ఐదుగురి మృతి! మరో నలుగురికి గాయాలు
చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలో బుధవారం రాత్రి పేలుడు
భారీ శబ్దంతో బ్లాస్ట్ ఫర్నేస్ పేలి చెలరేగిన మంటలు
ఉలిక్కిపడ్డ పెన్నేపల్లి గ్రామం
ఇదే పరిశ్రమలో మరో బ్లాస్ట్ ఫర్నేస్.. అది కూడా పేలుతుందన్న అనుమానాలు
ఘటన స్థలానికి వెళ్లలేకపోతున్న పోలీసులు, అగ్నిమాపకదళం
పెళ్లకూరు: తిరుపతి జిల్లాలోని ఓ స్టీల్ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయపడినట్లు చెబుతున్నారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బ్లాస్ట్ ఫర్నేస్ భారీ శబ్దంతో పేలిపోయి, మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. భారీ పేలుళ్లతో పెన్నేపల్లి గ్రామం దద్దరిల్లింది.
పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు పెద్దపెట్టున కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. ఫర్నేస్ సమీపంలో పనిచేస్తున్న వారిలో ఐదుగురు చనిపోయి ఉంటారని కార్మికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను స్థానికులు, పోలీసులు నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిశ్రమ మేనేజర్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన తర్వాతే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది బయటపడ్డారు అనే వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకున్నప్పటికీ, ప్రమాదం జరిగిన యూనిట్‌లోకి ప్రవేశించడానికి సాహసించడం లేదు. పరిశ్రమలో ఉన్న మరో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పేలితే భారీ ప్రమాదం ఉంటుందన్న భయంతో ఎవరూ లోపలికి ప్రవేశించడంలేదు.
కార్మికులు అంతా ఇతర రాష్ట్రాల వారే. వారు తెలుగు మాట్లాడలేకపోవడంతో ఏం చెబుతున్నారో పోలీసులకు అర్థం కావడంలేదు. పంచాయతీ అనుమతులు లేకుండా ఈ కంపెనీలో రెండో యూనిట్ ఏర్పాటు చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment