ఉల్లిగడ్డ పంట
- పంటను కాపాడేందుకు అధికారుల సూచనలు, సలహాలు తప్పని సరి
జిన్నారం: ఉల్లి సాగు చేసేందుకు రైతులు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో కూడా ఉల్లికి మంచి ధర ఉంది. దీంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. ఉల్లి సాగుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలాంటి తెగుళ్లు వస్తాయి, రోగాల నివారణకు ఏమేమి చర్యలు తీసుకోవాలనే విషయమై ఉద్యానశాఖ అధికారి అనిల్‌కుమార్ (సెల్ : 8374449348)సలహాలు, సూచనలు చేస్తున్నారు.
పంటను విత్తే సమయం
ఖరీఫ్ సీజన్‌లో జూన్-జులై నుంచి అక్టోబర్- నవంబర్ వరకు సాగు చేయవచ్చు. వేసవి పంటగా జనవరి- ఫిబ్రవరి నెలల్లో కూడా పంట వేసుకోవచ్చు
పంట సాగుకు ఉండాల్సిన నేల :
ఉల్లి సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన మెరక నేల అవసరం. ఉప్పు, చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు.
సోకే తెగుళ్లు : నివారణ చర్యలు :
1. తామర పురుగు :
లక్షణాలు : ఈ పురుగు మొక్కల ఆకుల మొవ్వలలో ఉండి రసాన్ని పీలుస్తుంది. దీని వలన ఆకులమీద తెల్లని మచ్చలు వస్తాయి. దీంతో ఆకులు కొనల నుంచి కింది వరకు ఎండిపోతాయి.
నివారణ : తామర పురుగు నివారణకు లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ 0.05శాతం 50ఇసీ మిథైల్ పారథియాన్ మందును వేసి పంటపై పిచికారి చేయాలి.
2. నారుకుళ్లు తెగులు :
లక్షణాలు : ఈ తెగులు సోకటంతో నారుమడిలోని మొలకెత్తు విత్తనాలను, నారును ఆశిస్తుంది. దీంతో పంట ఎదగదు.
నివారణ చర్యలు : దీని నివారణకు 1శాతం బోర్డో మిశ్రమంతో గాని లేదా, 0.3శాతం సెరసాన్‌తో గాని నేలను బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి.
3. ఆకులను తినే గొంగళి పురుగు :
లక్షణాలు : పంట ఎదుగుతున్న సమయంలో పంటకు గొంగళి పురుగులు వస్తాయి. ఇవి ఆకులను పూర్తిగా తినేస్తాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది.
నివారణ చర్యలు : గొంగళి పురుగు నివారణకు 2మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ మందను మందును ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగులు :
ల„ýక్షణాలు :
ఆకుమచ్చ తెగులు వాతావర ణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు సోకుతుంది. ప్రారంభ దశలో ఆకుల మీద బూడిద రంగు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు సోకిన ఆకులు వాలిపోయి ఎండిపోతాయి.
నివారణ చర్యలు :
దీనినివారణ చర్యలకు సమయానుకూలంగా 1శాతం బోర్డో మిశ్రమాన్ని 15రోజుల వ్యవధిలో చల్లాలి.
అందుబాటులో విత్తనాలు :
75శాతం సబ్సీడీపై విత్తనాలను అందించే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు రకాల విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కిలో ఉల్లిగడ్డ విత్తనాలు రూ. 1350 ధర ఉండగా, 75శాతం సబ్సిడీపై రూ. 350కి విక్రయిస్తున్నారు.