onion crop
-
ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తున్న రైతులు
-
రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి
-
సీఎంకి రక్తంతో రైతు ఆహ్వాన లేఖ! ఎందుకంటే..
మహారాష్ట్రాలోని నాసిక్ జిల్లాలో ఒక రైతు తన ఉల్లి పంటకు నిప్పంటించాడు. తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కోపంతో సుమారు 1.5 ఎకరాల ఉల్లి పంటకు నిప్పంటించాడు కృష్ణ డోంగ్రే అనే రైతు. ఆ పంట కోసం అని సుమారు రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టానని, ఆ తర్వాత వాటి రవాణా కోసం సుమారు రూ. 30 వేలు అదనంగా ఖర్చు చేశానని వాపోయాడు. ఇంత చేస్తే చివరికి ఉల్లి ధర మార్కెట్లో కేవలం రూ. 25 వేలు పలుకుతోందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగు నెలలుగా రాత్రి, పగలనక కష్టపడి 1.5 ఎకరంలో ఉల్లి పంట పండించాను, దాన్ని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్ల కాల్చేయాల్సి వచ్చిందని ఆవేదనగా చెప్పాడు. ఈ పంట కోసం తన చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయ్యాయని అన్నాడు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించి రైతులకు అండగా నిలవాలని కోరాడు. ఈ ఘటన జరిగి 15 రోజుల అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాధికారి రాకపోగా, కనీసం సానుభూతి కూడా చూపలేదని అన్నాడు. కనీసం మమ్మల్ని మీరు ఇలా చేయకండి మేము ఆదుకుంటామన్న భరోసా కూడా ఇవ్వలేదని అతను వాపోయాడు. ఈ మేరకు రైతు కృష్ణ ఈ ఉల్లి దహనోత్సవానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు రక్తంతో కూడా ఓ లేఖ రాశానని చెప్పారు. ప్రభుత్వం తమ పంటలన్నింటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాడు. అలాగే ప్రస్తుత నష్టాలకు గానూ అందరికీ క్విటాకు వెయ్యి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డ్రోంగే కోరాడు. Angry Farmer Burns Onion Crop, Invites Eknath Shinde, Writes In Blood https://t.co/lpCk293OJq pic.twitter.com/5yZTFPW36s — NDTV (@ndtv) March 6, 2023 (చదవండి: 'స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుందా'! ఏ జీవికైనా అంతేగా..) -
రైతన్నలకు మరో 3 వరాలు!
సాక్షి, అమరావతి : అన్నదాతలకు మరో మూడు వరాలను ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పండించే పలు పంటలకు గిట్టుబాటు ధరలు, శాశ్వత కొనుగోలు కేంద్రాలతోపాటు కేంద్రం కొనుగోలు చేయగా మిగిలిన పంటను రైతుల నుంచి కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు మార్కెటింగ్‌శాఖ ఈమేరకు చర్యలను తీసుకుంటోంది. వీటికి సంబంధించి నూతన ఏడాదిలో ప్రకటన చేసే అవకాశం ఉంది. మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్లకు ‘మద్దతు’ కేంద్రం మద్దతు ధర ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్ల (కొర్రలు, అండుకొర్రలు, సామలు)కు మద్దతు ధర ఇచ్చి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పంటల సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా వరి, గోధుమలు, అపరాలు, పత్తి, కంది పంటలకు మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే రాష్ట్రంలో పండించే పలు పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధిక దిగుబడి వచ్చిన సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్లకు మద్దతు ధర ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌శాఖల అధికారులతో చర్చలు జరిపిన మార్కెటింగ్, సహకారశాఖల ప్రత్యేక కార్యదర్శి మధుసూధనరెడ్డి దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు. శాశ్వత కొనుగోలు కేంద్రాలు ఇకపై సీజన్లవారీగా కాకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు శాశ్వత కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరిమిత కాలంలో ఏర్పాటవుతున్న కొనుగోలు కేంద్రాల వల్ల రైతులు పూర్తిగా పంటను అమ్ముకోలేకపోతుండటంతో శాశ్వత కేంద్రాలను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మార్కెట్ సబ్ యార్డుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో పంటల ధరలు తగ్గినప్పుడు రైతులు తమ పంటలను ఎప్పుడైనా శాశ్వత కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయించే అవకాశం లభిస్తుంది. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో పౌరసరఫరాలశాఖ, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీలుగా పంటలను కొనుగోలు చేయనున్నాయి. మిగతాది రాష్ట్రమే కొంటుంది ఏటా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటల దిగుబడిలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొనగా మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిపై జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
ఉల్లి దొంగలు వస్తున్నారు జాగ్రత్త!
సాక్షి, చెన్నై : దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి కోస్తేనే కాదు కొనాలంటే కూడా కన్నీళ్లు వస్తున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లిగడ్డల ధర రూ.100 ను దాటాయి. ఉల్లిగడ్డల్ని బంగారం లాగా దాచుకుంటున్నారు. అదే సమయంలో ఉల్లి గడ్డల దొంగలు కూడా దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో పొలంలో పంటల మీద ఉన్న ఉల్లిపాయల్ని ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే అదే తరహా దొంగతనం తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ రైతు పంట వేయడానికి తెచ్చుకున్న 350 కిలోల ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారు. పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ (40)అనే రైతు జీవిస్తున్నాడు. అతను ఉల్లి పంటలు వేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే తన మూడు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుచేసేందుకు 350 కిలోల చిన్న ఉల్లిపాయలను 15 బుట్టలలో ఉంచి పొలం దగ్గర ఉంచాడు. అయితే ఆ ప్రాంతాంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున నాలుగైదు రోజులుగా ఆయన పొలం వైపు వెళ్లలేదు. బుధవారం ఉదయం పొలం వెళ్లి చూసిన ముత్తు క్రిష్ణన్ షాక్ అయ్యాడు. పొలంలో ఉంచిన ఉల్లిని ఎవరో గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. దీంతో ముత్తుక్రిష్ణన్‌లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
పొలంలోని ఉల్లి పంటనే ఎత్తుకెళ్లారు!
భోపాల్: కొండెక్కెత్తున్న ఉల్లిపాయల ధరలు మనుషులను దొంగతనాలకు పాల్పడేలా చేస్తున్నాయి. బంగారాన్ని, ఉల్లిపాయల్ని పక్క పక్కన పెడితే బంగారాన్ని వదిలేసి ఉల్లియాల్ని చోరీ చేసి ఎత్తుకెళ్లే స్థాయికి ఉల్లి ధరలు చేరుకున్నాయి. సాధారణంగా ఇంట్లో ఉన్న ఉల్లిపాయలను దొంగలించడం గురించి మనం వింటుంటాం.. కానీ ఏకంగా పొలంలో పంటల మీద ఉన్న ఉల్లిపాయల్ని ఎత్తుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో చోటు చేసుకుంది. తమ పంట మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందన్న ఆనందంలో ఉన్న రైతుకు.. ఉల్లి పంట ఆయన కళ్లల్లో కన్నీటినే నింపింది. వివరాల్లోకెళ్తే.. రిచా గ్రామంలోని జితేంద్ర కుమార్ అనే రైతు పొలంలో చోరీ జరిగింది. ఈ చోరీలో సుమారు రూ. 30 వేలకు పైగా విలువ చేసే ఆరు క్వింటాళ్ల ఉల్లి పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ రైతు నారాయణగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంట పూర్తిగా చేతికి రాకముందే ఉల్లిని ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనం రేపింది. దొంగలను వెంటనే పట్టుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. కాగా ఉల్లి దొరకడమే బంగారం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. దీంతో మార్కెట్లో ఉన్నవాటికే కాదు.. పంట చేలలో ఉన్న వాటిని కూడా వదలడం లేదు. జితేంద్ర కుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. కిలో ఉల్లిపాయలు రూ.100కు చేరుతున్న తరుణంలోనే ఇలా జరిగింటుదన్నారు. అయితే ఉల్లి పంటను దోచుకుపోయారని రైతు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఉల్లి రైతు కుటుంబాన్ని ఆదుకునేదెప్పుడు?
మూడేళ్లుగా పంటలు సక్రమంగా పండక, గిట్టు బాటు ధర లేక, పొలానికి పెట్టిన పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో బోయ తలారి గిడ్డయ్య ఒకరు. అతనిది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ మండల పరిధిలోని దైవందిన్నె గ్రామం. గిడ్డయ్య(42) అప్పుల బాధతో గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో రెండేళ్లు వరుసగా మిరప, ఉల్లి పంటల సాగు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటంతో అప్పులపాయ్యాడు. దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పు తేలింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావటంతో కృంగిపోయాడు. ఆ నేపథ్యంలో 2018 ఆగస్టు 11న ఉల్లి పంట కోసి పొలంలో కుప్ప వేశాడు. ఉల్లికి ధర మరీ తక్కువగా ఉండటంతో కోసిన పంటను పొలంలోనే వదిలేసి నిర్వేదంతో గిడ్డయ్య ఇంటికి వచ్చాడు. అదేరోజు ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య రామలక్ష్మి, కుమారులు చంద్రశేఖర్ నాయుడు(10 వ తరగతి), మల్లికార్జున(9వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణించటంతో చదువు మానేసి పొట్ట కూటి కోసం పనులకు వెళ్తున్నారు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్ ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తుంటే, చిన్నకుమారుడు మల్లికార్జున తల్లికి తోడుగా పనికి వెళ్తున్నాడు. గిడ్డయ్య ఆత్మహత్య చేసుకొని ఆరు నెలలైనప్పటికీ అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. అప్పులిచ్చిన వారు డబ్బు కట్టమని గిడ్డయ్య భార్య, పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. పొలం అమ్మి అయినా అప్పులు తీర్చుదామనుకొని బేరం పెడితే.. కొనటానికి ఎవరూ ముందుకు రాలేదని రామలక్ష్మి వాపోయింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి తమ కుటుంబం వీధిన పడినా ప్రభుత్వం కనికరించడం లేదని కళ్ల నీరు కుక్కుకుంటున్నదామె. ఎప్పటికైనా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతోనే బతుకుతున్నామని తెలిపిందామె. – నాగరాజు సాక్షి, ఎమ్మిగనూరు రూరల్, కర్నూలు జిల్లా -
ఉల్లి రైతుకు ఊరటనిచ్చే యంత్రం
ఉల్లి పాయలను పీకిన తర్వాత కాడను కొంత మేరకు కోసి పొలంలో 3–7 రోజులు ఎండబెడతారు. ఎండిన తర్వాత ఉల్లిపాయలపై గుప్పెడు ఎత్తున ఉండే పిలకను కత్తితో కోసి, గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పనిని సాధారణంగా మహిళా కూలీలతో చేయిస్తుంటారు. ఇది చాలా శ్రమతో, ఖర్చుతో కూడిన పని. ఈ సమస్య పరిష్కారానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎ. కరోలిన్ రతినకుమారి ఒక యంత్రాన్ని రూపొందించారు. ఆనియన్ డి–టాప్పింగ్ మెషీన్లో ఎండిన ఉల్లిపాయలు వేస్తే.. ఉల్లిపాయల నుంచి పిలకలను కత్తిరించి, వీటిని వేర్వేరుగా బయటకు పంపుతుంది. 3 కె.డబ్లు్య., 3 ఫేజ్ విద్యుత్ మోటార్‌తో నడుస్తుంది. గంటకు టన్ను ఉల్లిపాయలపై పిలకలు కత్తిరిస్తుంది. దీని ధర రూ. 4 లక్షలు. ఉల్లిని ఎక్కువగా సాగు చేసే ప్రాంతాల్లో రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తేవచ్చు. వివరాలకు.. డాక్టర్ ఎ. కరోలిన్ రతినకుమారి, ముఖ్య శాస్త్రవేత్త, ఐఐహెచ్ఆర్, బెంగళూరు. మొబైల్ – 94835 19724 carolin@iihr.res.in -
ఉల్లిసాగుతో లాభాలు
పంటను కాపాడేందుకు అధికారుల సూచనలు, సలహాలు తప్పని సరి జిన్నారం: ఉల్లి సాగు చేసేందుకు రైతులు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో కూడా ఉల్లికి మంచి ధర ఉంది. దీంతో రైతులు ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. ఉల్లి సాగుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలాంటి తెగుళ్లు వస్తాయి, రోగాల నివారణకు ఏమేమి చర్యలు తీసుకోవాలనే విషయమై ఉద్యానశాఖ అధికారి అనిల్‌కుమార్ (సెల్ : 8374449348)సలహాలు, సూచనలు చేస్తున్నారు. పంటను విత్తే సమయం ఖరీఫ్ సీజన్లో జూన్-జులై నుంచి అక్టోబర్- నవంబర్ వరకు సాగు చేయవచ్చు. వేసవి పంటగా జనవరి- ఫిబ్రవరి నెలల్లో కూడా పంట వేసుకోవచ్చు పంట సాగుకు ఉండాల్సిన నేల : ఉల్లి సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన మెరక నేల అవసరం. ఉప్పు, చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. సోకే తెగుళ్లు : నివారణ చర్యలు : 1. తామర పురుగు : లక్షణాలు : ఈ పురుగు మొక్కల ఆకుల మొవ్వలలో ఉండి రసాన్ని పీలుస్తుంది. దీని వలన ఆకులమీద తెల్లని మచ్చలు వస్తాయి. దీంతో ఆకులు కొనల నుంచి కింది వరకు ఎండిపోతాయి. నివారణ : తామర పురుగు నివారణకు లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ 0.05శాతం 50ఇసీ మిథైల్ పారథియాన్ మందును వేసి పంటపై పిచికారి చేయాలి. 2. నారుకుళ్లు తెగులు : లక్షణాలు : ఈ తెగులు సోకటంతో నారుమడిలోని మొలకెత్తు విత్తనాలను, నారును ఆశిస్తుంది. దీంతో పంట ఎదగదు. నివారణ చర్యలు : దీని నివారణకు 1శాతం బోర్డో మిశ్రమంతో గాని లేదా, 0.3శాతం సెరసాన్‌తో గాని నేలను బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి. 3. ఆకులను తినే గొంగళి పురుగు : లక్షణాలు : పంట ఎదుగుతున్న సమయంలో పంటకు గొంగళి పురుగులు వస్తాయి. ఇవి ఆకులను పూర్తిగా తినేస్తాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణ చర్యలు : గొంగళి పురుగు నివారణకు 2మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ మందను మందును ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు : ల„ýక్షణాలు : ఆకుమచ్చ తెగులు వాతావర ణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు సోకుతుంది. ప్రారంభ దశలో ఆకుల మీద బూడిద రంగు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు సోకిన ఆకులు వాలిపోయి ఎండిపోతాయి. నివారణ చర్యలు : దీనినివారణ చర్యలకు సమయానుకూలంగా 1శాతం బోర్డో మిశ్రమాన్ని 15రోజుల వ్యవధిలో చల్లాలి. అందుబాటులో విత్తనాలు : 75శాతం సబ్సీడీపై విత్తనాలను అందించే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కిలో ఉల్లిగడ్డ విత్తనాలు రూ. 1350 ధర ఉండగా, 75శాతం సబ్సిడీపై రూ. 350కి విక్రయిస్తున్నారు.