జిన్నారం, న్యూస్‌లైన్: పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కొరవడింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అటు యాజమాన్యాలు.. ఇటు సంబంధిత అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లే ప్రధాన భూమిక. ఎలాంటి రసాయన పదార్థాన్ని అయినా ఇందులో ప్రాసెస్ చేయాల్సిందే. ఇలాంటి ప్రధానమైన యంత్రాన్ని వినియోగించడంలో, కాపాడుకోవడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
రియాక్టర్ల వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సైతం రక్షణ పరికరాలను యాజమాన్యాలు సమకూర్చడం లేదు. ఫలితంగా అవి పేలినప్పుడు కార్మికులు బలి అవుతున్నారు.
జిన్నారం మండలం బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతాల్లో రెండు వందలకుపైగా భారీ, మధ్య, చిన్నతరహా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రియాక్టర్ పేలుడు వంటి ప్రమాదాల వల్ల కార్మికులు సైతం మృత్యువాత పడుతున్నారు. తయారు చేసిన రసాయన పదార్థాన్ని రియాక్టర్‌లో వేసి ప్రాసెస్ చేయడమే పరిశ్రమల్లో ప్రధాన ఘట్టం. ఈ సమయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
రియాక్టర్లను ప్రతి రెండేళ్లకోసారి శుభ్రపరుచుకోవాలి. అప్పుడే అవి బాగా పనిచేస్తాయి. రియాక్టర్లను శుభ్రం చేసే ఈ ప్రక్రియకు తగిన డబ్బు అవసరం అవుతుంది. ఖర్చును నివారించుకునేందుకు యాజ మాన్యాలు రియాక్టర్లను పట్టించుకోకుండా వదిలేస్తున్నట్టు తెలుస్తోంది. గ త రెండేళ్లలో మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడల్లో ఐదు రియాక్టర్లు పేలాయి. రియాక్టర్లు పేలే క్రమంలో పలు అగ్నిప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది.
తాజాగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బొల్లారం పారిశ్రామిక వాడలోని ప్రగతి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలగా ఇద్దరు గాయపడ్డారు. తరచూ ప్రమాదాలు జరగడం, అధికారులు కేసులు నమోదు చేయడం షరామామూలుగానే మారింది. ఎన్ని సంఘటనలు జరిగినా వాటిని పూర్తి స్థాయిలో నివారించడంలో అధికారులు, యాజమాన్యాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
నివారణకు చర్యలు..
ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడుతున్నాం. తరచూ పరిశ్రమలను సందర్శిస్తున్నాం. రక్షణ విషయంలో యాజమాన్యాలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తప్పవు. - గంగాధర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్
పరిశ్రమల్లో భద్రతేదీ?
Published Sun, Feb 9 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement