న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాల విక్రయాలకు సంబంధించి 2023–24 సంవత్సరానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం లక్ష్యాలు విధించింది. అలాగే, ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాలకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక శాఖ లక్ష్యాలు విధించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈ పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. చౌక ధరకే బీమా రక్షణ కల్పించాలన్నది వీటి ఉద్దేశ్యం. 2023 మార్చి నాటికి పీఎంజేజేబీవై పరిధిలో 15.99 కోట్ల మంది పేర్లను నమోదు చేసుకోగా, పీఎంఎస్‌బీవై పరిధిలో 33.78 కోట్ల మంది సభ్యులుగా చేరారు.
గతేడాది పీఎంజేజేబీవై ప్రీమియంను ఏడాదికి రూ.330 నుంచి రూ.436కు పెంచగా, పీఎంఎస్‌బీవై ప్రీమియాన్ని ఏడాదికి రూ.12 నుంచి రూ.20 చేశారు. పీఎంజేజేబీవై అనేది రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీనిస్తుంది. పీఎంఎస్‌బీవై అనేది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి స్థాయి అంగవైకల్యం పాలైన సందర్భంలో రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం లభిస్తుంది. పీఎంజేజేబీవైని 18–50 ఏళ్ల వారు, పీఎంఎస్‌బీవైని 18–70 ఏళ్ల వారు తీసుకోవచ్చు. బ్యాంకుకు దరఖాస్తు ఇస్తే, వారి ఖాతా నుంచి ప్రీమియాన్ని డెబిట్ చేస్తారు.
ప్రోత్సహించాలి..
కస్టమర్లు ఏటా ఈ పథకాలను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఒకటికి మించిన సంవత్సరాలకు కొనుగోలు చేసేలా వారిని ప్రోత్సహించాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. గత వారం పీఎస్‌బీల సారథులతో, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు గాను వివిధ పథకాల పరిధిలో 2023–24 సంవత్సరానికి విధించిన లక్ష్యాలను బ్యాంకులు సాధించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై పథకాలపై మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 1ను ప్రారంభించడం గమనార్హం. బ్యాంకులు తమ కరస్పాండెంట్ నెట్‌వర్క్ ద్వారా మరింత మంది కస్టమర్లతో ఈ బీమా పథకాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment