jinnaram
-
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ ఆధ్వర్యంలో తలసేమియా పరీక్షలు
హైదరాబాద్: రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ అధ్వర్యంలో తలసేమియా(సికిల్ సెల్ అనీమియా) వ్యాధిని గుర్తించే హెచ్పీఎల్సీ(హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ) పరీక్షలను నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు నర్గీస్ సకీనా యార్ ఖాన్, కార్యదర్శి ఫాతిమా తాహిర్‌లు.. జిన్నారం మండలంలోని వావిలాల గ్రామంలో 23 మంది మహిళలకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ హానికర రక్త హీనత(సికిల్ సెల్ అనీమియా) వంశపారంపర్యంగా వ్యాపిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్లో లోపం కారణంగా ఇది సంభవిస్తుంది. జన్యువులలో మ్యుటేషన్ కారణంగా ఈ వ్యాధి రావచ్చని వైద్యులు తెలిపారు. పుట్టుకతో వచ్చే ఈ వ్యాధి తల్లి నుంచి శిశువుకు వ్యాపించకుండా నిరోధించడానికి గర్భిణీలకు ముందస్తు నిర్ధారణ చాలా ముఖ్యమని డాక్టర్లు వెల్లడించారు. తలసేమియా వ్యాధి కలిగిన వ్యక్తులను గుర్తించడానికి ఈ హెచ్పీఎల్సీ (హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ) స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తల్లి నుంచి శిశువుకు వ్యాధి వ్యాపించకుండా నిర్దారణకు ఈ టెస్టు ఉపయోగపడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. సికిల్ సెల్ అనీమియాను కనిపెట్టడానికి హెచ్పీఎల్సీ టెస్టింగ్ నిర్దిష్టమైన ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. ఈ పరీక్షలు నిర్వహించడానికి తమకు ఎఫ్‌పీఏఐ సహాయం చేసినట్లు చెప్పారు. తలసేమియాను గుర్తించిన మహిళలకు కాల్షియం సిరప్, మల్టీవిటమిన్ సిరప్ బాటిల్లను అందించారు. ఇదీ చదవండి: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. అప్రమత్తమైన బల్దియా -
చిన్నారికి ఉపరాష్ట్రపతి అభినందనలు
జిన్నారం (పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న అల్పన అనే విద్యార్థినిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా అభినందించారు. అందమైన చేతిరాతతో ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అల్పన రాసిన సందేశం ఉపరాష్ట్రపతిని చేరింది. స్పందించిన ఆయన ‘చక్కని చేవ్రాలుతో మంచి మాటలు, మనసును మరింత హత్తుకుంటాయని, సద్గుణాలు, మానవత్వం గురించి అల్పన తెలుగులో ఎంతో ముచ్చటగా రాసిందని, చిన్న వయస్సులోనే ఇంత చక్కని చేతిరాతను అలవాటు చేసుకున్న ఆ చిన్నారికి అభినందనలు’అని ట్వీట్ చేశారు. దీంతో చిన్నారికి చక్కటి చేతి రాతను నేర్పించిన పైసా సత్యంతో పాటు చిన్నారి అల్పనను పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. చదవండి: మనకూ బ్రాండ్ ఉండాలి.. సర్కార్ బ్రాండ్‌తో మార్కెటింగ్ -
అక్రమ సంబంధమే హత్యకు కారణం
జిన్నారం(పటాన్చెరు) : ఈ నెల 3 సాదుల్లానగర్‌లో జరిగిన వ్యక్తి హత్యకు అక్రమ సంబంధమే కారణమని జిన్నారం సీఐ శ్యామల వెంకటేశ్ తెలిపారు. ఇందుకు కారణమైన 8 మదిని అదుపులోకి తీసకున్నట్లు ఆయన చెప్పారు. సీఐ కథనం ప్రకారం.. హత్నూర మండలంలోని సాదుల్లానగర్‌కు చెందిన ఎర్రోళ్ల ప్రభాకర్ భార్యకు అదే గ్రామంలో నివాసం ఉంటూ అతనికి వరసకు మేన బావ అయిన చెక్కల భాస్కర్‌కు గత కొంత కాలంగా అక్రమ సంబంధం ఉంది. ప్రభాకర్ భార్య, చెక్కల భాస్కర్‌కు వరసకు చెల్లి అవుతుంది. విషయం తెలుసుకున్న ప్రభాకర్ చాలా సార్లు భాస్కర్‌కు తన భార్యతో సంబంధం మానుకోవాలని సూచించాడు. అయినా అతనిలో మార్పు రాక పోవడంతో ప్రభాకర్ అనేక సార్లు భాస్కర్‌ను చంపుతానని హెచ్చరించాడు. ఎలాగైన భాస్కర్‌ను చంపాలని నిర్ణయించుకున్న ప్రభాకర్ వరసకు తమ్ముళ్లయిన సాదుల్లానగర్‌కు చెందిన ఎర్రోళ్ల రమేశ్, ఎర్రోళ్ల వీరేశం, నస్తిపూర్లో నివాసం ఉంటున్న బోయిన శ్రీధర్‌లతో పాటు జిన్నారం మండలంలోని మంగంపేట గ్రామంలో నివాసం ఉంటూ వరసకు బావ అయిన మాచబోయిన శ్రీకాంత్‌లతో కలిసి భాస్కర్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. భాస్కర్ చాలా బలవంతుడని భావించిన ప్రభాకర్ వడ్డేపల్లి గ్రామానికి చెందిన గతంలో కొన్ని కేసులు ఉండి, ప్రసుతం నర్సాపూర్‌లో నివాసం ఉంటున్న హనుమంతు నరేష్గౌడ్ను కలిశాడు. డబ్బులు ఇస్తానని ఎలాగైన భాస్కర్‌ను చంపాలని అతడిని కోరాడు. దీంతో నరేష్‌గౌడ్ నర్సాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న తన స్నేహితులైన తొంట ప్రేమ్‌కుమార్, తొంట వినయ్‌కుమార్‌లతో కలిసి భాస్కర్‌ను చంపేందుకు సిద్దమయ్యారు. ఈనెల 3న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భాస్కర్ ఇంట్లో ఉన్న సమయంలో ప్రభాకర్‌తో పాటు మిగతా వారు అతడిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న భాస్కర్ కళ్లల్లో కారం చల్లి బయటకు తీసుకువచ్చారు. ప్రభాకర్‌తో పాటు మిగత తమ్ముళ్లు, స్నేహితులు భాస్కర్‌ను తీవ్రంగా కొట్టారు. వీరంతా అతడిని పట్టుకుని ఉండగా ప్రభాకర్ కత్తితో అతని చేతిని విరగొట్టి హత్యచేశాడు. ఈ సంఘటనలో అప్పట్లో సంచలనం రేపింది. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నాడు. గురువారం గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా కనిపించటంతో 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా భాస్కర్‌ను హత్య చేసింది వీరేనని తేలింది. దీంతో ఏ1గా ప్రభాకర్‌తో పాటు అతని తమ్ముళ్లు రమేశ్, వీరేశం, శ్రీధర్, శ్రీకాంత్, నర్సాపూర్‌లోని నరేష్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, వినయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. త్వరగా కేసును ఛేదించేందుకు కృషి చేసిన పోలీసులను సీఐ శ్యామల వెంకటేశ్ అభినందించారు. -
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
జిన్నారం: జిన్నారం, గుమ్మడిదల మండలాలను సంగారెడ్డి జిల్లాలో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల చిత్రపటాలకు గుమ్మడిదల టీఆర్ఎస్ నాయకులు మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ రెండు మండలాలను సంగారెడ్డిలో కలిపేలా సీఎం నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. కొత్తగా ఏర్పాటైన తమ మండలాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం తగిన నిధులు వెచ్చించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డి, నాయకులు కుమార్‌గౌడ్, గోవర్ధన్‌రెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, నరేందర్, బాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని ‘మెదక్’లో కలపొద్దు
జిన్నారం, గుమ్మడిదల మండలాలను సంగారెడ్డిలో కలపాలని ఆందోళన సెల్ టవర్ ఎక్కిన టీఆర్ఎస్ నాయకులు.. అఖిలపక్షం రాస్తారోకో జిన్నారం: జిన్నారంతో పాటు నూతనంగా ఏర్పాటుకానున్న గుమ్మడిదల మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. మెదక్ జిల్లాలో ఈ రెండు మండలాలను కలిపే విధంగా కొందరు నాయకులు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన నాయకులు కుమార్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, మౌసిన్ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా అఖిలపక్ష నాయకులు గుమ్మడిదల ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో చేపట్టారు. నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి కూడా సెల్‌టవర్ ఎక్కినవారిని కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తాము కూడా రెండు మండలాలను సంగారెడ్డిలో కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా చేస్తున్న అఖిలపక్ష నాయకులకు మద్దతు ప్రకటించారు. కాగా, నిరసనకారులు ఎంతకీ సెల్ టవర్ దిగకపోవటంతో అధికార పార్టీ నేతలు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయా మండలాలను సంగారెడ్డిలో కొనసాగించేలా సీఎంతో చర్చిస్తున్నామని, ఆందోళనలు విరమించాలని నిరసనకారులకు ప్రజాప్రతినిధులు సూచించారు. దీంతో నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు, ఎస్సై ప్రశాంత్.. నిరసనకారులను కిందికి దించారు. ధర్నాలో కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ ప్రభాకర్, ఇతర పార్టీల నాయకులు గిద్దెరాజు, చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్, నరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, మద్ది వీరారెడ్డి, గోవర్ధన్‌గౌడ్, మంగయ్య తదితరులున్నారు. -
గాయత్రీదేవిగా భద్రకాళీ అమ్మవారు
జిన్నారం: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బొంతపల్లిలోని భద్రకాళీ అమ్మవారు ఆదివారం గాయత్రీ దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. అమ్మవారిని దర్మించుకునేందుకు భక్తులు బారులు తీరారు. బొంతపల్లిలోని దుర్గామాత సన్నిధిలో స్థానిక నాయకుల చక్రపాణి, శంకర్ల ఆద్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. జిన్నారంలోని దుర్గామాత సన్నిధిలో భక్తులు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారి కృపవల్ల ప్రజలు సంతోషంగా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. -
అక్టోబర్ 2 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జిన్నారం: మండలంలోని గుమ్మడిదల గ్రామంలో గల కల్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలను వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కూడ అర్చకులు ఆవిష్కరించారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున స్వస్తి వాచనం, 3న ధ్వజారోహణం, శేషవాహనం, 4న స్వామివారి అభిషేకం, గజవాహన సేవ, 5న కల్యాణోత్సవం, హనుమంత వాహన సేవ, 6న సదస్వం, గరుడవాహన సేవ, 7న మహాపూర్ణాహుతి, అశ్వవాహన సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ వంశపారం పర్య ధర్మకర్తలు సుందరాచార్యులు, నర్సింహ్మాచార్యులు తెలిపారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటంలో తాము కూడా భాగస్వాములవుతామని సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డిలు తెలిపారు. -
దెబ్బతిన్న పంటల పరిశీలన
జిన్నారం: మండలంలోని బొంతపల్లి, అండూర్ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు వర్షం కారణంగా నష్టపోయిన పంటలను బుధవారం పరిశీలించారు. అండూర్‌లో మండల వ్యవసాయశాఖ అధికారి సాల్మన్‌నాయక్ నష్టపోయిన మొక్కజొన్న, వరి, జొన్న పంటలను ఆయన పరిశీలించారు. సుమారు వంద ఎకరాల్లో వివిధ రకాల పంటలు వర్షం కారణంగా నష్టపోయాయని ఆయన తెలిపారు. బొంతపల్లిలోని వీరన్న చెరువు అలుగు పారటంతో వరి పంట నాశనమైందని రైతులు అధికారులకు తెలిపారు. ఏఈఓ చైతన్య వరి పంటలను పరిశీలించారు. బొంతపల్లిలో సుమారు 50 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నాశనమైందని చైతన్య తెలిపారు. పంట నష్టంపూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పారు. -
రైతన్నలపై వరుణుడి ఆగ్రహం
సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల వినతి జిన్నారం: మూడు రోజులుగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల వరకు వివిధ రకాల పంటలు, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బొంతపల్లి, సోలక్పల్లి, వావిలాల, రాళ్లకత్వ తదితర గ్రామాల్లో రైతులు వేసిన వరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పైనుంచి వర్షపు నీరు వెళ్లటంతో వరి పూర్తిగా వంగి పోయింది. నీరు ఎక్కువగా చేనులో నిలవ ఉండటంతో వరి పంట నాశనమైనట్లేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సుమారు ఐదువందల ఎకరాల్లో వరిపంట నాశనమైనట్లు అధికారులుఅంచనా వేస్తున్నారు. మండలంలోని గుమ్మడిదల, అనంతారం, కానుకుంట, మంబాపూర్ తదితరగ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న కూరగాయ పం టలకు కూడా నష్టం వాటిల్లింది. పంట చేనులోకి నీరు ఎక్కువగా నిలవ ఉండటంతో పంటకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. టమాటా, క్యాబేజీ, కాలీప్లవర్, బెండ, పచ్చిమిర్చీ, చిక్కుడు, పొట్లకాయ లాంటి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఉద్యానవనశాఖఅ ధికారులు చెబుతున్నారు. సుమారు 300 ఎకరాల్లో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు పత్తి, మొక్క జొన్న పంటలు కూడా వర్షం కారణంగా నష్టపోయిందని, రెండు వందల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. అనంతారం గ్రామంలోని ఓ రైతుకు చెందిన ఫౌల్రీ్ట ఫారంలోకి వర్షం నీరు వెళ్లి రెండువేల వరకు కోడి పిల్లలు మృతి చెందాయి. దీంనితో పాటు గుమ్మడిదలలోని ఓ రైస్‌మిల్లులోని ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వర్షం కారణంగా మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇదే వర్షం నెల రోజులకు ముందుపడి ఉంటే బాగుండేదని రైతులు అంటున్నారు. ప్రస్తుతం పంటలను తాము తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఆయా గ్రామాల్లో నష్టపోయిన పంటలను తాము పరిశీలించాం. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. - సాల్మన్‌నాయక్, మండల వ్యవసాయ అధికారి -
రాఖీ కట్టేందుకు వచ్చి మృత్యువాత
స్కూటీని ఢీకొట్టిన బొలెరో వాహనం అక్క, తమ్ముడి మృతి.. ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల చిన్నారి జిన్నారం: నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష అనుకుంటూ రెండు రోజుల క్రితమే ఆ అక్క తమ్ముడికి రాఖీ కట్టింది.తమ్ముడికి రాఖీ కట్టేందుకు వచ్చిన అక్కను తిరిగి అత్తారింటికి పంపే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కా, తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరు నెలల చిన్నారి మాత్రం మృత్యువు నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటనతో కిష్టాయిపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని కిష్టాయిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన రెండో కూతురు పరిమల (25) తమ్మడు సాయి కిరణ్ గౌడ్ (22)కు రాఖీ కట్టేందుకు రెండు రోజుల క్రితం పుట్టినిళ్లు కిష్టాయిపల్లికి వచ్చింది. పరిమలకు ఆరు నెలల వయస్సున్న కూతురు శైనీ ఉంది. రాఖీ పండుగ జరుపుకున్న అనంతరం మరిమలను తన అత్తారిల్లు రంగారెడ్డి జిల్లా వెనకనూతల గ్రామానికి పంపేందుకు తమ్ముడు స్కూటీపై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లోని ఔటర్ సర్వీస్ రింగు రోడ్డు గుండా వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సాయికిరణ్‌గౌడ్ నడిపిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో సాయి కిరణ్‌గౌడ్‌తో పాటు అక్క పరిమళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పరిమళ కూతురు శైనీ ఎగిరిపడడంతో స్వల్ప గాయాలయ్యాయి.ఈ విషయాన్ని తెలుసుకున్న సాయికిరణ్‌గౌడ్ తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరుకు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాపు జరుపుతున్నామని ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ప్రమాదానికి కారణమై బొలెరో వాహనంతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. గడ్డపోతారం మాజీ సర్పంచ్ నీరుడి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
గ్రామాల్లో రాఖీ సందడి
జిన్నారం: రాఖీ పండుగ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. గురువారం రాఖీ పండుగ కావటంతో గ్రామాల్లోని దుకాణాలు వివిధ రకాల రాఖీలతో కళకళలాడుతున్నాయి. చిన్నారులు, యువతులు, మహిళలు రాఖీ దుకాణాల వద్ద బారులు తీరారు. వివిధ రకాల రాఖీలను కొనుగోలు చేసేందుకు మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాల్లోనీ స్వీటు షాపులు కూడా కళకళలాడుతున్నాయి. మండల కేంద్రమైన జిన్నారంలోని వివేకానంద పాఠశాలల్లో ప్రిన్సిపల్ కరుణాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలోరాఖీ పండుగను బుధవారం నిర్వహించారు. చిన్నారులకు రాఖీ పండుగ ప్రాముఖ్యను ప్రముఖ విద్యావేత్త వివరించారు. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు కూడా తోటి ఉపాధ్యాయులకు రాఖీ కటి్్ట పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతిభా విద్యానికేతన్ పాఠశాలలో ప్రిన్సిపాల్ సార శ్రీినివాస్ ఆధ్వర్యంలో కూడా రాఖీ పండుగ ఉత్సవాలను నిర్వహించారు. విద్యార్థులకు రాఖీ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు రాఖీ ఆకారంలో ఏర్పడటం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. రాఖీప ండుగను ఘనంగానిర్వహించుకుంటామని మహిళలు, యువతులు చెబుతున్నారు. -
ఉల్లిసాగుతో లాభాలు
పంటను కాపాడేందుకు అధికారుల సూచనలు, సలహాలు తప్పని సరి జిన్నారం: ఉల్లి సాగు చేసేందుకు రైతులు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో కూడా ఉల్లికి మంచి ధర ఉంది. దీంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. ఉల్లి సాగుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలాంటి తెగుళ్లు వస్తాయి, రోగాల నివారణకు ఏమేమి చర్యలు తీసుకోవాలనే విషయమై ఉద్యానశాఖ అధికారి అనిల్‌కుమార్ (సెల్ : 8374449348)సలహాలు, సూచనలు చేస్తున్నారు. పంటను విత్తే సమయం ఖరీఫ్ సీజన్లో జూన్-జులై నుంచి అక్టోబర్- నవంబర్ వరకు సాగు చేయవచ్చు. వేసవి పంటగా జనవరి- ఫిబ్రవరి నెలల్లో కూడా పంట వేసుకోవచ్చు పంట సాగుకు ఉండాల్సిన నేల : ఉల్లి సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన మెరక నేల అవసరం. ఉప్పు, చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. సోకే తెగుళ్లు : నివారణ చర్యలు : 1. తామర పురుగు : లక్షణాలు : ఈ పురుగు మొక్కల ఆకుల మొవ్వలలో ఉండి రసాన్ని పీలుస్తుంది. దీని వలన ఆకులమీద తెల్లని మచ్చలు వస్తాయి. దీంతో ఆకులు కొనల నుంచి కింది వరకు ఎండిపోతాయి. నివారణ : తామర పురుగు నివారణకు లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ 0.05శాతం 50ఇసీ మిథైల్ పారథియాన్ మందును వేసి పంటపై పిచికారి చేయాలి. 2. నారుకుళ్లు తెగులు : లక్షణాలు : ఈ తెగులు సోకటంతో నారుమడిలోని మొలకెత్తు విత్తనాలను, నారును ఆశిస్తుంది. దీంతో పంట ఎదగదు. నివారణ చర్యలు : దీని నివారణకు 1శాతం బోర్డో మిశ్రమంతో గాని లేదా, 0.3శాతం సెరసాన్‌తో గాని నేలను బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి. 3. ఆకులను తినే గొంగళి పురుగు : లక్షణాలు : పంట ఎదుగుతున్న సమయంలో పంటకు గొంగళి పురుగులు వస్తాయి. ఇవి ఆకులను పూర్తిగా తినేస్తాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణ చర్యలు : గొంగళి పురుగు నివారణకు 2మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ మందను మందును ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు : ల„ýక్షణాలు : ఆకుమచ్చ తెగులు వాతావర ణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు సోకుతుంది. ప్రారంభ దశలో ఆకుల మీద బూడిద రంగు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు సోకిన ఆకులు వాలిపోయి ఎండిపోతాయి. నివారణ చర్యలు : దీనినివారణ చర్యలకు సమయానుకూలంగా 1శాతం బోర్డో మిశ్రమాన్ని 15రోజుల వ్యవధిలో చల్లాలి. అందుబాటులో విత్తనాలు : 75శాతం సబ్సీడీపై విత్తనాలను అందించే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కిలో ఉల్లిగడ్డ విత్తనాలు రూ. 1350 ధర ఉండగా, 75శాతం సబ్సిడీపై రూ. 350కి విక్రయిస్తున్నారు. -
అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి
జిన్నారం: మంబాపూర్లో దళితులను దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. కేవీపీఎస్ నాయకులు గురువారం గ్రామంలో పర్యటించారు. కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజుతో పాటు నాయకులు దళితులతో మాట్లాడి జరిగిన సంఘటనపై విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. దళితులపై దాడి జరిపి, వారిని గుడిలోకి రాకుండా అడ్డుకున్నవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. -
రాష్ట్రస్థాయి కరాటేలో ప్రతిభ కనభర్చిన మెదక్ విద్యార్థులు
మెదక్ :జిన్నారం మండలం అన్నారంలో ఆదివారం జరిగిన బుడోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో మెదక్ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్ జీఎన్ రవి తెలిపారు. పోటల్లో ప్రతిభ కనబర్చిన వారికి కరాటే చీఫ్ రవీందర్ మెడల్స్ ప్రదానం చేశారు. పోటీల్లో మెదక్ చెందిన శివకుమార్, హరి, సుప్రియ, శృతి, ప్రేమ్‌కుమార్, అరవింద్, వరుణ్‌గౌడ్, సునీల్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు ప్రతిభను కనబర్చినట్లు తెలిపార\. -
దేవుడా బతికేదెట్టా?
► గాలి పీల్చలేం.. నీరు తాగలేం ► మెతుకుసీమలో కోరలు చాచిన కాలుష్యం ► పారిశ్రామిక వాడల్లో దినదినగండమే.. ► ఇష్టారాజ్యంగా వ్యర్థాల విడుదల ► మహిళలకు గర్భస్రావాలు.. ► సోకుతున్న ప్రాణాంతక వ్యాధులు ► విలవిల్లాడుతున్న చిన్నారులు ► అంతరిస్తున్న పశుపక్ష్యాదులు ► విదేశాలకూ పాకిన ఇక్కడి పొగలు ► ఇక్కడి పాలకులకు పట్టని సెగలు ► ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు జిల్లాలో కాలుష్యం పంజా విసురుతోంది. కాసారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని ప్రముఖ పర్యావరణ వేత్తలతో పాటు నార్వే దేశం లోని టీవీ ఛానల్స్ వారు కూడా మన కాలుష్యంపై డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్నారంటే ఇక్కడి కాలుష్యం ఎంతటి ప్రభావాన్ని చూపుతుంతో అర్థమవుతోంది. పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యమయ్యాయి. చెరువులు, కుంటలు కాలుష్యంగా మారి, ఇందులోని నీరు ఎందుకూ పనికి రాకుండా పోతోంది. మంజీరానదిలోని తాగునీరు కూడా కాలుష్యం బారిన పడుతుంది. వెయ్యి ఫీట్ల లోతుగా భూమిలో నీరు ఉన్నా అది పసుపు రంగులో బయటకు వస్తుందంటే కాలుష్యం తీవ్రత ఎంత ఉంతో ఇట్టే తెలిసిపోతోంది. గాలి కూడా కలుషితమయ్యింది. దీంతో ప్రజలు బతకటమే కష్టమవుతున్న సందర్భాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా కాలుష్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం .. జిన్నారం / పటాన్చెరు / కొండాపూర్ / పుల్కల్ / శివ్వంపేట / జహీరాబాద్ టౌన్ : జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, బొల్లారం గ్రామాలు పూర్తిగా పారిశ్రామిక ప్రాంతాలు. ఈ పారిశ్రామిక వాడల్లో సుమారు 250 భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లో 80శాతం వరకు రసాయన పరిశ్రమలే. సుమారు ఇరవై ఏళ్లక్రితం ఈ ప్రాంతాల్లో భారీగా రసాయన పరిశ్రమలు వెలిశాయి. అప్పటి నుంచి నేటి వరకు కాలుష్య ప్రవాహం ఈ ప్రాంతంలో కొనసాగుతూనే ఉంది. ఇక్కడి కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో పర్యావరణ వేత్తలు కాలుష్య సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. దీంతో ఈ కేసును సుప్రీం కోర్టు చెన్నైలోని గ్రీన్ పీస్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. – భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం : వెయ్యి ఫీట్ల పసుపు రంగులో నీరు బయటకు వస్తుంటుంది. అంటే ఇక్కడి కాలుష్యం భూగర్భంలో ఎంతగా ఇంకిపోయిందో అర్థమవుతుంది. సాగుపై కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భూగర్భంలోంచి స్వచ్ఛమైన నీరు గగనమేనని పర్యావరణ వేత్తలు, అధికారులు చెబుతున్నారు. ఇక్కడి పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలను తుంగలోకి తొక్చి ఇష్టారాజ్యంగా కాలుష్య జలాలను బహిరంగంగా బయటకు వదులుతుండటమే ఇందుకు కారణం. – ఘాటు వాసనలు: పారిశ్రామిక వాడల్లోని ప్రజలు నిత్యం కాలుష్యం, ఘాటైన వాయువులనే పీలుస్తున్నారు. శ్వాస పీల్చుకోవటం కష్టతరమవుతుంది. రాత్రి అయిందంటే ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. కళ్లలో మంట, కడుపులో వికారంతో ఇబ్బందులు పడుతున్నారు. – ప్రాణాంతకమై వ్యాధులు : వాయు, జలకాలుష్యం వల్ల ప్రజలు ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయి. క్యాన్సర్, చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు, నిమోనియా, ఆస్తమా, టీబీ లాంటి వ్యాధులతో తీవ్రంగా బాధ పడుతున్నారు. ప్రతినిత్యం వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చిన్నారుల్లో పెరుగుదల కూడా లోపిస్తోంది. బుద్ధి మాధ్యం, జ్ఞాపక శక్తి లోపం లాంటిసమస్యలతో చిన్నారులు బాధపడుతున్నారు. కాలుష్యాన్ని పీలుస్తుండటంతో ఇక్కడి ప్రజల ఆయుష్షు కూడా తగ్గుతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. సాగులేక.. బతకలేక.. పారిశ్రామిక వాడల్లో వ్యవసాయం పూర్తిగా కనుమరుగైంది. 50ఏళ్ల క్రితం పంట పొలాలతో కళకళలాడిన గ్రామాలు నేడు బీడువారి కళావిహీనంగా మారాయి. పాడి పశువులు కాలుష్య జలాలను తాగి మృత్యువాత పడుతున్నాయి. దీంతో విలువైన పశు సంపద కూడా హరిస్తోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటి వరకు సుమారు 3వేల ఎకరాల్లో పంట కనుమరుగైంది. 500 వరకు మూగజీవాలు మృతి చెందాయి. చెరువులు, కుంటల్లో సైతం.. పారిశ్రామిక వాడల్లో గల కుంటలు, చెరువుల్లో కాలుష్య జలాలే.. బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం గ్రామాల్లోని సుమారు 30 కుంటలు, 10 చెరువులు కాలుష్యంగా కాసారాలుగా మారాయి. ఖాజీపల్లి ఖాజీ చెరువులోని కాలుష్యమట్టిని తొలగించి, ప్రక్షాళన చేయాలని పదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఇందుకోసం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోలేదు. ఇతర దేశాల దృష్టి పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే నష్టాలను తెలుసుకునేందుకు ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగళూరు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యావరణ వేత్తలు మండలంలోని ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తుంటారు. రసాయన పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే కాలుష్యం సమస్యను పూర్తిగా తెలుసుకుంటారు. తాజాగా నార్వే దేశానికి చెందిన కొంత మంది టీవీ ప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణను చేపట్టారు. రసాయన పరిశ్రమల స్థాపన వల్ల కలిగే నష్టాలను నార్వే దేశ ప్రభుత్వానికి అందించేందుకు గాను ఈ డాక్యుమెంటరీని టీవీ ఛానల్ ప్రతినిధులు చిత్రీకరించారు. 2005లో స్వీడన్ దేశానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు కూడా ఈ పారిశ్రామిక వాడలో పర్యటించారు. ఇక్కడి కాలుష్య తీరును తెలుసుకునేందుకు గాను సుప్రీంకోర్టు న్యాయవాది మెహతా కూడా ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో పర్యటించారు. స్వచ్ఛమైన గాలి కరువే గాలి కూడా పూర్తిగా కలుషితమవుతోంది. గాలిలో విషవాయువులు పేరుకుపోతుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా హైడ్రోజన్ సల్ఫైడ్, క్లోరిన్, మెరికాప్టన్, అన్ని రకాల సల్ఫర్ కాంపౌండులు గాలిలో కలుస్తున్నాయి. దీంతో ప్రజలు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. గాలిలో 21శాతం ఆక్సీజన్ ఉండాల్సి ఉండగా, కాలుష్యం, ఇతర కారణాల వల్ల 20 శాతానికి ఆక్సీజన్ తగ్గిందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కాలుష్యం వల్ల ఓజోన్ పొర కూడా దెబ్బతింటోందంటున్నారు. వర్షాకాలం వస్తే పండుగే : రసాయన పరిశ్రమల యాజమాన్యాలకు వర్షాకాలం వచ్చిందంటే పండగే. రాత్రి సమయంలో ఎలాంటి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను వర్షం నీటితో కలిపి బయటకు వదులుతున్నారు. దీంతో చెరువులు, కుంటలు పూర్తిగా కాలుష్యంగా మారుతాయి. వర్షాకాలంలో వ్యర్థ జలాలను బయటకు రాకుండా ఏర్పాట్లు తీసుకోవటంలో పీసీబీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యటనలకే పరిమితం.. కాలుష్య సమస్య తీవ్రంగా ఉందనే విషయం దృష్టికి రావటంతో మంత్రులు, ఎమ్మెల్యే, ఆయా పార్టీల నాయకులు, విద్యావేత్తలు, పారిశ్రామిక వాడల్లో పర్యటించి వెళ్లటం ఆనవాయితీగా మారింది. చుక్కారామయ్య, కోదండరాం, లాంటి విద్యావేత్తలు కూడా పారిశ్రామిక వాడల్లో పర్యటించారు. పర్యటించిన ఆసమయంలోనే కాలుష్యంపై పోరాటం చేస్తామని చెప్పి వెళ్తారే తప్ప, ఇప్పటి వరకు కాలుష్య నివారణకు ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకున్న పాపానపోలేదు. జబ్బులతో తీవ్రంగా బాధపడుతున్నా 15ఏళ్లుగా కాలుష్య కారణంగా ఆస్తమా, కీళ్ల నొప్పుల వ్యాధితో బాధపడుతున్నా. చిన్న కిరాణం షాపు నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న నేను ప్రతినిత్యం మందులు వాడాల్సిందే. రాత్రి సమయంలో కాలుష్య వాయువులు ఎక్కువైతే శ్వాస పీల్చుకోవటం కష్టమవుతోంది. కాళ్లు ఉబ్బుతాయి. కాలుష్య సమస్యను సత్వరమే పరిష్కరించాలి. - : జగన్మోహన్రావు గడ్డపోతారం కాలుష్యం తగ్గింది : ప్రస్తుతం కాలుష్య సమస్య పారిశ్రామిక వాడల్లో చాలా వరకు తగ్గింది. కాలుష్య జలాలను, వాయు కాలుష్యాన్ని బయటకు వదులుతున్న పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాలుష్య నివారణకు తము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. వర్షాకాలంలో వ్యర్థ జలాలు బయటకు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఓ టీంను కూడా ఏర్పాటు చేశాం. - నరేందర్, పీసీబీ ఈఈ కాలుష్యంపై పోరాటం చేస్తున్నాం : కాలుష్యంపై 2005 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటించకుండా అదనపు ఉత్పత్తులు చేయటం, భారీగా వాయు, జల కాలుష్యాలను బహిరంగా వదలటం లాంటి డిమాండ్లతో తాము పోరాటం చేస్తున్నాం. పారిశ్రామిక వాడల్లో పంటలు నష్టపోయిన రైతులకు, ప్రజలకు కూడా నష్టపరిహారం దక్కటం లేదు. పారిశ్రామిక వాడల్లోని ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలి. ప్రస్తుతం చెన్నైలోని గ్రీన్‌పీస్ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. - చిదంబరం, పర్యావరణ వేత్త -
స్వచ్ఛభారత్ కోసం కృషి చేద్దాం
భారత్ స్వాభిమాన్ కేంద్ర ప్రభారి డా. జయదీప్ ఆర్యా జిన్నారం: స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారత్ స్వాభిమాన్ కేంద్ర ప్రభారి డా. జయదీప్ ఆర్యా పిలుపునిచ్చారు. గురువారం జిన్నారం మండలం అన్నారంలోని ప్రకతి నివాస్‌లో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగా సమితి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశాశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జయదీప్ ఆర్యా మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలని పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో స్వామి రాందేవ్ బాబా ప్రపంచ వ్యాప్తంగా యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. రసాయనాలతో పండిస్తున్న ఆహార ధాన్యాలు, అనారోగ్యాన్ని కల్గిస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో çభారత్ స్వాభిమాన్ రాష్ట్ర అద్యక్షుడు శ్రీధర్‌రావు, మహిళా ప్రభారి మంజుశ్రీ, పతంజలి రాష్ట్ర అధ్యక్షుడు శివుడు, కిసాన్ యువజన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, పటాన్చెరు నియోజకవర్గ ప్రభారి విఠల్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కట్నం కోసం కోడలిని హతమార్చిన అత్త
జిన్నారం (మెదక్) : అదనపు కట్నం వేధింపులకు నవ వధువు బలైన సంఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం దోమడుగులో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(19)కు ప్రభాకర్‌గౌడ్‌తో ఏడాది క్రితం వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో మౌనిక వంట చేస్తున్న సమయంలో అత్త అనసూయ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో మంటల్లో పూర్తిగా కాలిపోయిన మౌనికను నగరంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందింది. ఆమె మృతిచెందడానికి ముందు అత్త అనసూయే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిందని మరణ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
జిన్నారం (మెదక్) : జిన్నారం మండలంలోని చౌక ధరల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. బొంతపల్లి, జిన్నారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లోని రికార్డులను, నిల్వ సరుకులను అధికారులు విద్యాకర్‌రెడ్డి, రమేశ్‌కుమార్, సాజత్మియా పరిశీలించారు. బొంతపల్లిలోని ఓ రేషన్ షాపులో కిరోసిన్ కోటాకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవటంతో సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాలు రుజువైతే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పిచ్చికుక్క దాడిలో 23మందికి గాయాలు
జిన్నారం (మెదక్) : మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామంలో మంగళవారం పిచ్చికుక్క దాడిలో పది మంది చిన్నారులు సహా 23 మంది గాయాల పాలయ్యారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద సంచరించే ఓ కుక్కకు పిచ్చి పట్టింది. దీంతో అది ఉదయం నుంచి కనబడినవారిని వదలకుండా కరిచేసింది. ఇళ్ల వద్ద ఆడుకునే చిన్నారులు, పరిశ్రమల్లో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే కార్మికులను కరిచిపెట్టింది. దాని ధాటికి 23మంది గాయపడ్డారు. వీరిలో 10మంది చిన్నపిల్లలున్నారు. వారందరినీ జిన్నారంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గ్రామస్తులంతా కలసి పిచ్చికుక్కను తరిమికొట్టి చంపేశారు. -
జాతీయ కబడ్డీ పోటీలకు గిరిజన విద్యార్థి
జిన్నారం (మెదక్) : జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రాష్ట్రం తరఫున ఆడేందుకు మెదక్ జిన్నారంలోని గిరిజన బాలుర పాఠశాల విద్యార్థి ఎన్నికయ్యాడు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాథోడ్ ప్రశాంత్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్‌లో జరిగిన కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించాడు. దీంతో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ప్రశాంత్ ఎన్నికయ్యాడు. గతంలో ప్రశాంత్ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు సైతం అర్హతను సాధించిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కూడా ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తాడని పాఠశాల ప్రిన్సిపాల్ వీరప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీఈటీ ప్రేమానందం ఆశాభావం వ్యక్తం చేశారు. -
మెతుకుసీమలో మరో కలికితురాయి
జిన్నారం: మెతుకుసీమ సిగలో మరో కలికితురాయి ప్రకాశించనుంది. మెదక్ జిల్లా జిన్నారం మండలం కొడకంచిలో రూ.100 కోట్లతో డక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమను నిర్మించారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పరిశ్రమను ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొడకంచిలోని 270 సర్వే నంబర్లో సుమారు 14 ఎకరాల స్థలంలో రెండేళ్ల నుంచి డక్కన్ ఆటో యూనిట్ పరిశ్రమను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 200 మంది వరకు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మరో రెండేళ్లలో 2,000 మంది. ఐదేళ్లలో ఆరు వేల మంది వరకు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇతర దేశాల నుంచి బస్సుల తయారీకి సంబంధించిన వస్తువులను దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ బస్సులను సర్వాంగసుందరంగా తయారుచేసి ఎగుమతి చేస్తారు. నెలకు సుమారు మూడు వేల వరకు బస్సులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక పరికరాలను ఈ పరిశ్రమలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే బస్సులను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మరో ఐదేళ్లలో ఇదే ప్రాంతంలో కరోవా బస్సులను తయారు చేసే ప్లాంట్లను కూడా నిర్మించనున్నట్లు పరిశ్రమలవర్గాలు వెల్లడించాయి. అదే విధంగా బస్సులకు ఉపయోగపడే ఇంజన్ల తయారీ ప్లాంట్ల నిర్మాణం కూడా జరగనుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలకు చెందిన డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సులను పూర్తి చేసుకున్న యువతకు ఈ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటైన మొదటి పరిశ్రమ ఇదే కావడం గమనార్హం. కొడకంచి గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ. 3 లక్షల వరకు ఆదాయం ఉంటుందని గ్రామ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమ తమ ప్రాంతంలో ఏర్పాటు కావటం సంతోషంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ రావటం సంతోషంగా ఉంది తమ గ్రామ పరిధిలో పరిశ్రమ ఏర్పాటు కావటం సంతోషంగా ఉంది. స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమ యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమవంతు సహాయ సహకారాలను అందిస్తాం. - గోపమ్మ, సర్పంచ్, కొడకంచి మరిన్ని పరిశ్రమలు వస్తాయి ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయి. కరోవా యూనిట్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఐదేళ్లల్లో సుమారు 6వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. - రాజిరెడ్డి, పరిశ్ర మ ప్రతినిధి -
నీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
హైదరాబాద్: జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్రిగూడ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. ఖాళీబిందెలతో తమ నిరసనని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదన్నారు. రెండేళ్లుగా ఈ సమస్య ఉందని, ప్రతినిత్యం బోరుమోటరు చెడిపోతుండటంతో నీటిసమస్య తలెత్తుతుందన్నారు. మోటారును బాగుచేయించే వారే లేకుండా పోయారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. సత్వరమే గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. -
దూడకు బారసాల
మెదక్ : దూడ పుట్టి 21 రోజులు అయిన సందర్బంగా తొట్టేలో వేసి బారసాల కార్యక్రమానికి నిర్వహించాడు ఓ రైతు. జిన్నారం గ్రామానికి చెందిన మ్యాదరి రమేశ్ అనే రైతు వద్ద గేదెలున్నాయి. ఓ గేదెకు దూడ పుట్టడంతో ఆ రైతు కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. దీంతో 21 రోజుల పండుగను ఆయన ఘనంగా నిర్వహించారు. తొట్టెలను పువ్వులతో ముస్తాబు చేసి... దూడను పడుకోబెట్టి బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం కుటుంబసభ్యులు, స్నేహితులు సంబరాలను జరుపుకున్నారు. దూడకు ఐశ్వర్య అనే నామకరణం చేశారు. -
కొత్త పరిశ్రమలు వచ్చేనా?
జిన్నారం: పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ కొత్త విధానాలు రూపొందించడంతో జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి. వ్యవసాయ, వాణిజ్య రంగాలతో పాటు పరిశ్రమలకు కూడా పెద్దపీట వేస్తామంటూ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటుపై సింగిల్ విండో పథకాన్ని చూపొందించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ పథకంతో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ పారిశ్రామిక విధానంపై నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పాలసీపై పారిశ్రామిక వేత్తల నుంచి కొంత సానుకూలత, వ్యతిరేకతలు వస్తున్నాయి. ప్రోత్సాహాలన్నీ కొత్తగా పరిశ్రమలు స్థాపించబోయే వారికేనా అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను కాపాడేందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. మరి మా పరిస్థితి ఏమిటి? నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో 5 వేల ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఇందుకు సంబంధించి పనులను కూడా రెవెన్యూ అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారికి సింగిల్ విండో విధానాన్ని వర్తింపజేయటం పట్ల కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం ఈ పథకంపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. నూతన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, ఉన్న పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలంటున్నారు. అవుటర్ రింగు రోడ్డులోపల ఉన్న పరిశ్రమలను బయటకు పంపేందుకు ప్రభుత్వం నుంచి వత్తిడిలు వస్తున్నాయని, అదే జరిగితే తమకు ఎలాంటి సాయం అందిస్తారో సర్కార్ తన నూతన పాలసీలో తెలపలేదని పలువురు పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికి మాత్రమే ప్రోత్సహాకాలను అందిస్తే, తమ పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నా, నూతన పరిశ్రమల స్థాపన జరుగుతుందో లేదోననే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగింల్ విండో పాలసీ బాగున్నప్పటికీ ఇది కేవలం నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకేనా ? ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అనుమతులు కావాలంటే ఏంచేయాలనే దానిపై స్పష్టత లేదని, పరిశ్రమలను కేటగిరీలుగా విభజించే విషయంపై కూడా స్పష్టత లేదనినే అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫార్మా, స్టీల్, ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. వీటిని కేటగిరీల వారిగా విభజించే విషయంపై ప్రభుత్వం తగిన స్పష్టతను ఇవాల్సి ఉందని యాజమన్యాలు చెబుతున్నాయి. రెడ్, గ్రీన్, ఆరెంజ్ కేటగిరీలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఏదిఏమైనా సర్కార్ పారిశ్రామిక విధానంపై పారిశ్రామిక వేత్తలకు పలు అనుమానాలున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
పరిశ్రమలకు తాళం.. బతుకు ఆగం
జిన్నారం: కరెంటు కోతలు...అంచనా మేరకు కాని ఉత్పత్తి...అర్డర్లూ అంతంతమాత్రం..దీంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. రోజుకో ఫ్యాక్టరీ మూతపడుతుంటే మెతుకుసీమకే తలమానికంగా ఉన్న పారిశ్రామిక వాడలన్నీ వెలవెలబోతున్నాయి. ఏడాది క్రితం లాభాల్లో ఉన్న పరిశ్రమలు కూడా ఇపుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యాలు గేట్లు మూసేస్తుండడంతో కార్మికులు వీధిన పడుతున్నారు. బహుళ సంస్థలకు చెందిన పరిశ్రమలు నడుస్తున్నా, చిన్న పరిశ్రమలు మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 50 వేల మంది భవిష్యత్ అగమ్యగోచరం జిన్నారం మండలంలోని బొంతపల్లి, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం గ్రామాల్లో సుమారు 200పైగా వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు జీవనోపాధిని పొందుతున్నారు. రాష్ట్రం విడిపోవడం...కరెంటు కోతల ప్రభావం పరిశ్రమలపై భారీ చూపుతోంది. కరెంటు కోతల నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం...నిర్ణీత సమయానికి డెలివరీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా ఇపుడు రద్దయ్యాయి. దీంతో చిన్నా, చితక కంపెనీలన్నీ ఇప్పటికే మూతపడ్డాయి. చాలా కంపెనీలు తాత్కాలికంగా గేట్లు మూసేశాయి. మరికొన్ని నడుస్తున్నా కార్మికులకు పూర్తిస్థాయిలో పని దొరకడం లేదు. ఒక్క జిన్నారం మండలంలో సుమారు 50 వరకు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. మరో 30 వరకు పరిశ్రమలు తాత్కాలికంగా ఉత్పత్తులను నిలిపివేశాయంటే పరిశ్రమల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డునపడ్డ జీవితాలు పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో వాటిల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిశ్రమలు మూతపడడంతో జిన్నారం మండలంలోనే సుమారు 15 వేల మంది కార్మికులు వీధిన పడాల్సి వచ్చింది. దీంతో వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కార్మికులకు ప్రస్తుతం పనులు లేకపోవటంతో ఉపాధి కో సం రోడ్ల వెంట తిరుగుతున్నారు. నడుస్తున్న కొన్ని పరిశ్రమలు కూడా స్థానికులకు ఉపాధిని కల్పించటం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బడుగు జీవులు అల్లాడిపోతున్నారు. స్టీల్ పరిశ్రమలకూ గడ్డుకాలం జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు 30 వరకు స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నడిపేందుకు ఎక్కువ మొత్తంలో విద్యుత్ అవసరం. ప్రస్తుతం తీవ్రమైన కరెంటు సమస్య వల్ల స్టీల్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలు మూతకు గల కారణాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ రావటంతో ఇక్కడి ఉత్పత్తులను అక్కడికి సరఫరా చేయలేకపోవటం. రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఎగుమతులు, దిగుమతుల్లో అదనపు పన్నుల భారం. పెద్ద పరిశ్రమలు చిన్న పరిశ్రమలకు తగిన ఆర్డర్లు ఇవ్వక పోవటం. కష్టపడి పరిశ్రమను నడిపినా లాభాలు లేకపోవటం. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
జిన్నారం: మండలంలోని బొంతపల్లి గ్రామంలో గల యాక్సెక్ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని డబ్బును చోరీ చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దుండగులు ఏటీఎంకు సంబంధించిన స్క్రీన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఏటీఎం స్క్రీన్ కింది భాగంలో ఉన్న డబ్బాను సైతం ధ్వసం చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ డబ్బు తీసుకునే మార్గం కనిపించక అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం ఏటీఎంకు వచ్చిన కొంత మంది స్థానికులు మిషన్ పగలి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో జిన్నారం ఎస్ఐ జయప్రకాశ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బ్యాంక్ సిబ్బందితో పాటు, ఏటీఎం నిర్వహకులు కూడా ధ్వంసమైన ఏటీఎం మిషన్‌ను పరిశీలించారు. ఏటీఎం మిషన్‌లో ఉన్న డబ్బు మాత్రం చోరీ కాలేదని బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. ఏటీఎం నిర్వహకులు రవికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జయప్రకాశ్ తెలిపారు. -
వృథాగా డంప్‌యార్డు ఏడేళ్లుగా నిరుపయోగం
జిన్నారం : మండలంలోని ఊట్ల గ్రామ శివారులో ఏడేళ్ల క్రితం డంప్‌యార్డును నిర్మించారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి దాని నుంచి వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేయాలన్నది లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 2 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ డంప్‌యార్డును అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు డంప్‌యార్డు వినియోగంలో లేదు. కేవలం రెండు నెలలు మాత్రమే చెత్తను సేకరించారే తప్ప, ఎరువును సైతం తయారు చేయలేకపోయారు అధికారులు. జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణలో డంప్‌యార్డును నిర్వహించాలని అప్పటి కలెక్టర్ సూచించారు. అయినా ఈ డంప్‌యార్డు మాత్రం వినియోగంలోకి రావటంలేదు. డంప్‌యార్డులో విలువైన వాహనాలు, భారీ యంత్రాలు, వర్మీకంపోస్టు షెడ్డులను నూతన సాంకేతిక పరిజ్ఙానంతో ఏర్పాటు చేశారు. చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లు, ట్రాలీ సైకిళ్లు, చెత్త డబ్బాలను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో జనరేటర్, వే బ్రిడ్జ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఏడేళ్లుగా ఇవి వినియోగంలో లేకపోవడంతో అవికాస్తా ఎందుకు పనికి రాకుండా పోయాయి. వాహనాలు తుప్పుపట్టాయి. గుర్తుతెలియని వ్యక్తులు డంప్‌యార్డులో ఉన్న వస్తువులను అపహరించుకుపోతున్నారు. విలువైన భవనాలు బీటలు వారుతున్నాయి. డంప్‌యార్డు వద్ద వాచ్‌మెన్‌ను నియమించినా అతనికి తగిన వేతనం ఇవ్వకపోవడంతో అతను విధుల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాలు అధికారులకు తెలిసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి కలెక్టర్ దినకర్‌బాబు స్వయంగా డంప్‌యార్డును సందర్శించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. గ్రామ శివారులో డంప్‌యార్డు ఏర్పాటు వల్ల స్థానికంగా తమకు ఉద్యోగాలు వస్తాయని యువకులు భావించారు. డంప్‌యార్డు ఏర్పాటు వల్ల ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తుండడం వల్ల గ్రామాలు సైతం శుభ్రంగా ఉంటాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాని ప్రజలు, యువకుల ఆశలు నెరవేరడం లేదు. గత ప్రభుత్వాలు ఈ డంప్యార్డుని తిరిగి వినియోగంలోకి తీసుకురావటంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలోనైనా డంప్‌యార్డు వినియోగంలోకి వస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెత్తను తొలగించి గ్రామాలు శుభ్రంగా ఉండడంతో పాటు, సేకరించిన చెత్త నుంచి రైతులకు ఉపయోగపడే వర్మికంపోస్టు ఎరువును తయారు చేయాలనే ప్రభుత్వం లక్ష్యం నీరుగారిపోయింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంప్‌యార్డును వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
దళిత సీఎం హామీ ఏమైంది?
జిన్నారం : తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన హామీ ఏమైందని, అరచేతిలో స్వర్గం చూపించే కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మవద్దని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. మండలంలోని బొల్లారం గ్రామంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డికి మద్దతుగా శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి పొన్నాలతో పాటు మండలి విపక్ష నేత డీ శ్రీనివాస్‌లు హాజరయ్యారు. గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డితో పాటు గ్రామ యువకులు పొన్నాల సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో పొన్నాల మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మూడేళ్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తానని కేసీఆర్ తప్పుడు ప్రచారం చే స్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. డీ శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. కేవలం సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ప్రజలను మాటల గారడీతో మభ ్యపెడుతున్న కేసీఆర్‌కు బుద్ధి రావాలంటే ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సునితారెడ్డి మాట్లాడుతూ ఓటర్లు తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, పార్టీ రాష్ర్ట మహిళా అధ్యక్షురాలు లలిత, జెడ్పీటీసీ సభ్యుడు బాల్‌రెడ్డి, నాయకులు సురభి నాగేందర్‌గౌడ్, నిర్మల, మద్ది వీరారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్‌కు వేళాయె..బస్సు రాదాయె..
జిన్నారం : బస్సుల కోసం విద్యార్థులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. సమయానికి బస్సులు రాక.. పాఠశాలలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేక నడక ద్వారానే స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆలస్యంగా చేరుకోవడంతో కొన్ని తరగతులకు హాజరుకాలేకపోతున్నారు. అయినా పాల కులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ప్రతి మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నా, ఇప్పటివ రకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. గత ప్రభుత్వాలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపటంలో పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యంలేని గ్రామాలు ఉన్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిన్నారం మండలంలోని కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించటంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఏం చేయాలో తోచక ప్రజలు, విద్యార్థులు నడక ద్వారా వారి పనులను కొనసాగిస్తున్నారు. జిన్నారం నుంచి అండూర్ వరకు బస్సు సౌకర్యం లేదు. కొత్తపల్లి, నల్లవల్లి గ్రామాలకూ బస్సు సౌకర్యం సరిగా లేదు. జిన్నారం-బొల్లారం గ్రామాల మధ్య కొన్ని ఏళ్లుగా బస్సు సౌకర్యం లేకపోవడం గమనార్హం. రామిరెడ్డిబావి, కానుకుంట తదితర గ్రామాలకు పాఠశాల వేళల్లో బస్సు సౌకర్యం లేదు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనువుగా సరైన సమయంలో బస్సు సౌకర్యం లేదు. దీంతో కొందరు సొంత వాహనాలను, మరికొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉదయం వేళలో సరిపడా బస్సులు గ్రామాలకు రాకపోవటంతో విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఇదిలాఉండగా.. విద్యార్థులకు తగిన పాసులు ఉండటంతో వారిని ఎక్కించుకునేందుకు బస్సు డ్రైవర్లు ఆసక్తి చూపటం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్లుగా గ్రామాల్లో ఈ పరిస్థితులు ఉన్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. తండాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. గత పాలకులు నామమాత్రంగా నూతన బస్సులను వేయించి చేతులు దులుపుకున్నారు. సరైన బస్సు సౌకర్యాలను కల్పించాలని ప్రతినిత్యం విద్యార్థులు, ఉద్యోగులు రోడ్లపై బైఠాయిస్తున్నారు. ప్రస్తుత పాలనలోనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. -
ఉద్యోగం కోసం నకిలీ నోటిఫికేషన్
జిన్నారం: వాయుసేన అకాడమీకి సంబంధించిన నకిలీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను సృష్టించిన ఓ యువకుడు దానిని అధికారులకు చూపించి.. తనను ఇంటర్వ్యూ చేయాలని హల్చల్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ పాలవెల్లి కథనం మేరకు.. బీహార్ రాష్ట్రం మధుబణి తాలూక లక్నూరం గ్రామానికి చెందిన వినమ్రకుమార్ ఝా జైపూర్‌లో బీటెక్ పూర్తిచేశాడు. వాయుసేన అకాడమీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పాత నోటిఫికేషన్‌ను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం సంబంధిత అధికారులే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా నకిలీది సృష్టించాడు. దాన్ని పట్టుకొని మెదక్ జిల్లా జిన్నారం సమీపంలోని వాయుసేన అకాడమీకి వచ్చాడు. ‘మీరు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన ఉద్యోగానికి నేను అర్హుడిని, నన్ను ఇంటర్వ్యూ చేయండి’ అని ఎయిర్‌ఫోర్స్ అధికారులను వినమ్రకుమార్ కోరాడు. అయితే తాము వాయుసేన విభాగంలో ఎటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయలేదని అధికారులు అతడికి తెలిపారు. అనంతరం ఝా తాను సృష్టించిన నకిలీ పత్రాలను అధికారులకు అందజేశాడు. పరిశీలించి అధికారులు అది నకిలీ నోటిఫికేషన్ అని గుర్తించి ఝూను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌ఫోర్స్ సెక్యూరిటీ అధికారి బాజ్‌పేయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
ప్రతి పంచాయతీలో మొక్కలు నాటుతాం
జిన్నారం : జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 33వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని డీఎఫ్ఓ సోనిబాలాదేవీ పేర్కొన్నారు. ఆదివారం జిన్నారం మండలం బొంతపల్లి గ్రామ పంచాయలీ కార్యాలయంలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్ని వేల మొక్కలు నాటాలి, ఎలాంటి మొక్కలు కావాలనే విషయాన్ని సోనిబాలాదేవీ స్వయంగా రైతులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నర్సరీ ఏర్పాటు చేసేందుకు స్థల పరీశీలన చేశారు. ఈ సందర్భంగా సోనిబాలాదేవీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 33వేల మొక్కలను నాటడమే ల క్ష్యం ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకోసం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, మొక్కలకు సంబంధించిన వివరాలను సేకరించే కార్యక్రమాన్ని వేగంగా చేపడుతున్నామన్నారు. మూడు, నాలుగు గ్రామాలకు కలిపి నర్సరీని ఏర్పాటు చేసి, మొక్కలను గ్రామాలకు సరఫరా చేసే ప్రక్రియను చేపట్టనున్నామన్నారు. గ్రామంలోని నాయకులు, ప్రజలు, అధికారుల సహకారంతో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. మొక్కలను నాటే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే విషయలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రైతులు సైతం భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే వారికి మొదటిప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గౌరీశంకర్‌గౌడ్, నాయకులు వేణు, మల్లేశ్, వినోద్, గోపాల్, శంకర్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
జిన్నారం మండలంలో జెడ్పీటీసీ పోరు రసవత్తరం
జిన్నారం, న్యూస్‌లైన్: ఎట్టకేలకు జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. దీంతో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. సోమవారం రాత్రి నుంచే అభ్యర్థులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఫారాలు చేతికి అందిన వెంటనే అభ్యర్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కాంగ్రెస్ జెడ్పీటీసీ బీఫారం ఎవరికి లభిస్తుందనే విషయం సోమవారం మధ్యాహ్నం 12గంటల వరకు ఎవరికి తెలియదు. శివానగర్ మాజీ సర్పంచ్ ప్రభాకర్, సోలక్పల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే చివరి వరకు ఎవరికి బీఫారం లభిస్తుందనే ఉత్కంఠ కాంగ్రెస్ నాయకులతో పాటు, ఇతర పార్టీ నాయకుల్లో కూడా నెలకొంది. ఎట్టకేలకు కాంగ్రెస్ తరఫున ప్రభాకర్‌ను ఎంపిక చేస్తూ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ బీఫారం అందించారు. అదే విధంగా టీడీపీ తరఫును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున అండూర్ గ్రామానికి చెందిన, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ తరఫున జిన్నారం మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్ పోటీలో ఉన్నారు. బీఎస్పీ తరఫున జిన్నారం మాజీ ఎంపీటీసీ సభ్యుడు పుట్టిభాస్కర్ రంగంలో ఉన్నారు. దోమడుగు మాజీ సర్పంచ్ బాల్‌రెడ్డి సీపీఐ తరఫున పోటీలో ఉన్నారు. ఏదిఎలా ఉన్నా జిన్నారం మండలంలో రసవత్తర పోరు జరగనుంది. ప్రస్తుతం మండల వ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలకు గ్రామాల్లో క్యాడర్ బాగానే ఉంది. ఇక రానున్న రోజుల్లో ఓటర్లు ఎవరిని జెడ్పీటీసీగా నిలబెడతారో వేచి చూడాలి. -
పరిశ్రమల్లో భద్రతేదీ?
జిన్నారం, న్యూస్‌లైన్: పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కొరవడింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అటు యాజమాన్యాలు.. ఇటు సంబంధిత అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లే ప్రధాన భూమిక. ఎలాంటి రసాయన పదార్థాన్ని అయినా ఇందులో ప్రాసెస్ చేయాల్సిందే. ఇలాంటి ప్రధానమైన యంత్రాన్ని వినియోగించడంలో, కాపాడుకోవడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. రియాక్టర్ల వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సైతం రక్షణ పరికరాలను యాజమాన్యాలు సమకూర్చడం లేదు. ఫలితంగా అవి పేలినప్పుడు కార్మికులు బలి అవుతున్నారు. జిన్నారం మండలం బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతాల్లో రెండు వందలకుపైగా భారీ, మధ్య, చిన్నతరహా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రియాక్టర్ పేలుడు వంటి ప్రమాదాల వల్ల కార్మికులు సైతం మృత్యువాత పడుతున్నారు. తయారు చేసిన రసాయన పదార్థాన్ని రియాక్టర్లో వేసి ప్రాసెస్ చేయడమే పరిశ్రమల్లో ప్రధాన ఘట్టం. ఈ సమయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రియాక్టర్లను ప్రతి రెండేళ్లకోసారి శుభ్రపరుచుకోవాలి. అప్పుడే అవి బాగా పనిచేస్తాయి. రియాక్టర్లను శుభ్రం చేసే ఈ ప్రక్రియకు తగిన డబ్బు అవసరం అవుతుంది. ఖర్చును నివారించుకునేందుకు యాజ మాన్యాలు రియాక్టర్లను పట్టించుకోకుండా వదిలేస్తున్నట్టు తెలుస్తోంది. గ త రెండేళ్లలో మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడల్లో ఐదు రియాక్టర్లు పేలాయి. రియాక్టర్లు పేలే క్రమంలో పలు అగ్నిప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బొల్లారం పారిశ్రామిక వాడలోని ప్రగతి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలగా ఇద్దరు గాయపడ్డారు. తరచూ ప్రమాదాలు జరగడం, అధికారులు కేసులు నమోదు చేయడం షరామామూలుగానే మారింది. ఎన్ని సంఘటనలు జరిగినా వాటిని పూర్తి స్థాయిలో నివారించడంలో అధికారులు, యాజమాన్యాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. నివారణకు చర్యలు.. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడుతున్నాం. తరచూ పరిశ్రమలను సందర్శిస్తున్నాం. రక్షణ విషయంలో యాజమాన్యాలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తప్పవు. - గంగాధర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ -
రోడ్డుపాలైన మూడు రోజుల శిశువు
జిన్నారం, న్యూస్‌లైన్: బొడ్డు ఊడక ముందే ఓ పసిగుడ్డు తల్లిదండ్రులు రోడ్డు పాల్జేశారు. గల్లీలో శిశువు ఏడుపులు విన్న చుట్టు పక్కల ప్రజలే పాలు పట్టించి చేరదీశారు. ఈ సంఘటన మండలంలోని బొల్లారం గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బొల్లారం గ్రామంలో గల ఎస్సీ బస్తీలోని ఓ గల్లీలో గురువారం అర ్ధరాత్రి శిశువు ఏడుపులు వినిపించడంతో కాలనీకి చెందిన అనసూయ అక్కున చేర్చుకుని పాలు పట్టింది. విషయాన్ని కాలనీ వాసులు శుక్రవారం ఉదయం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాల్రెడ్డికి తెచ్చారు. ఆయన ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయలక్ష్మి, స్రవంతిలు కాలనీకి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును వదిలేసినట్లు వారు అంచనాకు వచ్చారు. అనంతరం కాలనీ వాసులు ఐసీడీఎస్ అధికారులకు పోలీసుల సమక్షంలో శిశువును అందించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు మాట్లాడుతూ సుమారు మూడు రోజుల వయస్సున్న మగశిశువును సంగారెడ్డిలోని శిశుగృహకు ఈ శిశువును తరలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై విచారణను జరుపుతున్నట్లు వెల్లడించారు. -
ఐదేళ్ల బాలికపై లైంగికదాడి
జిన్నారం, నూస్లైన్: మండలంలోని గడ్డపోతారానికి చెందిన ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బొల్లారం ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన బాలిక మంగళవారం రాత్రి టీవీ చూసేందుకు పొరుగింటికి వెళ్లింది. ఆ ఇంట్లో ఓ వృద్ధుడు మాత్రమే ఉన్నాడు. అదే సమయంలో మరో పొరుగింటిలో ఉంటున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్ శివరాత్రి నరేష్(19) కూడా టీవీ చూసేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను ఇంటి పక్కనే ఉన్న ఓ రేకుల షెడ్డులోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే చిన్నారి ఏడుస్తుండటంతో చుట్టుపక్కల వారు, తల్లిదండ్రులు వచ్చి ఆరా తీశారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పింది. విషయాన్ని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రాపురం సీఐ శ్రీనివాస్ సందర్శించారు. నిందితుడు నరేష్ తమ అదుపులో ఉన్నాడని, ఇతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
హెలెన్ దెబ్బకురైతు విలవిల
జిన్నారం: ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో మండలంలోని పలు ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. వరి గింజలు చేలులోనే పడిపోతున్నాయి. ఆరు నెలలుగా కష్టపడి సాగు చేసుకున్న రైతులు తుపాన్ కారనంగా వర్షాలు కురుస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిన్నారం, గుమ్మడిదల, అనంతారం, వావిలాల, సోలక్పల్లి తదితర గ్రామాల్లో చేతికి వచ్చిన వరి పంట నేలవాలింది. దీంతో రైతులు కంట నీరుపెడుతున్నారు. తుక్కాపూర్‌లో నీటిపాలు తొగుట: మండలంలోని తుక్కాపూర్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం వర్షార్పణమైంది. మార్కెట్లో డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడంతో వర్షం నీరు అక్కడే నిలవడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కంటతడిపెట్టారు. మార్కెట్లో పాసైన ధాన్యం కుప్పలు, పాసవ్వడానికి సిద్ధంగా ఉన్న కుప్పలు సుమారు 5 వేల బస్తాలుండగా శనివారం నాటి వర్షానికి తడిసిపోయింది. కొంత ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్లో కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడం వల్లే ధాన్యం నీటిపాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బస్తాలను తూకం వేసినా అధికారుల నిర్లక్ష్యంతో లారీల కొరత కారణంగా లోడింగ్ కాకపోవడంతో బయట ఉన్న బస్తాలు సైతం వర్షానికి తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. కొనుగోలు చేయకనే.. చిన్నకోడూరు: మండలంలోని జక్కాపూర్, చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్, రామంచ, అల్లీపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు తడిసిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేయడానికి కొనుగోలు కేంద్రాల్లో గోదాములు, కవర్లు, తదితర సౌకర్యాలు లేకపోవడంతో వర్షానికి తడిసినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తెచ్చి రెండు, మూడు రోజులు గడిచినా నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.తడిసిన ధాన్యాన్ని వెంటనే కోనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలకు ఆయా గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. -
బంగారం కోసమే స్నేహితుడి హత్య
జిన్నారం/పటాన్చెరు టౌన్ న్యూస్‌లైన్ : ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరం కోసం తోటి స్నేహితుడి తలపై రాయితో మోది పాశవికంగా హత్య చేశాడో మిత్రుడు. మెదక్ జిల్లా జిన్నా రం మండలం బొల్లారం శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన గల దేవతలగుట్ట వద్ద జరిగిన హత్య కేసు మిస్టరీని పటన్‌చెరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వారి కథనం మే రకు.. పటాన్‌చెరులోని శాంతినగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్న మల్లేశం.. అమీన్పూర్ వీఆర్ఓగా పనిచేస్తున్నారు. మల్లేష్‌కు రెండో సంతానమైన అనిల్‌కుమార్ ఇం టర్లో ఓ సబ్జెక్టు తప్పి ఇంట్లోనే ఉంటున్నాడు. పటాన్చెరు మండలం ఇంద్రే శం గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్ పటాన్చెరు ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. ఇదిలా ఉండగా అనిల్, నరేందర్‌లు ఇ రువురూ స్నేహితులు. ఈ క్రమంలో వీరి ద్దరూ ఈ నెల 6న జిన్నారం మండలం బొల్లారం శివారులోని దేవతలగుట్ట వద్ద మద్యం సేవించారు. అయితే తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, ఎలాగైనా డబ్బును సర్దాలని నరేందర్‌గౌడ్ మిత్రుడైన అనిల్‌కుమార్‌ను కోరా డు. అయితే తన వద్ద డబ్బు లేదని స మాధానం ఇవ్వగా మెడలో ఉన్న గొలుసు, చేతికి ఉన్న ఉంగరాన్ని ఇవ్వాల ని నరేందర్ కోరాడు. ఇందుకు అనిల్‌కుమార్ నిరాకరించాడు. దీంతో స్నేహితుడి తీరును ఆగ్రహిస్తూ నరేందర్ వాదనకు దిగాడు. అంతలోనే పక్కనే ఉన్న రాయితో అనిల్‌కుమార్ తలపై మోదా డు నరేందర్‌గౌడ్. అనంతరం అతడి మె డలో ఉన్న గొలుసు, చేతికున్న ఉంగరా న్ని తీసుకుని అనిల్‌కుమార్ మృతదేహా న్ని రాళ్ల మధ్యలో పడేసి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 7న అని ల్‌కుమార్ కనిపించటం లేదని అతని సోదరుడు పటాన్చెరు పీఎస్‌లో ఫిర్యా దు చేశాడు. ఈ విషయమై అనిల్‌కుమార్ సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగాా వివరాలను పోలీసులు సేకరించారు. అనుమానంతో నరేందర్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెల్లైడె ంది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. ఐదు రోజుల క్రితమే అనిల్‌ను హత్య చేయడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో హత్య జరిగిన స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రాపురం డీఎస్పీ మధుసూధన్‌రెడ్డి, పటాన్చెరు సీఐ శంకర్‌రెడ్డి, బొల్లారం ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి సందర్శించారు. -
అతివేగమే ప్రాణం తీసింది
జిన్నారం, న్యూస్‌లైన్ : అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి కిందపడిన సంఘటనలో బీటెక్ విద్యార్థిని అక్షితరెడ్డి(18) దుర్మరణం చెందగా మరో విద్యార్థి ప్రణ య్ గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని నల్లవల్లి గ్రామ శివారులో గల నర్సాపూర్-హైదరాబాద్ ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు, స్థానికుల కథనం మేరకు.. భానూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూ డో సంవత్సరం చదువుతున్నాడు. హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామానికి చెందిన రాగన్లగారి అక్షితరెడ్డి సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ క ళాశాలలో బీటెక్ మొద టి సంవత్సరం చదువుతోంది. వీరిరువురూ స్నేహితులు. ఇదిలా ఉండగా.. ప్రణయ్‌కి సెలవులు కావడం తో స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం స్నేహితురాలైన అక్షితరెడ్డితో కలిసి బుధవారం హైదరాబాద్‌లోని మరో స్నేహితురాలిని కలిసేందుకు సంగారెడ్డి నుంచి పల్సర్ బైక్‌పై బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నల్లవల్లి శివారులోని మూల మలుపు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ప్రణయ్ బైక్‌ను అతివేగంగా నడుపుతుండడంతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అడవిలోకి దూసుకుపోయాడు. ఈ క్రమంలో బైక్‌పై కూర్చున్న అక్షిత ఎగిరి పక్కనే ఉన్న సిమెంట్ పైప్‌లపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృ తి చెందింది. ప్రణయ్ తలకు, కాలికి కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. తాము సం ఘటనా స్థలాన్ని చేరుకుని అక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించాం. మృతురాలి తండ్రి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రణయ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ రాంబాబు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు హత్నూర: బీటెక్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం కావడంతో మండలం గుండ్లమాచునూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన రాజన్నగారి వెంకరెడ్డి ఏకైక కుమార్తె అక్షితరెడ్డి. బుధవారం కళాశాలకు వెళ్లిన అక్షిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులతో పాటు గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉన్నత చదువులు చదివి మంచి ప్రయోజకురాలు అవుతుందనుకుంటే ఇలా విగతజీవిలా వచ్చావా తల్లీ అంటూ తల్లిదండ్రుల రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. విద్యార్థి మృత దేహాన్ని కన్నీటితో అంతిమ సంస్కరణలు చేశారు. -
కల్లు, చాయ్ తాగితే చెప్పు దెబ్బలే..
జిన్నారం, న్యూస్‌లైన్: పెంచిన కల్లు, చాయ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిన్నారం వాసులు కొందరు శనివారం వినూత్న నిరసనకు దిగారు. ధరలు తగ్గించే వరకు ఎవరూ కల్లు, చాయ్ తొగొద్దనే నిబంధన విధించారు. శుక్రవారం సమావేశమై తీర్మానించిన వీరు శనివారం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవేళ ఎవరైన తాగితే 25 చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు వారు కల్లు దుకాణానికి వెళ్లే దారిలో చెప్పులను వేలాడదీశారు. వివరాలు ఇలా... మండల కేంద్రమైన జిన్నారంలో కల్లు సీసా ధరను రూపాయి పెంచారు. ఇదివరకు సీసా ధర రూ.5 ఉండగా దుకాణం నిర్వాహకులు వారం రోజుల క్రితం రూపాయి పెంచారు. విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు రూపాయి పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం నుంచి గ్రామంలోని కల్లు దుకాణంలో ఎవరూ కల్లు తాగవద్దని ప్రకటించారు. తమ నిబంధనను కాదని ఎవరైన కల్లు తాగితే 25 చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. అంతేగాక కల్లు దుకాణానికి వెళ్లే దారిలో చెప్పులను వేలాడదీశారు. కల్లు ధర తగ్గే వరకు ఇది వర్తిస్తుందని వారు తెలిపారు. చాయ్ ధర పెంపుపైనా.. ఇదిలావుంటే జిన్నారంలోని పలు హోటళ్లలో చాయ్ ధరను నెల రోజుల క్రితం పెంచారు. దీనిపై కూడా స్థానికులు కొందరు అభ్యంతరం తెలిపారు. కప్పు టీ ధర ఇదివరకు మూడు రూపాయలు ఉండగా ఏకంగా మూడు రూపాయలు పెంచారు. ఆరు రూపాయలు పెట్టి కప్పు చాయ్ తాగడం భారమని వారంటున్నారు. పెంచిన చాయ్ ధరను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు హోటళ్లలో ఎవరు కూడా చాయ్ తాగరాదని వారు హుకుం జారీ చేశారు. తమ మాటను ఖాతరు చేయకపోతే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. ధరను తగ్గించే వరకు హోటళ్లలో చాయ్ చేయవద్దని, ఒకవేళ చేస్తే జరిమానా విధిస్తామన్నారు. వారి హెచ్చరికల నేపథ్యంలో శనివారం గ్రామంలో చాయ్ దొరక్క కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై కల్లు దుకాణం, చాయ్ హోటల్ యజమానులను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తాము కూడా ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. ధరలను పెంచకపోతే తాము నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వారు కోరారు. -
పునర్విభజన ముసాయిదా ప్రకటన : కొత్తగా 59 ఎంపీటీసీ
జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఎంపీటీసీ పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం బుధవారం ముసాయిదా జాబితాను ప్రకటించింది. ముసాయిదా జాబితాను అనుసరించి జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ముసాయిదా జాబితాపై మండలాల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తయి అనంతరం ఈనెల 27న తుది జాబితాను వెలువరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పునర్విభజనతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 687కి పెరిగింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మండల పరిషత్ అధికారులు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. గత ఎంపీటీసీ ఎన్నికల ప్రకారం జిల్లాలో 664 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. అయితే ఇటీవల ప్రభుత్వం జిల్లాలో కొత్తగా చేగుంట, దుబ్బాక, గజ్వేల్, అందోలు నగర పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో 664 ఎంపీటీసీ స్థానాల నుంచి 36 ఎంపీటీసీ స్థానాలను అధికారులు తొలగించారు. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 628కు చేరుకుంది. తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టిన ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జిల్లాలో మొత్తంగా ఎంపీటీసీ స్థానాల సంఖ్య 687కు చేరుకోనుంది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ముసాయిదా జాబితాకు బుధవారం కలెక్టర్ ఆమోదముద్రవేశారు. దీంతో ఈనెల 21వ తేదీ వరకు మండల స్థాయిలో ఎంపీటీసీల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి, 27వ తేదీన తుది జాబితాను వెలువరిస్తారు. జిన్నారంలో కొత్తగా 7 ఎంపీటీసీ స్థానాలు ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో జిల్లాలో అత్యధికంగా జిన్నారం మండలంలో ఏడు కొత్త ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు అవుతున్నాయి. ఆ తర్వాత పటాన్చెరు మండలంలో కొత్తగా ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఆయా మండలాల్లో జనాభా శాతం పెరగటంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనను పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో అత్యధికంగా జహీరాబాద్‌లో 28 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అత్యల్పంగా రామచంద్రాపురం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. పార్టీలు, ఆశావహులకు తీపికబురు జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానుండటంపై రాజకీయపార్టీలతోపాటు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు కూడా సంతోషంగా ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలు పెరుగుతుండటంతో రాజకీయపార్టీలు మరికొంత మంది నాయకులను ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు ఇచ్చి వారిని సంతోషపరిచే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే వారు సైతం ఎంపీటీసీ స్థానాలు పెరగటంతో స్థానిక బరిలో నిలిచేందుకు అవకాశం ఏర్పడింది.