సాక్షి, అమరావతి: నూతన పారిశ్రామిక పాలసీల్లో దళితులు, బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇంతకాలం వారికి అందిస్తున్న అదనపుప్రయోజనాల్లో భారీ కోత పెట్టింది. భూమి కొనుగోలు దగ్గర నుంచి పెట్టుబడి వ్యయం వరకు అదనపు ప్రయోజనాలు కల్పించకపోగా.. ఇప్పటివరకు ఉన్న వాటిని కూడా తీసివేయడంపై దళిత పారిశ్రామిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 32 పేజీల పారిశ్రామిక పాలసీల్లో కేవలం ఒకే ఒక వాక్యం ఎస్సీ, ఎస్టీల గురించి ప్రస్తావించి వదిలేశారంటే దళితులపై చంద్రబాబు ప్రభుత్వంకు ఎంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు.
మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అదనంగా 5 శాతం పెట్టుబడి సాయం అని ప్రస్తావించారే తప్ప.. ఆ పెట్టుబడి సాయం పరిధిని మాత్రం పెంచలేదు. ఇతరులకు ఇస్తున్న విధంగానే పెట్టుబడి సాయం పరిమితిని ఉంచడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న పరిశ్రమల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వం కొనుగోలు చేసే వస్తువులను ఎస్సీ, ఎస్టీలకు చెందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నుంచి 4 శాతం తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసే దళితులకు అదనంగా 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ అని పేర్కొన్నా ఇతరులకు అందిస్తున్న క్యాపిటల్ సబ్సిడీ రూ.7 కోట్ల పరిమితిని అదేవిధంగా ఉంచి పైసా కూడా పెంచకపోవడం ఈ ప్రభుత్వం దళితులపై చూపిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమని దళిత్ ఇండ్రస్టియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్ ఘాటుగా విమర్శించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ బడుగు వికాసం పేరిట దళితలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తే.. పొరుగున ఉన్న తెలంగాణ కూడా అదేవిధంగా భూమి కొనుగోళ్లలో రాయితీ ఇస్తోందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీ 4.0లో వీటన్నింటికీ మంగళం పాడారని విమర్శించారు.
ప్రైవేటు పార్కులొస్తే రిజర్వేషన్లు
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల నుంచి భారీ పరిశ్రమలకు వరకు అన్నిరకాల పారిశ్రామిక పార్కులను ప్రైవేటుపరం చేసే విధంగా పారిశ్రామిక పార్కుల పాలసీని ప్రవేశపెట్టడం ద్వారా దళితులు, బలహీన వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై ప్రభుత్వం నీళ్లుచల్లింది. ఇంతకాలం ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పార్కుల్లో 25 శాతం వరకు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండటమే కాకుండా తక్కువ ధరకు భూమిని కేటాయించేవారు. కానీ ఇప్పుడు పార్కులను ప్రైవేటు పరం చేస్తుండటంతో రిజర్వేషన్లకు అవకాశం లేకుండా పోయింది.
ప్రైవేటు పారిశ్రామిక పాలసీల్లో రిజర్వేషన్లు కల్పించాలని దళిత సంఘాలు అనేకసార్లు విజ్ఞప్తి చేసిన కూటమి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఏపీఐఐసీ స్థానంలో ప్రైవేటు పార్కులను ప్రోత్సహిస్తూ ఎంఎస్‌ఎంఈ పాలసీలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ప్రతిపాదన ఏ విధంగా అమలు అవుతుందని దళితులు ప్రశ్నిస్తున్నారు.
పారిశ్రామిక పాలసీలలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీల ప్రతిపాదనలు
» పరిశ్రమల్లో ఏర్పాటు చేసే వ్యయంలో అదనంగా 5 శాతం పెట్టుబడి రాయితీ
» ఎంఎస్‌ఎంఈ పాలసీలో ప్రభుత్వ కొనుగోళ్లలో 4 శాతం ఎస్‌సీ, ఎస్టీలకు పరిశ్రమల నుంచి కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తాం
» 10 శాతం అదనపు క్యాపిటల్ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.7 కోట్లు.
» పారిశ్రామిక పార్కుల్లో 20 శాతం స్థలాలు మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపు
వైఎస్సార్ బడుగు వికాసంలో..
» పారిశ్రామిక పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో భూమి విలువలో 50 శాతం రాయితీ.
» భూబదలాయింపు చార్జీల్లో 25 శాతం, 100 శాతం స్టాంప్‌డ్యూటీ మినహాయింపు
» తయారీ, సర్వీసు రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ 45 శాతం. 9 శాతం వడ్డీ రాయితీ.
» ఉత్పత్తి ప్రారంభించిన ఐదేళ్ల వరకు యూనిట్ ధరపై రూ.1.50 సబ్సిడీ
» ఎంఎస్‌ఎంఈలకు 100 శాతం ఎస్‌జీఎస్టీ మినహాయింపు
» మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం ఎస్‌జీఎస్టీ మినహాయింపు
» ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సీడ్ క్యాపిటల్ అసిస్టెంట్ కింద 25 శాతం యంత్రాల కొనుగోలు వ్యయంపై రాయితీ
» క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్లకు అయ్యే వ్యయంలో 100 శాతం రాయితీ. రాయితీలు విడుదలకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment