వైఎస్సార్‌ నవోదయం పేరుతో కొత్త పథకం | Chief Minister YS Jaganmohan Reddy Has Launched A New Scheme Called YSR Navodayam To Help Small Industies And Small Enterprises | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ నవోదయం పేరుతో కొత్త పథకం

Published Mon, Jul 22 2019 1:03 PM | Last Updated on Mon, Jul 22 2019 1:23 PM

Chief Minister YS Jaganmohan Reddy Has Launched A New Scheme Called YSR Navodayam To Help Small Industies And Small Enterprises - Sakshi

ఉత్పత్తికి, వ్యయానికి తేడా రావడమో.. ఉత్పత్తులకు ఆశించిన మార్కెట్‌ లేకపోవడమో.. ప్రోత్సాహం కొరవడడమో తెలీదు గాని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. నష్టాలను భరించలేక పలు పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫలితంగా వాటిపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడుతున్నారు. జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో 25 శాతం వరకు çసూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. 45 శాతం వరకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల వేలల్లో కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్లడానికి గల కారణాలను ఆరా తీయడమే కాకుండా వాటిని ఆదుకోవాలని సంకల్పించింది. వైఎస్సార్‌ నవోదయం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఊతం ఇవ్వడంతో పాటు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా.. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కేటాయించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.    – సాక్షి, విశాఖపట్నం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ‘వైఎస్సార్‌ నవోదయం’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఆదుకోవాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం సుమారుగా 86 వేల వరకు గుర్తించింది. రూ.4 వేల కోట్ల రుణాలు వన్‌ టైం రీస్ట్రక్చర్‌ చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలపడంపై సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమల యజమానుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల ఏ ఒక్క చిన్న పరిశ్రమ ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయంతో ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పించే చర్యలు చేపట్టనుంది. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తొమ్మిది నెలల వ్యవధిని ఏపీ కేబినెట్‌ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

తిరోగమనం నుంచి పురోగమనం దిశగా...
జిల్లాలో 133 భారీ పరిశ్రమలుండగా 12,750 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో గ్రానైట్, ఆక్వా రంగంతో పాటు ఇటుకల పరిశ్రమలు, సిమెంట్‌ ఫ్లైయాష్‌ బ్రిక్స్, బీరువాల తయారీ, విస్తరాకుల తయారీ, పచ్చళ్ల తయారీ, పాడి పరిశ్రమ, కేబుల్‌ నెట్‌వర్క్, మంచినీటి వ్యాపారం, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ తయారీ, ప్రింటింగ్‌ రంగం, టైలరింగ్, జనపనార సంచుల తయారీ వంటి ఎన్నో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం చిన్న పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఎక్కువ పరిశ్రమలకు ప్రోత్సాహం లేక చాలా వరకు మూతపడినవి కూడా ఉన్నాయి. ఇలా మూతపడిన పరిశ్రమలలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారే ఉండటం గమనార్హం. గత మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 30 నుంచి 40 శాతం వరకు జిల్లాలో ఉన్నాయి.

వీటిలో అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆర్థిక చేయూత కల్పించి.. తిరిగి జీవం పోసేందుకు సర్కారు శ్రీకారం చుట్టడంపై పరిశ్రమల వర్గాల్లో సర్వాత్ర హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చిన్న పరిశ్రమలకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలకు కోటి రూపాయల వరకు రుణం మంజూరుకు అవకాశం కల్పించే ప్రకటన చేయడం కూడా ఊరట కలిగించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల రానున్న ఐదేళ్లలో చిన్న పరిశ్రమలు ఊపందుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఫలితంగా మరికొంత మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగుతాయి. 

ఉచిత విద్యుత్‌ సౌకర్యం కూడా....
చిన్న పరిశ్రమలకు చేయూతతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 3,29,486 మంది ఎస్సీలకు, 6,18,500 ఎస్టీలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకానికి రూ.411 కోట్లు ఖర్చు చేయనుంది. ఉచిత విద్యుత్‌ గతంలో కేవలం 100 యూనిట్ల వరకే ఉండేది. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం మరో 20 యూనిట్లను అదనంగా పెంచింది. ఇదే సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

జిల్లాలో....
సూక్ష్మ తరహా పరిశ్రమలు  -     10,200
చిన్న తరహా పరిశ్రమలు   -   2,100
మధ్య తరహా పరిశ్రమలు -     450
భారీ పరిశ్రమలు    -  133
ఐదేళ్లలో మూతపడిన పరిశ్రమలు  -    25 శాతం
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిశ్రమలు  -    45 శాతం
ఎస్సీ, ఎస్టీలకు ఉన్న ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు -    10 శాతం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement