మెతుకుసీమలో మరో కలికితురాయి
జిన్నారం: మెతుకుసీమ సిగలో మరో కలికితురాయి ప్రకాశించనుంది. మెదక్ జిల్లా జిన్నారం మండలం కొడకంచిలో రూ.100 కోట్లతో డక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమను నిర్మించారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పరిశ్రమను ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొడకంచిలోని 270 సర్వే నంబర్‌లో సుమారు 14 ఎకరాల స్థలంలో రెండేళ్ల నుంచి డక్కన్ ఆటో యూనిట్ పరిశ్రమను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 200 మంది వరకు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
మరో రెండేళ్లలో 2,000 మంది. ఐదేళ్లలో ఆరు వేల మంది వరకు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇతర దేశాల నుంచి బస్సుల తయారీకి సంబంధించిన వస్తువులను దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ బస్సులను సర్వాంగసుందరంగా తయారుచేసి ఎగుమతి చేస్తారు. నెలకు సుమారు మూడు వేల వరకు బస్సులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక పరికరాలను ఈ పరిశ్రమలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే బస్సులను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మరో ఐదేళ్లలో ఇదే ప్రాంతంలో కరోవా బస్సులను తయారు చేసే ప్లాంట్‌లను కూడా నిర్మించనున్నట్లు పరిశ్రమలవర్గాలు వెల్లడించాయి.
అదే విధంగా బస్సులకు ఉపయోగపడే ఇంజన్ల తయారీ ప్లాంట్ల నిర్మాణం కూడా జరగనుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలకు చెందిన డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సులను పూర్తి చేసుకున్న యువతకు ఈ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటైన మొదటి పరిశ్రమ ఇదే కావడం గమనార్హం. కొడకంచి గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ. 3 లక్షల వరకు ఆదాయం ఉంటుందని గ్రామ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమ తమ ప్రాంతంలో ఏర్పాటు కావటం సంతోషంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమ రావటం సంతోషంగా ఉంది
తమ గ్రామ పరిధిలో పరిశ్రమ ఏర్పాటు కావటం సంతోషంగా ఉంది. స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమ యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమవంతు సహాయ సహకారాలను అందిస్తాం.
- గోపమ్మ, సర్పంచ్, కొడకంచి
మరిన్ని పరిశ్రమలు వస్తాయి
ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయి. కరోవా యూనిట్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఐదేళ్లల్లో సుమారు 6వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
- రాజిరెడ్డి, పరిశ్ర మ ప్రతినిధి