కొత్త పరిశ్రమలు వచ్చేనా?
జిన్నారం: పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ కొత్త విధానాలు రూపొందించడంతో జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి. వ్యవసాయ, వాణిజ్య రంగాలతో పాటు పరిశ్రమలకు కూడా పెద్దపీట వేస్తామంటూ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటుపై సింగిల్ విండో పథకాన్ని చూపొందించేందుకు రంగం సిద్దం చేసింది.
ఈ పథకంతో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ పారిశ్రామిక విధానంపై నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పాలసీపై పారిశ్రామిక వేత్తల నుంచి కొంత సానుకూలత, వ్యతిరేకతలు వస్తున్నాయి. ప్రోత్సాహాలన్నీ కొత్తగా పరిశ్రమలు స్థాపించబోయే వారికేనా అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను కాపాడేందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు.
మరి మా పరిస్థితి ఏమిటి?
నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో 5 వేల ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఇందుకు సంబంధించి పనులను కూడా రెవెన్యూ అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారికి సింగిల్ విండో విధానాన్ని వర్తింపజేయటం పట్ల కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం ఈ పథకంపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. నూతన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, ఉన్న పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలంటున్నారు. అవుటర్ రింగు రోడ్డులోపల ఉన్న పరిశ్రమలను బయటకు పంపేందుకు ప్రభుత్వం నుంచి వత్తిడిలు వస్తున్నాయని, అదే జరిగితే తమకు ఎలాంటి సాయం అందిస్తారో సర్కార్ తన నూతన పాలసీలో తెలపలేదని పలువురు పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికి మాత్రమే ప్రోత్సహాకాలను అందిస్తే, తమ పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నా, నూతన పరిశ్రమల స్థాపన జరుగుతుందో లేదోననే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగింల్ విండో పాలసీ బాగున్నప్పటికీ ఇది కేవలం నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకేనా ? ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అనుమతులు కావాలంటే ఏంచేయాలనే దానిపై స్పష్టత లేదని, పరిశ్రమలను కేటగిరీలుగా విభజించే విషయంపై కూడా స్పష్టత లేదనినే అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఫార్మా, స్టీల్, ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. వీటిని కేటగిరీల వారిగా విభజించే విషయంపై ప్రభుత్వం తగిన స్పష్టతను ఇవాల్సి ఉందని యాజమన్యాలు చెబుతున్నాయి. రెడ్, గ్రీన్, ఆరెంజ్ కేటగిరీలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఏదిఏమైనా సర్కార్ పారిశ్రామిక విధానంపై పారిశ్రామిక వేత్తలకు పలు అనుమానాలున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.