్యాంక్‌లు/ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అలాగే అదనపు హామీ ఉండదు. రుణం తిరిగి చెల్లించే కాలం ఐదేళ్ల వరకు పొడిగించారు. అభ్యర్థి ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థకు డిపాల్టర్‌గా ఉండకూడదు. -
చిన్నతరహ పరిశ్రమలకు తక్కువ ధరలో యాప్స్
-
చిన్న పరిశ్రమలకు సహకారమేదీ?
బ్యాంకుల తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి - ముంబైలో ఆర్బీఐ గవర్నర్‌ను కలసి సమస్యల ప్రస్తావన - ఖాయిలా పరిశ్రమల గుర్తింపు, వేలంలో - బ్యాంకులు మార్గదర్శకాలు పాటించట్లేదని ఫిర్యాదు - ఈ అంశంపై సహకారం కోరుతూ లేఖ అందజేత - ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చిన్నతరహా పరిశ్రమలకు ఆశించిన మేర సహకారం లభించట్లేదని రాష్ట్ర పరిశ్రమ లు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై పర్యటనలో ఉన్న కేటీఆర్ సోమవారం ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో సమావేశమై చిన్నతరహా పరిశ్రమల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఆర్బీఐ నుంచి అందించాల్సిన సహకారంపై లేఖను సమర్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించకుండానే బ్యాంకులు చిన్నతరహా పరిశ్రమలను ఖాయిలా పరిశ్రమలుగా గుర్తించి వేలం వేస్తున్నాయన్నారు. చిన్నతరహా పరిశ్రమలను నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ)గా గుర్తించే విషయంలోనూ మార్గదర్శకాలను పాటించట్లే దని, ఎన్పీఏలుగా గుర్తించిన 15 రోజులకే వేలం నిర్వహిస్తున్నాయన్నారు. నిబంధనల మేరకు టెక్నో వయబిలిటీ స్టడీ జరపట్లేదని, కనీసం 17 నెలల గడువూ ఇవ్వట్లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే బకాయిలపై నిర్ణయానికి జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీని ఏర్పాటు చేయట్లేదని, స్టేట్ లెవల్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ కమిటీని సైతం పునరుద్ధరించలేదన్నారు. హెల్త్ క్లినిక్ పేరిట ఆర్థిక సాయం రాష్ట్రంలోని 69,120 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో 8,618 ఖాయిలా పరిశ్రమలు ఉన్నాయని, వాటిని గుర్తించి తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ క్లినిక్‌ను బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా గుర్తించాలని ఉర్జిత్‌కు విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీ ముంబై పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. తొలుత ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్తో సమావేశమై తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, విమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్, డిజిటల్ ఇనీషియేటివ్స్ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ–æఫండ్‌లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తర్వాత లూపిన్ సంస్థ ఎండీ నీలేష్ గుప్తాతో సమావేశమై ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ అంశంపై ఐడీబీఐ బ్యాంక్ చైర్మన్ ఎంకే జైన్‌తో సమావేశమై పేపర్ మిల్లు పునరుద్ధరణకు సహకరించాలని కోరారు. కాగా, రాష్ట్రాభివృద్ధిపట్ల కేటీఆర్‌కు ఉన్న నిబద్ధత, ఆలోచనలు ఇతర రాజకీయ నాయకులకూ ఉంటే దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందంటూ కేటీఆర్‌తో భేటీ అనంతరం సజ్జన్ జిందాల్ ట్వీట్ చేశారు. ‘స్టార్టప్ స్టేట్’లో పెట్టుబడులు పెట్టండి.. ముంబైలో సోమవారం జరిగిన మోతీలాల్ ఓస్వాల్ లిమిటెడ్ యాన్యువల్ గ్లోబల్ ఇన్వెస్టార్ కాన్ఫరెన్స్‌లో స్టార్టప్ స్టేట్‌గా మూడేళ్ల తెలంగాణ ప్రయాణం అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. తాము నిబద్ధత, పట్టుదలతో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర పారిశ్రామిక పాలసీ, ఇతర పాలసీలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రసంశలు లభిస్తున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడుల సేకరణ వంటి బహుముఖ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామన్నారు. -
'చిన్నబాస్‌కు రూ. 500 కోట్లు ముడుపులు'
-
'చిన్నబాస్‌కు రూ. 500 కోట్లు ముడుపులు'
గుంటూరు: చిన్నపరిశ్రమలకు 1400 కోట్ల రూపాయల సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చిన్నబాస్‌కు 500 కోట్లు ముడుపులు ముట్టాయని ఆయన ఘాటుగా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ పేరుతో మరో 500 కోట్లను కొల్లగొట్టబోతున్నారంటూ దుయ్యబట్టారు. కరెంట్ కొనుగోలు పేరుతో ప్రతి యూనిట్‌కు 25 పైసల పేరుతో లంచాలు తీసుకున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. వీటిన్నింటిపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోలేని ప్రభుత్వం కూలీలను చంపిందంటూ మండిపడ్డారు. తమిళనాడులో తెలుగువారికి రక్షణ కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని రఘువీరా రెడ్డి కోరారు. -
పరిశ్రమలకు తాళం.. బతుకు ఆగం
జిన్నారం: కరెంటు కోతలు...అంచనా మేరకు కాని ఉత్పత్తి...అర్డర్లూ అంతంతమాత్రం..దీంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. రోజుకో ఫ్యాక్టరీ మూతపడుతుంటే మెతుకుసీమకే తలమానికంగా ఉన్న పారిశ్రామిక వాడలన్నీ వెలవెలబోతున్నాయి. ఏడాది క్రితం లాభాల్లో ఉన్న పరిశ్రమలు కూడా ఇపుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యాలు గేట్లు మూసేస్తుండడంతో కార్మికులు వీధిన పడుతున్నారు. బహుళ సంస్థలకు చెందిన పరిశ్రమలు నడుస్తున్నా, చిన్న పరిశ్రమలు మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 50 వేల మంది భవిష్యత్ అగమ్యగోచరం జిన్నారం మండలంలోని బొంతపల్లి, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం గ్రామాల్లో సుమారు 200పైగా వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు జీవనోపాధిని పొందుతున్నారు. రాష్ట్రం విడిపోవడం...కరెంటు కోతల ప్రభావం పరిశ్రమలపై భారీ చూపుతోంది. కరెంటు కోతల నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం...నిర్ణీత సమయానికి డెలివరీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా ఇపుడు రద్దయ్యాయి. దీంతో చిన్నా, చితక కంపెనీలన్నీ ఇప్పటికే మూతపడ్డాయి. చాలా కంపెనీలు తాత్కాలికంగా గేట్లు మూసేశాయి. మరికొన్ని నడుస్తున్నా కార్మికులకు పూర్తిస్థాయిలో పని దొరకడం లేదు. ఒక్క జిన్నారం మండలంలో సుమారు 50 వరకు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. మరో 30 వరకు పరిశ్రమలు తాత్కాలికంగా ఉత్పత్తులను నిలిపివేశాయంటే పరిశ్రమల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డునపడ్డ జీవితాలు పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో వాటిల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిశ్రమలు మూతపడడంతో జిన్నారం మండలంలోనే సుమారు 15 వేల మంది కార్మికులు వీధిన పడాల్సి వచ్చింది. దీంతో వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కార్మికులకు ప్రస్తుతం పనులు లేకపోవటంతో ఉపాధి కో సం రోడ్ల వెంట తిరుగుతున్నారు. నడుస్తున్న కొన్ని పరిశ్రమలు కూడా స్థానికులకు ఉపాధిని కల్పించటం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బడుగు జీవులు అల్లాడిపోతున్నారు. స్టీల్ పరిశ్రమలకూ గడ్డుకాలం జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు 30 వరకు స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నడిపేందుకు ఎక్కువ మొత్తంలో విద్యుత్ అవసరం. ప్రస్తుతం తీవ్రమైన కరెంటు సమస్య వల్ల స్టీల్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలు మూతకు గల కారణాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ రావటంతో ఇక్కడి ఉత్పత్తులను అక్కడికి సరఫరా చేయలేకపోవటం. రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఎగుమతులు, దిగుమతుల్లో అదనపు పన్నుల భారం. పెద్ద పరిశ్రమలు చిన్న పరిశ్రమలకు తగిన ఆర్డర్లు ఇవ్వక పోవటం. కష్టపడి పరిశ్రమను నడిపినా లాభాలు లేకపోవటం. -
బతుకులు కుదేలు!
వికారాబాద్, చేవెళ్ల పట్టణాల్లో జిరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ సెంటర్లు, వెల్డింగ్ షాపులు, ఫొటో స్టూడియో ల్యాబ్‌లు, వడ్రంగి షాపులు తదితర విద్యుత్‌తో నడిచే చిన్న పరిశ్రమలు కుదేలవుతున్నాయి. పగటిపూట 8 గంటల కోత విధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అంతకుమించే సరఫరా ఉండడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. సింగిల్‌ఫేజ్ సరఫరా కూడా నిలిపివేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని గృహ వినియోగదారులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం. 12 గంటల విద్యుత్ కోతను విధిస్తున్నారు. అంటే పగలు అసలే విద్యుత్ సరఫరా ఉండదన్నమాట. 7 గంటలు ఒట్టిమాట రైతులకు వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు సరఫరా చేస్తున్నామన్న ప్రభుత్వం ఇటీవల కాలంలో 6 గంటలకు తగ్గించింది. కానీ ఆరు గంటలు కూడా విద్యుత్ సక్రమ సరఫరా కావడంలేదని రైతులు వాపోతున్నారు. నాలుగు నుంచి ఐదు గంటలే విద్యుత్ సరఫరా అవుతున్నదని వారు పేర్కొంటున్నారు. ఇటు వర్షాలు పడక, అటు అటు విద్యుత్ కోతతో వ్యవసాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసైనా సరే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాగునీటి తిప్పలు గ్రామాల్లో మంచినీటి బోరుమోటార్లు కరెంట్ కోతతో పనిచేయడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తాగునీటి ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఉదయం పూట కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు, పాఠశాల విద్యార్థులకు ఆలస్యమవుతోంది. రాత్రి వేళల్లో కరెంట్ లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు దోమల బెడదతో బాధపడుతున్నారు. విద్యుత్ కోతలపై అధికారులను అడిగితే కోతలుపై నుంచే ఉన్నాయని పేర్కొంటున్నారు. -
‘బ్యాంకులు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి’
బోట్‌క్లబ్(కాకినాడ), న్యూస్‌లైన్: సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికరంగ ప్రోత్సాహానికి బ్యాంకులు ముందుండాలని రిజర్వు బ్యాంక్ జనరల్ మేనేజర్ ఆర్ఎన్ డాష్ పేర్కొన్నారు. స్థానిక ఐశ్వర్యగ్రాండ్ హోటల్లో బుధవారం రిజర్వుబ్యాంక్ , చిన్న తరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పరిశ్రమలు బ్యాంకు రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి అడ్వైజరి కమిటీతో పాటు, రిజర్వు బ్యాంక్ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అదే తరహాలో జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీలో తప్పని సరిగా చర్చించాలన్నారు. లీడ్ బ్యాంక్, జిల్లా పరిశ్రమల కేంద్రం నమూనా ప్రాజెక్టులను తయారు చేసి వారికి అవగాహన కల్పించాలని సూచిం చారు. అలాగే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలపై విసృ్తత ప్రచారం చేయాలన్నారు. ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ కేవీ కన్నన్ మాట్లాడుతూ చిన్న పరిశ్రమలకు రుణాలు కల్పించేందుకు తమ బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. కోయంబత్తూరు, ఫరీదాబాద్ వంటి జిల్లాల్లో కంటే తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్‌లు అత్యధిక క్రెడిట్ రేషియో పాటిస్తూ రుణాలు ఇస్తున్నాయన్నారు. అయినా అక్కడ కనిపించే చిన్న తరహా పరిశ్రమల పురోగతి ఇక్కడ లేదన్నారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బీవీ రామారావు మాట్లాడుతూ బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయడానికి పారిశ్రామికవేత్తలను తిప్పతున్నారన్నారు. ఎస్బీహెచ్ డీజీఎం కె. రమేష్‌బాబు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం వి. సత్యనారాయణమూర్తి, ఎస్బీఐ ఏజీఎం మూర్తి, సూక్ష్మ చిన్న పరిశ్రమల కేంద్ర విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ సుభాష్ ఇన్గేవర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎన్. లక్ష్మణరావు, ఎల్డీఎం జగన్నాథస్వామి పాల్గొన్నారు. -
చిన్న తరహా పరిశ్రమలకు సర్కార్ చేయూత
గదగ్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు పూర్తిగా పతనావ స్థలో ఉన్నాయని, వాటిని పారిశ్రామికవేత్తలు సవాల్‌గా స్వీకరించి పునఃశ్చేతనానికి నడుం బిగిస్తే ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖామంత్రి హెచ్‌కే పాటిల్ అన్నారు. ఆయన గురువారం నగరంలోని తోంటధార్య కల్యాణ కేంద్రంలో ఏర్పాటు చేసిన గదగ్ ఉత్సవం, పారిశ్రామిక వస్తు ప్రదర్శన, విక్రయ మేళాను ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఉత్పత్తి పోటీల మధ్య చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు దుస్థితిలో ఉన్నాయన్నారు. అందువల్ల వాటిని కాపాడుకోవడం పారిశ్రామికవేత్తల బాధ్యత అన్నారు. అలాంటి పరిశ్రమల పునః ప్రారంభానికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ ఏడాది రెండు లక్షల మంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ పరిశ్రమల స్థాపనకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. అయితే పర్యావరణం, అక్కడి రైతుల ప్రయోజనాలు కాపాడటం అత్యవసరమన్నారు. నగరంలో గత 12 ఏళ్లుగా గదగ్ ఉత్సవం చేపట్టడం చేతి వృత్తులు, భారీ, చిన్న తరహా పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించడం శ్లాఘనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజశేఖర్ శిరూర్, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శివకుమార్, గదగ్ ఉత్సవ అధ్యక్షుడు సంగమేష్ దుందూర్, శివప్రకాష్ మహాజనశెట్టర్, రాజు కురడగి తదితరులు పాల్గొన్నారు. కాగా ఐదు రోజుల పాటు జరిగే గదగ్ ఉత్సవంలో 80కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.