
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించే ‘టీ–ఐడియా 2014’పథకం నిబంధనల్లో పరిశ్రమల శాఖ పలు మార్పులు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన నియమావళి ప్రకారం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లించే ప్రోత్సాహకాలను ఇకపై తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా విడుదల చేస్తారు. ప్రోత్సాహకాల చెల్లింపునకు అవసరమైన మొత్తాన్ని ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఖాతాకు పరిశ్రమల శాఖ కమిషనరేట్ బదిలీ చేస్తుంది. ఇప్పటివరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్‌ఎల్‌సీ) ఆమోదంతో దరఖాస్తుల సీనియారిటీ ఆధారంగా పరిశ్రమల శాఖ విడుదల చేస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల శాఖ విడుదల చేసే ప్రోత్సాహకాల మొత్తంలో ఇకపై 10 శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు.
ఈ మొత్తాన్ని నేరుగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఎస్‌ఐహెచ్‌సీఎల్) ఖాతాకు జమ చేస్తారు. ప్రోత్సాహకాల విడుదల కోసం సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇకపై టీఎస్‌ఐహెచ్‌సీఎల్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆయా పరిశ్రమల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి తదితరాలపై అధ్యయనం చేసి, సంబంధిత జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ)తో సమన్వయం చేసుకున్న తర్వాతే ప్రోత్సాహకాలను విడుదల చేస్తారు. గతంలో కొన్ని పరిశ్రమలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు తీసుకుని మూత పడిన నేపథ్యంలో అవకతవకలు నివారించేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు ప్రోత్సాహకాల విడుదల బాధ్యతను అప్పగించారు.
బ్రిడ్జి రుణాలు రాబట్టుకునేందుకే!
నష్టాల బాటలోఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్‌ను (టీఎస్‌ఐహెచ్‌సీఎల్) రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. రాష్ట్రంలో 13,581 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఉండగా, రూ.1,018 కోట్ల పెట్టుబడితో స్తాపించిన సూక్ష్మ పరిశ్రమలు 62 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ.76,286 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన చిన్న తరహా పరిశ్రమలు సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల్లో చాలా మందికి వ్యాపార దక్షత లేకపోవడం, మార్కెటింగ్ ఒడిదుడుకులు తదితరాలతో నష్టాలబమS బాటన పయనిస్తున్నారు.
నష్టాల బాటలో ఉన్న సుమారు 3,700 పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఉన్న ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ బ్రిడ్జి రుణాలను మంజూరు చేస్తోంది. తాజాగా సవరించిన టీ–ఐడియా నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి రుణగ్రస్త పరిశ్రమలకు విడుదలయ్యే ప్రోత్సాహకాలు ఇకపై హెల్త్ క్లినిక్ ఖాతాలో జమ అవుతాయి. తాము గతంలో ఆయా పరిశ్రమలకు ఇచ్చిన బ్రిడ్జి లోన్‌ను మినహాయించుకుని, మిగతా ప్రోత్సాహకాన్ని సంబంధిత పరిశ్రమలకు హెల్త్ క్లినిక్ విడుదల చేస్తుంది.