సాక్షి, చెన్నై : దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి కోస్తేనే కాదు కొనాలంటే కూడా కన్నీళ్లు వస్తున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లిగడ్డల ధర రూ.100 ను దాటాయి. ఉల్లిగడ్డల్ని బంగారం లాగా దాచుకుంటున్నారు. అదే సమయంలో ఉల్లి గడ్డల దొంగలు కూడా దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో పొలంలో పంటల మీద ఉన్న ఉల్లిపాయల్ని ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే అదే తరహా దొంగతనం తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ రైతు పంట వేయడానికి తెచ్చుకున్న 350 కిలోల ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారు.
పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ (40)అనే రైతు జీవిస్తున్నాడు. అతను ఉల్లి పంటలు వేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే తన మూడు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుచేసేందుకు 350 కిలోల చిన్న ఉల్లిపాయలను 15 బుట్టలలో ఉంచి పొలం దగ్గర ఉంచాడు. అయితే ఆ ప్రాంతాంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున నాలుగైదు రోజులుగా ఆయన పొలం వైపు వెళ్లలేదు. బుధవారం ఉదయం పొలం వెళ్లి చూసిన ముత్తు క్రిష్ణన్ షాక్ అయ్యాడు. పొలంలో ఉంచిన ఉల్లిని ఎవరో గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. దీంతో ముత్తుక్రిష్ణన్‌లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment