ప్రమాదంలో మృతి చెందిన సాయి, పరిమళ
- స్కూటీని ఢీకొట్టిన బొలెరో వాహనం
- అక్క, తమ్ముడి మృతి..
- ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల చిన్నారి
జిన్నారం: నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష అనుకుంటూ రెండు రోజుల క్రితమే ఆ అక్క తమ్ముడికి రాఖీ కట్టింది.తమ్ముడికి రాఖీ కట్టేందుకు వచ్చిన అక్కను తిరిగి అత్తారింటికి పంపే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కా, తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరు నెలల చిన్నారి మాత్రం మృత్యువు నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడింది.
ఈ సంఘటనతో కిష్టాయిపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని కిష్టాయిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన రెండో కూతురు పరిమల (25) తమ్మడు సాయి కిరణ్ గౌడ్ (22)కు రాఖీ కట్టేందుకు రెండు రోజుల క్రితం పుట్టినిళ్లు కిష్టాయిపల్లికి వచ్చింది.
పరిమలకు ఆరు నెలల వయస్సున్న కూతురు శైనీ ఉంది. రాఖీ పండుగ జరుపుకున్న అనంతరం మరిమలను తన అత్తారిల్లు రంగారెడ్డి జిల్లా వెనకనూతల గ్రామానికి పంపేందుకు తమ్ముడు స్కూటీపై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లోని ఔటర్ సర్వీస్ రింగు రోడ్డు గుండా వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సాయికిరణ్‌గౌడ్ నడిపిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో సాయి కిరణ్‌గౌడ్‌తో పాటు అక్క పరిమళలు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో పరిమళ కూతురు శైనీ ఎగిరిపడడంతో స్వల్ప గాయాలయ్యాయి.ఈ విషయాన్ని తెలుసుకున్న సాయికిరణ్‌గౌడ్ తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరుకు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాపు జరుపుతున్నామని ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపారు. ప్రమాదానికి కారణమై బొలెరో వాహనంతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. గడ్డపోతారం మాజీ సర్పంచ్ నీరుడి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.