సాక్షి, హైదరాబాద్: ప్రజలు కోరుకున్న మార్పును తీసుకురావడంలో భాగంగా అందరి సలహాలు, సూచనలతో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) తోడ్పాటును అందిస్తామని భరోసానిచ్చారు. వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఎఫ్టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్‌ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులతో బుధవారం శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు.
పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చైనా కంటే ఉత్తమంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజం కల్పించడంతోపాటు అర్బన్, రీజనల్, సెమీ అర్బన్ క్లస్టర్లుగా విభజించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. డ్రైపోర్ట్ విషయంలోనూ త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని, నల్లగొండ నుంచి పాత ముంబై హైవే ప్రాంతాలను అనుసంధానం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి న హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధితో లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ‘ప్లాన్ 2050’అమలు చేస్తామన్నారు. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన దేశాలు కూడా గుర్తించేలా ‘ఫార్మా ఇండస్ట్రీ హబ్’గా తీర్చిదిద్దుతామన్నారు.
హైదరాబాద్‌లో తయారైన క్షిపణులు ఇజ్రాయెల్‌కు ఎగుమతి అవుతున్న వైనం రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అద్దం పడుతోందన్నారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొంతమంది కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపైనే తమ ఆలోచన ఉంటుందని శ్రీధర్‌బాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment