జిన్నారం : మండలంలోని ఊట్ల గ్రామ శివారులో ఏడేళ్ల క్రితం డంప్‌యార్డును నిర్మించారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి దాని నుంచి వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేయాలన్నది లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 2 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ డంప్‌యార్డును అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు.
నాటి నుంచి నేటి వరకు డంప్‌యార్డు వినియోగంలో లేదు. కేవలం రెండు నెలలు మాత్రమే చెత్తను సేకరించారే తప్ప, ఎరువును సైతం తయారు చేయలేకపోయారు అధికారులు. జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణలో డంప్‌యార్డును నిర్వహించాలని అప్పటి కలెక్టర్ సూచించారు. అయినా ఈ డంప్‌యార్డు మాత్రం వినియోగంలోకి రావటంలేదు. డంప్‌యార్డులో విలువైన వాహనాలు, భారీ యంత్రాలు, వర్మీకంపోస్టు షెడ్డులను నూతన సాంకేతిక పరిజ్ఙానంతో ఏర్పాటు చేశారు. చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్‌లు, ట్రాలీ సైకిళ్లు, చెత్త డబ్బాలను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో జనరేటర్, వే బ్రిడ్జ్‌లను కూడా ఏర్పాటు చేశారు.
ఏడేళ్లుగా ఇవి వినియోగంలో లేకపోవడంతో అవికాస్తా ఎందుకు పనికి రాకుండా పోయాయి. వాహనాలు తుప్పుపట్టాయి. గుర్తుతెలియని వ్యక్తులు డంప్‌యార్డులో ఉన్న వస్తువులను అపహరించుకుపోతున్నారు. విలువైన భవనాలు బీటలు వారుతున్నాయి. డంప్‌యార్డు వద్ద వాచ్‌మెన్‌ను నియమించినా అతనికి తగిన వేతనం ఇవ్వకపోవడంతో అతను విధుల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాలు అధికారులకు తెలిసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి కలెక్టర్ దినకర్‌బాబు స్వయంగా డంప్‌యార్డును సందర్శించారు.
అయినా ఫలితం లేకుండాపోయింది. గ్రామ శివారులో డంప్‌యార్డు ఏర్పాటు వల్ల స్థానికంగా తమకు ఉద్యోగాలు వస్తాయని యువకులు భావించారు. డంప్‌యార్డు ఏర్పాటు వల్ల ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తుండడం వల్ల గ్రామాలు సైతం శుభ్రంగా ఉంటాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాని ప్రజలు, యువకుల ఆశలు నెరవేరడం లేదు. గత ప్రభుత్వాలు ఈ డంప్‌యార్డుని తిరిగి వినియోగంలోకి తీసుకురావటంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలోనైనా డంప్‌యార్డు వినియోగంలోకి వస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెత్తను తొలగించి గ్రామాలు శుభ్రంగా ఉండడంతో పాటు, సేకరించిన చెత్త నుంచి రైతులకు ఉపయోగపడే వర్మికంపోస్టు ఎరువును తయారు చేయాలనే ప్రభుత్వం లక్ష్యం నీరుగారిపోయింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంప్‌యార్డును వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
వృథాగా డంప్‌యార్డు ఏడేళ్లుగా నిరుపయోగం
Published Sun, Oct 5 2014 11:48 PM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM
Advertisement