సాక్షి, గుంటూరు : పరిషత్ పోరులో తొలి అంకం ముగియడంతో రెండోదశ ఎన్నికలకు అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. జిల్లాలోని 28 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. 28 జడ్పీటీసీ స్థానాలకు 105 మంది, 432 ఎంపీటీసీ స్థానాలకు 1,182 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం సాయంత్రంతో రెండో దశ ప్రచారం ముగించాల్సి ఉంది.
గడువు దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పార్టీలు సోమవారం రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించాయి. తొలి దశలో ఆధిక్యత కనబరిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో దశలోనూ అదే దూకుడు కనబరుస్తోంది. ప్రచారంలో పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. మొన్నటి పోలింగ్ సరళిని చూసి ఈ సారైనా పుంజుకోవాలని భావించిన టీడీపీ శ్రేణుల్లో తమ పార్టీ బీజేపీ పొత్తు వల్ల నిరుత్సాహం ఆవరించింది. పైగా రెండో విడతలో పోలింగ్ జరిగే మండలాల్లో అధికంగావైఎస్సార్ సీపీకి పట్టున్నవే కావడ ం మరింత నీరుగార్చింది.
సత్తెనపల్లి, మాచర్ల, ప్రత్తిపాడు, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లో రెండు చోట్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, మూడు స్థానాల్లో కాంగ్రెస్, మరో మూడు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాచర్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడాదిన్నర కిందట జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో వైఎస్సార్ సీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రామకృష్ణారెడ్డి, సుచరితలు 2004 నుంచి 2009 వరకు జడ్పీలో వెల్దుర్తి, ఫిరంగిపురం మండలాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. రెండోదశ పరిషత్ ఎన్నికలు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల మాదిరి ఫలితాలే పునరావృతమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
16చోట్ల బరిలో లేని కాంగ్రెస్.. రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అసలు 16 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో లేదు. సత్తెనపల్లి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి, కాండ్రు కమల, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జడ్పీటీసీ స్థానాలకు అసలు కాంగ్రెస్ తరఫున ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. రెండో విడతలో మూడు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇక్కడ ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ నడుమే పోటీ ఉంది. డొక్కా ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గంలో తుళ్ళూరు మండలం నుంచి కాంగ్రెస్ పోటీలో లేదు. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలోనూ ఇదే పరిస్థితి. వైఎస్సార్ సీపీ ఇక్కడ సీపీఎంకు మద్దతిస్తోంది.
స్థానిక ఎన్నికల ఫలితాలు మే 13న ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై టీడీపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా ఈ లోగా రెండోదశ పరిషత్ పోలింగ్‌తోపాటు, సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తవుతాయని భావించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
రెండో దశకోసం...
Published Tue, Apr 8 2014 1:13 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement