ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో విస్ఫోటనం ఘటనపై మల్లగుల్లాలు
చికిత్స పొందుతూ ఒకరు మృతి..ఇద్దరి పరిస్థితి విషమం
యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ కార్మికుల ఆందోళన
పూర్తిస్థాయి విచారణ చేస్తాం: ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ
పెళ్లకూరు: 25 టన్నుల సామర్థ్యం ఉన్న ఫర్నేస్ బాయిలర్‌కు కాలం చెల్లిన కారణంగానే.. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఫర్నేస్ విస్ఫోటనం ఘటన చోటు చేసుకుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అధికారికంగా ఒకరు మృతి చెందగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని యాజమాన్యం చెబుతున్నది.
వివరాల్లోకి వెళితే..తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలంలోని పెన్నేపల్లి గ్రామ సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలోని ఫర్నేస్ బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు భారీశబ్దంతో పేలిపోయింది. ఘటన విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకున్నప్పటికీ లోపలికి వెళ్లేందుకు సాహసించలేదు. మంటల ఉధృతి తగ్గిన అనంతరం కార్మికుల సహకారంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లారు.
చెన్నైలో చికిత్స పొందుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు సిపాయిలాల్ (30) ప్రాణాలు కోల్పోగా, రవిభర్వాజ్, సోను పరిస్థితి విషమంగా ఉంది. వీరితో పాటు విశ్వకర్మ, మణి, మహ్మద్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే తొలుత భారీగా ప్రాణనష్టం జరిగిందని భావించినా.. ఒక్కరే మృతి చెందారని యాజమాన్యం ధ్రువీకరించడంతో కార్మికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..
స్టీల్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని అటు కార్మికులు, ఇటు స్థానికులు ఆరోపిస్తున్నారు. 25 టన్నుల సామర్థ్యం ఉన్న ఫర్నేస్‌కు కాలం చెల్లిన విషయాన్ని అక్కడి కార్మికులు పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. పరిశ్రమలో రెండో ప్లాంట్ ఏర్పాటుకు పంచాయతీ అనుమతులు గానీ, ప్రజాభిప్రాయం గానీ చేపట్టలేదని చెబుతున్నారు.
పరిశ్రమలో పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులచేత పనులు చేయించుకుంటూ అక్కడ కార్మికుల సమాచారం గోప్యంగా ఉంచడం వల్ల యాజమాన్యంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ పరిశ్రమలోని ప్రమాదకరమైన యంత్రాల వద్ద పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి రక్షణ కవచాలు లేవని తెలుస్తోంది.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, ఆర్డీవో కిరణ్మయి గురువారం పరిశ్రమ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment