పెంచిన కల్లు, చాయ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిన్నారం వాసులు కొందరు శనివారం వినూత్న నిరసనకు దిగారు.
జిన్నారం, న్యూస్‌లైన్: పెంచిన కల్లు, చాయ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిన్నారం వాసులు కొందరు శనివారం వినూత్న నిరసనకు దిగారు. ధరలు తగ్గించే వరకు ఎవరూ కల్లు, చాయ్ తొగొద్దనే నిబంధన విధించారు. శుక్రవారం సమావేశమై తీర్మానించిన వీరు శనివారం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవేళ ఎవరైన తాగితే 25 చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు వారు కల్లు దుకాణానికి వెళ్లే దారిలో చెప్పులను వేలాడదీశారు. వివరాలు ఇలా...
మండల కేంద్రమైన జిన్నారంలో కల్లు సీసా ధరను రూపాయి పెంచారు. ఇదివరకు సీసా ధర రూ.5 ఉండగా దుకాణం నిర్వాహకులు వారం రోజుల క్రితం రూపాయి పెంచారు. విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు రూపాయి పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం నుంచి గ్రామంలోని కల్లు దుకాణంలో ఎవరూ కల్లు తాగవద్దని ప్రకటించారు. తమ నిబంధనను కాదని ఎవరైన కల్లు తాగితే 25 చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. అంతేగాక కల్లు దుకాణానికి వెళ్లే దారిలో చెప్పులను వేలాడదీశారు. కల్లు ధర తగ్గే వరకు ఇది వర్తిస్తుందని వారు తెలిపారు.
చాయ్ ధర పెంపుపైనా..
ఇదిలావుంటే జిన్నారంలోని పలు హోటళ్లలో చాయ్ ధరను నెల రోజుల క్రితం పెంచారు. దీనిపై కూడా స్థానికులు కొందరు అభ్యంతరం తెలిపారు. కప్పు టీ ధర ఇదివరకు మూడు రూపాయలు ఉండగా ఏకంగా మూడు రూపాయలు పెంచారు. ఆరు రూపాయలు పెట్టి కప్పు చాయ్ తాగడం భారమని వారంటున్నారు. పెంచిన చాయ్ ధరను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు హోటళ్లలో ఎవరు కూడా చాయ్ తాగరాదని వారు హుకుం జారీ చేశారు. తమ మాటను ఖాతరు చేయకపోతే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. ధరను తగ్గించే వరకు హోటళ్లలో చాయ్ చేయవద్దని, ఒకవేళ చేస్తే జరిమానా విధిస్తామన్నారు. వారి హెచ్చరికల నేపథ్యంలో శనివారం గ్రామంలో చాయ్ దొరక్క కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై కల్లు దుకాణం, చాయ్ హోటల్ యజమానులను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తాము కూడా ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. ధరలను పెంచకపోతే తాము నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వారు కోరారు.