జిన్నారం: కరెంటు కోతలు...అంచనా మేరకు కాని ఉత్పత్తి...అర్డర్లూ అంతంతమాత్రం..దీంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. రోజుకో ఫ్యాక్టరీ మూతపడుతుంటే మెతుకుసీమకే తలమానికంగా ఉన్న పారిశ్రామిక వాడలన్నీ వెలవెలబోతున్నాయి. ఏడాది క్రితం లాభాల్లో ఉన్న పరిశ్రమలు కూడా ఇపుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యాలు గేట్లు మూసేస్తుండడంతో కార్మికులు వీధిన పడుతున్నారు. బహుళ సంస్థలకు చెందిన పరిశ్రమలు నడుస్తున్నా, చిన్న పరిశ్రమలు మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
50 వేల మంది భవిష్యత్ అగమ్యగోచరం
జిన్నారం మండలంలోని బొంతపల్లి, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం గ్రామాల్లో సుమారు 200పైగా వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు జీవనోపాధిని పొందుతున్నారు. రాష్ట్రం విడిపోవడం...కరెంటు కోతల ప్రభావం పరిశ్రమలపై భారీ చూపుతోంది. కరెంటు కోతల నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం...నిర్ణీత సమయానికి డెలివరీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా ఇపుడు రద్దయ్యాయి.
దీంతో చిన్నా, చితక కంపెనీలన్నీ ఇప్పటికే మూతపడ్డాయి. చాలా కంపెనీలు తాత్కాలికంగా గేట్లు మూసేశాయి. మరికొన్ని నడుస్తున్నా కార్మికులకు పూర్తిస్థాయిలో పని దొరకడం లేదు. ఒక్క జిన్నారం మండలంలో సుమారు 50 వరకు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. మరో 30 వరకు పరిశ్రమలు తాత్కాలికంగా ఉత్పత్తులను నిలిపివేశాయంటే పరిశ్రమల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోడ్డునపడ్డ జీవితాలు
పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో వాటిల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిశ్రమలు మూతపడడంతో జిన్నారం మండలంలోనే సుమారు 15 వేల మంది కార్మికులు వీధిన పడాల్సి వచ్చింది. దీంతో వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కార్మికులకు ప్రస్తుతం పనులు లేకపోవటంతో ఉపాధి కో సం రోడ్ల వెంట తిరుగుతున్నారు. నడుస్తున్న కొన్ని పరిశ్రమలు కూడా స్థానికులకు ఉపాధిని కల్పించటం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బడుగు జీవులు అల్లాడిపోతున్నారు.
స్టీల్ పరిశ్రమలకూ గడ్డుకాలం
జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు 30 వరకు స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నడిపేందుకు ఎక్కువ మొత్తంలో విద్యుత్ అవసరం. ప్రస్తుతం తీవ్రమైన కరెంటు సమస్య వల్ల స్టీల్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు.
పరిశ్రమలు మూతకు గల కారణాలు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కోతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ రావటంతో ఇక్కడి ఉత్పత్తులను అక్కడికి సరఫరా చేయలేకపోవటం.
రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఎగుమతులు, దిగుమతుల్లో అదనపు పన్నుల భారం.
పెద్ద పరిశ్రమలు చిన్న పరిశ్రమలకు తగిన ఆర్డర్లు ఇవ్వక పోవటం.
కష్టపడి పరిశ్రమను నడిపినా లాభాలు లేకపోవటం.
పరిశ్రమలకు తాళం.. బతుకు ఆగం
Published Mon, Nov 17 2014 11:40 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement