వావిలాలలో జొన్న పంటను పరిశీలిస్తున్న సాల్మన్‌నాయక్
- సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం
- ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల వినతి
జిన్నారం: మూడు రోజులుగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల వరకు వివిధ రకాల పంటలు, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా బొంతపల్లి, సోలక్‌పల్లి, వావిలాల, రాళ్లకత్వ తదితర గ్రామాల్లో రైతులు వేసిన వరి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పైనుంచి వర్షపు నీరు వెళ్లటంతో వరి పూర్తిగా వంగి పోయింది. నీరు ఎక్కువగా చేనులో నిలవ ఉండటంతో వరి పంట నాశనమైనట్లేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సుమారు ఐదువందల ఎకరాల్లో వరిపంట నాశనమైనట్లు అధికారులుఅంచనా వేస్తున్నారు. మండలంలోని గుమ్మడిదల, అనంతారం, కానుకుంట, మంబాపూర్ తదితరగ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న కూరగాయ పం టలకు కూడా నష్టం వాటిల్లింది. పంట చేనులోకి నీరు ఎక్కువగా నిలవ ఉండటంతో పంటకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.
టమాటా, క్యాబేజీ, కాలీప్లవర్, బెండ, పచ్చిమిర్చీ, చిక్కుడు, పొట్లకాయ లాంటి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఉద్యానవనశాఖఅ ధికారులు చెబుతున్నారు. సుమారు 300 ఎకరాల్లో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో పాటు పత్తి, మొక్క జొన్న పంటలు కూడా వర్షం కారణంగా నష్టపోయిందని, రెండు వందల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. అనంతారం గ్రామంలోని ఓ రైతుకు చెందిన ఫౌల్రీ‍్ట ఫారంలోకి వర్షం నీరు వెళ్లి రెండువేల వరకు కోడి పిల్లలు మృతి చెందాయి.
దీంనితో పాటు గుమ్మడిదలలోని ఓ రైస్‌మిల్లులోని ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వర్షం కారణంగా మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇదే వర్షం నెల రోజులకు ముందుపడి ఉంటే బాగుండేదని రైతులు అంటున్నారు. ప్రస్తుతం పంటలను తాము తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఆయా గ్రామాల్లో నష్టపోయిన పంటలను తాము పరిశీలించాం. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. - సాల్మన్‌నాయక్, మండల వ్యవసాయ అధికారి