MPTC Seats
-
గులాబీ.. గుబాళింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సంక్రాంతి పండగ ముంగింట్లో గులాబీ గుబాళించింది. జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మునుగోడు మండలం కిష్టాపురం, నిడమనూరు మండలం ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. శాసనసభాపక్షనేత జానారెడ్డి ఇలాఖాలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుని ప్రతిపక్షానికి గట్టిషాక్ ఇచ్చింది. కిష్టాపురం, ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11న ఉపఎన్నికలు జరిగాయి. 13న జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానం గతంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది. ఇక్కడ ఎంపీటీసీ మన్నెం శేఖర్. ఇతని తండ్రి మరణంతో ఆయన ఉద్యోగంలో కారుణ్య నియామకం కింద చేరి ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. అలాగే కిష్టాపురం ఎంపీటీసీ చీమల గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఇతను కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచి ఆతర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇతని మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించారు. రెండు స్థానాలు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి గెలిచినవే కాగా, ఈసారి ఎన్నికల సంగ్రామంలో టీఆర్ఎస్కు దక్కాయి. కిష్టాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి కదిరె లింగయ్య 508 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మునుకుంట్ల గోపాల్‌కు 725 ఓట్లు రాగా, బీజేపీకి 131, టీడీపీకి 29, నోటాకు 34 ఓట్లు పడ్డాయి. అలాగే ఎర్రబెల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నెం వెంకన్న 563 ఓట్ల మెజారిటీతో సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సిద్దనూరు వెంకటేశ్వర్లుకు 768, టీడీపీకి 147, నోటాకు 58 ఓట్లు వచ్చాయి. గతంలోని ఎంపీటీసీ స్థానం దక్కించుకోకపోవడంతో నిడమనూరు మండల కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇక్కడ ఆపార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేదాలే పార్టీ అభ్యర్థి ఓటమికి దారితీశాయని సమాచారం. అయితే టీఆర్ఎస్ అభ్యర్థులు నీళ్లలా ఓటర్లకు డబ్బులు పంచారని, అందుకే విజయం సాధించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయోత్సవం.. నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన యువత మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నికల ముందు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా రెండు స్థానాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పార్టీ విజయం సునాయసంగా మారింది. రెండు స్థానాలు టీఆర్ఎస్ దక్కించుకోవడంతో ఆ పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. విజేతలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభినందించారు. -
రెండో దశకోసం...
సాక్షి, గుంటూరు : పరిషత్ పోరులో తొలి అంకం ముగియడంతో రెండోదశ ఎన్నికలకు అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. జిల్లాలోని 28 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. 28 జడ్పీటీసీ స్థానాలకు 105 మంది, 432 ఎంపీటీసీ స్థానాలకు 1,182 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం సాయంత్రంతో రెండో దశ ప్రచారం ముగించాల్సి ఉంది. గడువు దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పార్టీలు సోమవారం రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించాయి. తొలి దశలో ఆధిక్యత కనబరిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో దశలోనూ అదే దూకుడు కనబరుస్తోంది. ప్రచారంలో పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. మొన్నటి పోలింగ్ సరళిని చూసి ఈ సారైనా పుంజుకోవాలని భావించిన టీడీపీ శ్రేణుల్లో తమ పార్టీ బీజేపీ పొత్తు వల్ల నిరుత్సాహం ఆవరించింది. పైగా రెండో విడతలో పోలింగ్ జరిగే మండలాల్లో అధికంగావైఎస్సార్ సీపీకి పట్టున్నవే కావడ ం మరింత నీరుగార్చింది. సత్తెనపల్లి, మాచర్ల, ప్రత్తిపాడు, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లో రెండు చోట్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, మూడు స్థానాల్లో కాంగ్రెస్, మరో మూడు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాచర్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడాదిన్నర కిందట జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో వైఎస్సార్ సీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రామకృష్ణారెడ్డి, సుచరితలు 2004 నుంచి 2009 వరకు జడ్పీలో వెల్దుర్తి, ఫిరంగిపురం మండలాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. రెండోదశ పరిషత్ ఎన్నికలు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల మాదిరి ఫలితాలే పునరావృతమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 16చోట్ల బరిలో లేని కాంగ్రెస్.. రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అసలు 16 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో లేదు. సత్తెనపల్లి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి, కాండ్రు కమల, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జడ్పీటీసీ స్థానాలకు అసలు కాంగ్రెస్ తరఫున ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. రెండో విడతలో మూడు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ నడుమే పోటీ ఉంది. డొక్కా ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గంలో తుళ్ళూరు మండలం నుంచి కాంగ్రెస్ పోటీలో లేదు. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలోనూ ఇదే పరిస్థితి. వైఎస్సార్ సీపీ ఇక్కడ సీపీఎంకు మద్దతిస్తోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు మే 13న ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై టీడీపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా ఈ లోగా రెండోదశ పరిషత్ పోలింగ్తోపాటు, సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తవుతాయని భావించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. -
పునర్విభజన ముసాయిదా ప్రకటన : కొత్తగా 59 ఎంపీటీసీ
జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఎంపీటీసీ పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం బుధవారం ముసాయిదా జాబితాను ప్రకటించింది. ముసాయిదా జాబితాను అనుసరించి జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ముసాయిదా జాబితాపై మండలాల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తయి అనంతరం ఈనెల 27న తుది జాబితాను వెలువరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పునర్విభజనతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 687కి పెరిగింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మండల పరిషత్ అధికారులు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. గత ఎంపీటీసీ ఎన్నికల ప్రకారం జిల్లాలో 664 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. అయితే ఇటీవల ప్రభుత్వం జిల్లాలో కొత్తగా చేగుంట, దుబ్బాక, గజ్వేల్, అందోలు నగర పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో 664 ఎంపీటీసీ స్థానాల నుంచి 36 ఎంపీటీసీ స్థానాలను అధికారులు తొలగించారు. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 628కు చేరుకుంది. తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టిన ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జిల్లాలో మొత్తంగా ఎంపీటీసీ స్థానాల సంఖ్య 687కు చేరుకోనుంది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ముసాయిదా జాబితాకు బుధవారం కలెక్టర్ ఆమోదముద్రవేశారు. దీంతో ఈనెల 21వ తేదీ వరకు మండల స్థాయిలో ఎంపీటీసీల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి, 27వ తేదీన తుది జాబితాను వెలువరిస్తారు. జిన్నారంలో కొత్తగా 7 ఎంపీటీసీ స్థానాలు ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో జిల్లాలో అత్యధికంగా జిన్నారం మండలంలో ఏడు కొత్త ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు అవుతున్నాయి. ఆ తర్వాత పటాన్చెరు మండలంలో కొత్తగా ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఆయా మండలాల్లో జనాభా శాతం పెరగటంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనను పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో అత్యధికంగా జహీరాబాద్‌లో 28 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అత్యల్పంగా రామచంద్రాపురం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. పార్టీలు, ఆశావహులకు తీపికబురు జిల్లాలో కొత్తగా 59 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కానుండటంపై రాజకీయపార్టీలతోపాటు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు కూడా సంతోషంగా ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలు పెరుగుతుండటంతో రాజకీయపార్టీలు మరికొంత మంది నాయకులను ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు ఇచ్చి వారిని సంతోషపరిచే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే వారు సైతం ఎంపీటీసీ స్థానాలు పెరగటంతో స్థానిక బరిలో నిలిచేందుకు అవకాశం ఏర్పడింది.