ఎట్టకేలకు జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. దీంతో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు.
జిన్నారం, న్యూస్‌లైన్: ఎట్టకేలకు జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. దీంతో అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. సోమవారం రాత్రి నుంచే అభ్యర్థులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఫారాలు చేతికి అందిన వెంటనే అభ్యర్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కాంగ్రెస్ జెడ్పీటీసీ బీఫారం ఎవరికి లభిస్తుందనే విషయం సోమవారం మధ్యాహ్నం 12గంటల వరకు ఎవరికి తెలియదు.
శివానగర్ మాజీ సర్పంచ్ ప్రభాకర్, సోలక్‌పల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే చివరి వరకు ఎవరికి బీఫారం లభిస్తుందనే ఉత్కంఠ కాంగ్రెస్ నాయకులతో పాటు, ఇతర పార్టీ నాయకుల్లో కూడా నెలకొంది. ఎట్టకేలకు కాంగ్రెస్ తరఫున ప్రభాకర్‌ను ఎంపిక చేస్తూ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ బీఫారం అందించారు. అదే విధంగా టీడీపీ తరఫును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున అండూర్ గ్రామానికి చెందిన, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ తరఫున జిన్నారం మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్ పోటీలో ఉన్నారు.
బీఎస్పీ తరఫున జిన్నారం మాజీ ఎంపీటీసీ సభ్యుడు పుట్టిభాస్కర్ రంగంలో ఉన్నారు. దోమడుగు మాజీ సర్పంచ్ బాల్‌రెడ్డి సీపీఐ తరఫున పోటీలో ఉన్నారు. ఏదిఎలా ఉన్నా జిన్నారం మండలంలో రసవత్తర పోరు జరగనుంది. ప్రస్తుతం మండల వ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీలకు గ్రామాల్లో క్యాడర్ బాగానే ఉంది. ఇక రానున్న రోజుల్లో ఓటర్లు ఎవరిని జెడ్పీటీసీగా నిలబెడతారో వేచి చూడాలి.