నేడు ఎంఎస్‌ఎంఈ పాలసీ–2024 ఆవిష్కరించనున్న సీఎం
పారిశ్రామిక సంఘాలు, నిపుణులను భాగస్వాములను చేస్తూ ఫ్రేమ్‌వర్క్
ఎస్సీ, ఎస్టీ, మహిళలకు లబ్ధి చేకూరేలా ప్రోత్సాహం
సాంకేతికత ఆధునీకరణకు రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగం పురోగతి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడటం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆరు ప్రత్యేక విధానాలకు రూపకల్పన చేస్తోంది. ఎంఎస్‌ఎంఈలు, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఆరు విధానాల రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) పాలసీ–2024’ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. ఎంఎస్‌ఎంఈల స్థాపన, అభివృద్ధి దిశగా ఈ విధానం ఉంటుందని, కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త పాలసీ పరిష్కారం చూపుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.
ఐదు అంశాలకు పెద్దపీట: రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 15కు పైగా పారిశ్రామిక సంఘాలను భాగస్వాములను చేస్తూ నిపుణుల నుంచి వందకు పైగా సలహాలు, సూచనలు స్వీకరించి ‘ఎంఎస్‌ఎంఈ పాలసీ 2024’ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. ఇందులో ఐదు అంశాలకు పెద్దపీట వేసినట్లు సమాచారం. ‘ఎస్సీ, ఎస్టీలు, మహిళలు సహా అందరికీ లబ్ధి’, ‘అన్ని ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈలు సమరీతిలో అభివృద్ధి’, ‘ఉత్పాదక సామర్థ్యం పెంపుదల’, ‘ఉపాధి కల్పన పెంచడం’, ‘టెక్నాలజీ ఆధునీకరణ’కు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు.
ఎంఎస్‌ఎంఈల సవాళ్లకు పరిష్కారం: భూమి, నిధులు, ముడి సరుకులు, కారి్మకులు, సాంకేతికత, మార్కెటింగ్ తదితర రూపాల్లో ఎంఎస్‌ఎంఈలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్ల పరిష్కారం కోసం నూతన పాలసీలో అనేక ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఎంఎస్‌ఎంఈ ల అభివృద్ధి కేంద్రాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు, ప్రత్యేక ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలకు 10 శాతం వరకు రిజర్వేషన్లు కలి్పంచే అవకాశం ఉంది. మూల ధన పెట్టుబడిపై సబ్సిడీ, నైపుణ్య శిక్షణ కోసం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’లో ఎంఎస్‌ఎంఈలకు ఉపయోగపడే కోర్సులు వంటివి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న ఎంఎస్‌ఎంఈల్లో సాంకేతికత ఆధునీకరణ కోసం రూ.100 కోట్ల నిధితో ఓ ప్రత్యేక పథకాన్ని కూడా ప్రవేశ పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల కొనుగోలుకు ప్రత్యేక సేకరణ విధానంపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment