సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) నిరుద్యోగులకు వరం. వీటి ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్నిస్తోంది. వీటి ద్వారా లక్షలాది ఉద్యోగాలతోపాటు భారీగా పెట్టుబడులూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహకాలనిస్తున్నారు. కోవిడ్ సంక్షోభంలో కూడా ఈ పరిశ్రమలు నిలదొక్కుకొనేందుకు వివిధ రకాల ప్రోత్సాహకాలతో ఆదుకున్నారు.
చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్
దీంతో ఈ రంగం రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతోంది. 2019 జూన్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య మూడేళ్లలో 1,06,249 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు కొత్తగా ఏర్పాటుకాగా, వీటి ద్వారా 7,22,092 మందికి ఉపాధి లభించింది. రూ.14,656 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన ఎంఎస్‌ఈ పోర్టల్ ‘ఉదయం’ కూడా ఈ వివరాలను పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 2,32,998 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉండగా అందులో 45.6 శాతం ఈ మూడేళ్లలో వచ్చినవే. ఈ మొత్తం ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ద్వారా 19,41,974 మందికి ఉపాధి లభిస్తుండగా అందులో 7.22 లక్షల మందికి ఈ మూడేళ్లలో లభించినవే.
ఎంఎస్‌ఎంఈ రంగంలో ప్రతి కోటి రూపాయల పెట్టుబడి మీద సగటున 61 మందికి ఉపాధి లభిస్తోంది. ప్రతి యూనిట్ సగటున 8 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఎంఎస్‌ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుండటంతో యూనిట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ వంటి కష్ట కాలంలో రీస్టార్ట్ ప్యాకేజ్ రూపంలో ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకోవడమే కాకుండా వరుసగా ప్రతి ఏడాదీ రాయితీలను ఇవ్వడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది.
గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలతో కలిపి అన్ని పరిశ్రమలకు రూ.3,409.66 కోట్ల పారిశ్రామిక బకాయిలు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని బాగా దెబ్బతీసింది. ఇటువంటి సమయంలో ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లతో పాటు ప్రస్తుత కాలానికి రూ.362.48 కోట్ల ప్రోత్సాహకాలు కలిపి మొత్తం రూ.1,324.53 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. వరుసగా మూడో ఏడాది మరో రూ.738.59 కోట్లు విలువైన ప్రోత్సాహక రాయితీలను చెల్లించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రతి జిల్లాలో రెండు క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 53 క్లస్టర్లను గుర్తించి, 16 క్లస్టర్లకు డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఈ 16 క్లస్టర్ల ద్వారా మరో 28,270 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ విక్రయానికి అవకాశం
రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు తయారు చేసిన ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకునేలా వీటిని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఐసీ) ప్రవేశపెట్టిన ఎంఎస్‌ఎంఈ మార్ట్‌తో అనుసంధానం చేశాం. ఎంఎస్‌ఎంఈలకు సులభంగా రుణాలిచ్చేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదన దగ్గర నుంచి విక్రయం వరకు అన్ని విధాలుగా చేయూతనిస్తున్నాం.
– వంకా రవీంద్రనాథ్, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment