సాక్షిప్రతినిధి, నల్లగొండ : సంక్రాంతి పండగ ముంగింట్లో గులాబీ గుబాళించింది. జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మునుగోడు మండలం కిష్టాపురం, నిడమనూరు మండలం ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. శాసనసభాపక్షనేత జానారెడ్డి ఇలాఖాలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకుని ప్రతిపక్షానికి గట్టిషాక్ ఇచ్చింది.
కిష్టాపురం, ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11న ఉపఎన్నికలు జరిగాయి. 13న జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానం గతంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది. ఇక్కడ ఎంపీటీసీ మన్నెం శేఖర్. ఇతని తండ్రి మరణంతో ఆయన ఉద్యోగంలో కారుణ్య నియామకం కింద చేరి ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. అలాగే కిష్టాపురం ఎంపీటీసీ చీమల గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఇతను కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచి ఆతర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇతని మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించారు. రెండు స్థానాలు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి గెలిచినవే కాగా, ఈసారి ఎన్నికల సంగ్రామంలో టీఆర్‌ఎస్‌కు దక్కాయి. కిష్టాపురంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కదిరె లింగయ్య 508 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి మునుకుంట్ల గోపాల్‌కు 725 ఓట్లు రాగా, బీజేపీకి 131, టీడీపీకి 29, నోటాకు 34 ఓట్లు పడ్డాయి. అలాగే ఎర్రబెల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నెం వెంకన్న 563 ఓట్ల మెజారిటీతో సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సిద్దనూరు వెంకటేశ్వర్లుకు 768, టీడీపీకి 147, నోటాకు 58 ఓట్లు వచ్చాయి. గతంలోని ఎంపీటీసీ స్థానం దక్కించుకోకపోవడంతో నిడమనూరు మండల కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇక్కడ ఆపార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేదాలే పార్టీ అభ్యర్థి ఓటమికి దారితీశాయని సమాచారం. అయితే టీఆర్‌ఎస్ అభ్యర్థులు నీళ్లలా ఓటర్లకు డబ్బులు పంచారని, అందుకే విజయం సాధించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
విజయోత్సవం..
నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన యువత మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నికల ముందు భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా రెండు స్థానాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పార్టీ విజయం సునాయసంగా మారింది. రెండు స్థానాలు టీఆర్‌ఎస్ దక్కించుకోవడంతో ఆ పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. విజేతలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment