పునర్విభజన ముసాయిదా ప్రకటన : కొత్తగా 59 ఎంపీటీసీ | 59 New MPTC Seats to be formed in Medak District | Sakshi

పునర్విభజన ముసాయిదా ప్రకటన : కొత్తగా 59 ఎంపీటీసీ

Aug 15 2013 5:47 AM | Updated on Sep 1 2017 9:51 PM

జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఎంపీటీసీ పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం బుధవారం ముసాయిదా జాబితాను ప్రకటించింది.

జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఎంపీటీసీ పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం బుధవారం ముసాయిదా జాబితాను ప్రకటించింది. ముసాయిదా జాబితాను అనుసరించి జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ముసాయిదా జాబితాపై మండలాల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తయి అనంతరం ఈనెల 27న తుది జాబితాను వెలువరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పునర్విభజనతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 687కి పెరిగింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మండల పరిషత్ అధికారులు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. 
 
గత ఎంపీటీసీ ఎన్నికల ప్రకారం జిల్లాలో 664 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. అయితే ఇటీవల ప్రభుత్వం జిల్లాలో కొత్తగా చేగుంట, దుబ్బాక, గజ్వేల్, అందోలు నగర పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో 664 ఎంపీటీసీ స్థానాల నుంచి 36 ఎంపీటీసీ స్థానాలను అధికారులు తొలగించారు. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 628కు చేరుకుంది. తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం  చేపట్టిన ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జిల్లాలో మొత్తంగా ఎంపీటీసీ స్థానాల సంఖ్య 687కు చేరుకోనుంది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ముసాయిదా జాబితాకు బుధవారం కలెక్టర్ ఆమోదముద్రవేశారు. దీంతో ఈనెల 21వ తేదీ వరకు మండల స్థాయిలో ఎంపీటీసీల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి, 27వ తేదీన తుది జాబితాను వెలువరిస్తారు. 
 
జిన్నారంలో కొత్తగా 7 ఎంపీటీసీ స్థానాలు
ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో జిల్లాలో అత్యధికంగా జిన్నారం మండలంలో ఏడు కొత్త ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు అవుతున్నాయి. ఆ తర్వాత పటాన్‌చెరు మండలంలో కొత్తగా ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఆయా మండలాల్లో జనాభా శాతం పెరగటంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనను పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో అత్యధికంగా జహీరాబాద్‌లో 28 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అత్యల్పంగా రామచంద్రాపురం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. 
 
పార్టీలు, ఆశావహులకు తీపికబురు
జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానుండటంపై రాజకీయపార్టీలతోపాటు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు కూడా సంతోషంగా ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలు పెరుగుతుండటంతో రాజకీయపార్టీలు మరికొంత మంది నాయకులను ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు ఇచ్చి వారిని సంతోషపరిచే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే వారు సైతం ఎంపీటీసీ స్థానాలు పెరగటంతో స్థానిక బరిలో నిలిచేందుకు అవకాశం ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement