దేవుడా బతికేదెట్టా? | Batikedetta God ? | Sakshi
Sakshi News home page

దేవుడా బతికేదెట్టా?

Published Fri, Jul 29 2016 6:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

Batikedetta God ?

గాలి పీల్చలేం.. నీరు తాగలేం

మెతుకుసీమలో కోరలు చాచిన కాలుష్యం

పారిశ్రామిక వాడల్లో దినదినగండమే..

ఇష్టారాజ్యంగా వ్యర్థాల విడుదల

మహిళలకు గర్భస్రావాలు..

సోకుతున్న ప్రాణాంతక వ్యాధులు

విలవిల్లాడుతున్న చిన్నారులు

అంతరిస్తున్న పశుపక్ష్యాదులు

విదేశాలకూ పాకిన ఇక్కడి పొగలు

ఇక్కడి పాలకులకు పట్టని సెగలు

ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు

 

 

 

 

 

 

 

 

 

 

 

జిల్లాలో కాలుష్యం పంజా విసురుతోంది. కాసారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని ప్రముఖ పర్యావరణ వేత్తలతో పాటు నార్వే దేశం లోని టీవీ ఛానల్స్‌ వారు కూడా మన కాలుష్యంపై డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్నారంటే ఇక్కడి కాలుష్యం ఎంతటి ప్రభావాన్ని చూపుతుంతో అర్థమవుతోంది. పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యమయ్యాయి. చెరువులు, కుంటలు కాలుష్యంగా మారి, ఇందులోని నీరు ఎందుకూ పనికి రాకుండా పోతోంది. మంజీరానదిలోని తాగునీరు కూడా కాలుష్యం బారిన పడుతుంది. వెయ్యి ఫీట్ల లోతుగా భూమిలో నీరు ఉన్నా అది పసుపు రంగులో బయటకు వస్తుందంటే కాలుష్యం తీవ్రత ఎంత ఉంతో ఇట్టే  తెలిసిపోతోంది. గాలి కూడా కలుషితమయ్యింది. దీంతో ప్రజలు బతకటమే కష్టమవుతున్న సందర్భాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా కాలుష్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ..


జిన్నారం / పటాన్‌చెరు / కొండాపూర్‌ / పుల్‌కల్‌ / శివ్వంపేట / జహీరాబాద్‌ టౌన్‌ :
జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, బొల్లారం గ్రామాలు పూర్తిగా పారిశ్రామిక ప్రాంతాలు. ఈ పారిశ్రామిక వాడల్లో సుమారు 250 భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లో 80శాతం వరకు రసాయన పరిశ్రమలే. సుమారు ఇరవై ఏళ్లక్రితం ఈ ప్రాంతాల్లో భారీగా రసాయన పరిశ్రమలు వెలిశాయి.

అప్పటి నుంచి నేటి వరకు కాలుష్య ప్రవాహం ఈ ప్రాంతంలో కొనసాగుతూనే ఉంది. ఇక్కడి కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో పర్యావరణ వేత్తలు కాలుష్య సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. దీంతో ఈ కేసును సుప్రీం కోర్టు చెన్నైలోని గ్రీన్‌ పీస్‌ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది.  
– భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం :
 వెయ్యి ఫీట్ల  పసుపు రంగులో నీరు బయటకు వస్తుంటుంది. అంటే ఇక్కడి కాలుష్యం భూగర్భంలో ఎంతగా ఇంకిపోయిందో అర్థమవుతుంది.  సాగుపై కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భూగర్భంలోంచి స్వచ్ఛమైన నీరు గగనమేనని పర్యావరణ వేత్తలు, అధికారులు చెబుతున్నారు. ఇక్కడి పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలను తుంగలోకి తొక్చి ఇష్టారాజ్యంగా కాలుష్య జలాలను బహిరంగంగా బయటకు వదులుతుండటమే ఇందుకు కారణం.
– ఘాటు వాసనలు:
పారిశ్రామిక వాడల్లోని ప్రజలు నిత్యం కాలుష్యం, ఘాటైన వాయువులనే పీలుస్తున్నారు. శ్వాస పీల్చుకోవటం కష్టతరమవుతుంది. రాత్రి అయిందంటే ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. కళ్లలో మంట, కడుపులో వికారంతో ఇబ్బందులు పడుతున్నారు.
– ప్రాణాంతకమై వ్యాధులు :
వాయు, జలకాలుష్యం వల్ల ప్రజలు ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయి. క్యాన్సర్‌, చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు, నిమోనియా, ఆస్తమా, టీబీ లాంటి వ్యాధులతో తీవ్రంగా బాధ పడుతున్నారు. ప్రతినిత్యం వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చిన్నారుల్లో పెరుగుదల కూడా లోపిస్తోంది. బుద్ధి మాధ్యం, జ్ఞాపక శక్తి లోపం లాంటిసమస్యలతో   చిన్నారులు బాధపడుతున్నారు. కాలుష్యాన్ని పీలుస్తుండటంతో ఇక్కడి ప్రజల ఆయుష్షు కూడా తగ్గుతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
సాగులేక.. బతకలేక..
పారిశ్రామిక వాడల్లో వ్యవసాయం పూర్తిగా కనుమరుగైంది. 50ఏళ్ల క్రితం పంట పొలాలతో కళకళలాడిన గ్రామాలు నేడు బీడువారి కళావిహీనంగా మారాయి. పాడి పశువులు కాలుష్య జలాలను తాగి మృత్యువాత పడుతున్నాయి.    దీంతో విలువైన పశు సంపద కూడా హరిస్తోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటి వరకు సుమారు 3వేల ఎకరాల్లో పంట కనుమరుగైంది.  500 వరకు మూగజీవాలు మృతి చెందాయి.
  చెరువులు, కుంటల్లో సైతం..
 పారిశ్రామిక వాడల్లో గల కుంటలు, చెరువుల్లో కాలుష్య జలాలే.. బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం గ్రామాల్లోని  సుమారు 30 కుంటలు, 10 చెరువులు కాలుష్యంగా కాసారాలుగా మారాయి. ఖాజీపల్లి ఖాజీ చెరువులోని కాలుష్యమట్టిని తొలగించి, ప్రక్షాళన చేయాలని పదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఇందుకోసం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోలేదు.
 ఇతర దేశాల దృష్టి
పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే నష్టాలను తెలుసుకునేందుకు ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగళూరు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యావరణ వేత్తలు మండలంలోని ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తుంటారు. రసాయన పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే కాలుష్యం సమస్యను పూర్తిగా తెలుసుకుంటారు. తాజాగా నార్వే దేశానికి చెందిన కొంత మంది టీవీ ప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణను చేపట్టారు.

రసాయన పరిశ్రమల స్థాపన వల్ల కలిగే నష్టాలను నార్వే దేశ ప్రభుత్వానికి అందించేందుకు గాను ఈ డాక్యుమెంటరీని టీవీ ఛానల్‌ ప్రతినిధులు చిత్రీకరించారు. 2005లో స్వీడన్‌ దేశానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు కూడా ఈ పారిశ్రామిక వాడలో పర్యటించారు. ఇక్కడి కాలుష్య తీరును తెలుసుకునేందుకు గాను  సుప్రీంకోర్టు న్యాయవాది మెహతా కూడా ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో పర్యటించారు.
  స్వచ్ఛమైన గాలి కరువే
 గాలి కూడా పూర్తిగా కలుషితమవుతోంది. గాలిలో విషవాయువులు పేరుకుపోతుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా హైడ్రోజన్‌ సల్ఫైడ్, క్లోరిన్, మెరికాప్టన్, అన్ని రకాల సల్ఫర్‌ కాంపౌండులు గాలిలో కలుస్తున్నాయి. దీంతో ప్రజలు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. గాలిలో 21శాతం ఆక్సీజన్‌ ఉండాల్సి ఉండగా, కాలుష్యం, ఇతర కారణాల వల్ల 20 శాతానికి ఆక్సీజన్‌ తగ్గిందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కాలుష్యం  వల్ల ఓజోన్‌ పొర కూడా దెబ్బతింటోందంటున్నారు.
వర్షాకాలం వస్తే పండుగే :
రసాయన పరిశ్రమల యాజమాన్యాలకు వర్షాకాలం వచ్చిందంటే పండగే. రాత్రి సమయంలో ఎలాంటి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను వర్షం నీటితో కలిపి బయటకు వదులుతున్నారు. దీంతో చెరువులు, కుంటలు పూర్తిగా కాలుష్యంగా మారుతాయి. వర్షాకాలంలో వ్యర్థ జలాలను బయటకు రాకుండా ఏర్పాట్లు తీసుకోవటంలో పీసీబీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  
పర్యటనలకే పరిమితం..
కాలుష్య సమస్య తీవ్రంగా ఉందనే విషయం దృష్టికి రావటంతో మంత్రులు, ఎమ్మెల్యే, ఆయా పార్టీల నాయకులు, విద్యావేత్తలు, పారిశ్రామిక వాడల్లో పర్యటించి వెళ్లటం ఆనవాయితీగా మారింది. చుక్కారామయ్య, కోదండరాం, లాంటి విద్యావేత్తలు కూడా పారిశ్రామిక వాడల్లో పర్యటించారు. పర్యటించిన ఆసమయంలోనే కాలుష్యంపై పోరాటం చేస్తామని చెప్పి వెళ్తారే తప్ప, ఇప్పటి వరకు కాలుష్య నివారణకు ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకున్న పాపానపోలేదు.

జబ్బులతో తీవ్రంగా బాధపడుతున్నా
 15ఏళ్లుగా కాలుష్య కారణంగా ఆస్తమా, కీళ్ల నొప్పుల వ్యాధితో బాధపడుతున్నా. చిన్న కిరాణం షాపు నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న నేను ప్రతినిత్యం మందులు వాడాల్సిందే. రాత్రి సమయంలో కాలుష్య వాయువులు ఎక్కువైతే శ్వాస పీల్చుకోవటం కష్టమవుతోంది. కాళ్లు ఉబ్బుతాయి. కాలుష్య సమస్యను సత్వరమే పరిష్కరించాలి.
- : జగన్మోహన్‌రావు గడ్డపోతారం

కాలుష్యం తగ్గింది :
ప్రస్తుతం కాలుష్య సమస్య పారిశ్రామిక వాడల్లో చాలా వరకు తగ్గింది. కాలుష్య జలాలను, వాయు కాలుష్యాన్ని బయటకు వదులుతున్న పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాలుష్య నివారణకు తము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. వర్షాకాలంలో వ్యర్థ జలాలు బయటకు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఓ టీంను కూడా ఏర్పాటు చేశాం.
- నరేందర్, పీసీబీ ఈఈ

కాలుష్యంపై పోరాటం చేస్తున్నాం :
కాలుష్యంపై 2005 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటించకుండా అదనపు ఉత్పత్తులు చేయటం, భారీగా వాయు, జల కాలుష్యాలను బహిరంగా వదలటం లాంటి డిమాండ్‌లతో తాము పోరాటం చేస్తున్నాం. పారిశ్రామిక వాడల్లో పంటలు నష్టపోయిన రైతులకు, ప్రజలకు కూడా నష్టపరిహారం దక్కటం లేదు. పారిశ్రామిక వాడల్లోని ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలి. ప్రస్తుతం చెన్నైలోని గ్రీన్‌పీస్‌ కోర్టులో ఈ కేసు నడుస్తోంది.
-  చిదంబరం, పర్యావరణ వేత్త
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement