సాక్షి, అమరావతి: చిన్న పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో రెండేళ్లలోనే దాదాపు 23 వేల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటినుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. పలు రాయితీలు, ఆర్థిక తోడ్పాటు కల్పిస్తూ కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
రీస్టార్ట్... బకాయిల చెల్లింపు
కోవిడ్ కష్ట కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ.. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు మూత పడకూడదన్న ఉద్దేశంతో సీఎం జగన్ దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ సత్ఫలితాలనిస్తోంది. గత సర్కారు పెట్టిన పారిశ్రామిక బకాయిలను సైతం ఒకేసారి చెల్లించి పరిశ్రమలు నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టారు. దీంతో పాత యూనిట్లు ఊపిరి పీల్చుకున్నాయి. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడటంతో కొత్త యూనిట్లు భారీగా ఏర్పాటవుతున్నాయి.
కోవిడ్ ఉధృతిలోనూ...
2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా 22,844 సూక్ష్మ, చిన్న మధ్య తరహా యూనిట్లు కొత్తగా ఏర్పాటు కావడం గమనార్హం. వీటి ద్వారా రూ.7,015.48 కోట్ల పెట్టుబడులు రాగా 1,56,296 మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పారిశ్రామిక రంగంలో ఎంత విశ్వాసాన్ని కల్పించాయంటే కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయిలో ఉన్న సమయం (2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్) మధ్య కొత్తగా 2,364 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. కోవిడ్ సమయంలో కూడా రూ.1,753.86 కోట్ల పెట్టుబడులతో 24,043 మందికి ఎంఎస్‌ఎంఈలు ఉపాధి కల్పించాయి.
ప్రభుత్వం ఇలా ఆదుకుంది...
► కోవిడ్ విపత్తు సమయంలో పరిశ్రమలను ఆదుకుంటూ 2020 మేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1,110 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజిని ప్రకటించారు. దీనివల్ల 7,718 యూనిట్లు నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగించగలిగాయి.
► గత రెండేళ్లలో 13,844 ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రూ.2,086 కోట్ల పారిశ్రామిక రాయితీలను ప్రభుత్వం విడుదల చేసింది.
► ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలు ఇచ్చింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్లు రాయితీలిచ్చింది.
► రుణాలు తిరిగి చెల్లించలేక ఎన్‌పీఏలుగా మారిన 1,08,292 యూనిట్లకు సంబంధించి రూ.3,236.52 కోట్ల విలువైన మూలధన రుణాలను వైఎస్సార్ నవోదయం పథకం కింద పునర్వ్యవస్థీకరించింది.
► కోవిడ్ సమయంలో అదనపు మూలధనం సమకూర్చుకునేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ఈసీఎల్‌జీఎస్) ద్వారా రూ.5,973 కోట్ల రుణాలను అదనంగా ఎంఎస్‌ఎంఈలకు అందించింది. దీంతో పరిశ్రమలకు నూతనోత్తేజం లభించింది. పాతవి ఉత్పత్తిని కొనసాగిస్తుండగా కొత్తవి పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి.
లాక్‌డౌన్‌లో ఆదుకుంది
లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా ప్రోత్సాహకాలను విడుదల చేసి పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద అందిన రూ.75 లక్షలతో రుణాలను సకాలంలో చెల్లించడంతోపాటు ఉత్పత్తి కొనసాగించడడానికి తగిన నగదు సమకూరింది. దీంతో లాక్‌డౌన్‌లో కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ కార్మికులకు జీతాలు చెల్లించగలిగాం. మళ్లీ ఉత్పత్తి కొనసాగించాం.
కామాక్షి మెటల్ బిల్డింగ్ ప్రోడక్ట్స్, కొండ గుంటూరు, తూర్పు గోదావరి
రీస్టార్ట్‌తో కొండంత ఉపశమనం
కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అమ్మకం పన్ను రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఒకేసారి రూ.1.04 కోట్లు చెల్లించారు. ఇది మాకు కొండంత ఉపశమనాన్ని కలిగించింది. ఈ మొత్తంతో బ్యాంకు రుణాలను చెల్లించడంతో పాటు ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించగలిగాం. మళ్లీ పరిశ్రమను నడపగలుగుతున్నాం.
దాల్మియా లామినేటర్స్ లిమిటెడ్, తడ, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment