Standup India
-
బీమా విక్రయాలపై బ్యాంకులకు లక్ష్యాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల విక్రయాలకు సంబంధించి 2023–24 సంవత్సరానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం లక్ష్యాలు విధించింది. అలాగే, ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాలకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక శాఖ లక్ష్యాలు విధించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈ పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. చౌక ధరకే బీమా రక్షణ కల్పించాలన్నది వీటి ఉద్దేశ్యం. 2023 మార్చి నాటికి పీఎంజేజేబీవై పరిధిలో 15.99 కోట్ల మంది పేర్లను నమోదు చేసుకోగా, పీఎంఎస్బీవై పరిధిలో 33.78 కోట్ల మంది సభ్యులుగా చేరారు. గతేడాది పీఎంజేజేబీవై ప్రీమియంను ఏడాదికి రూ.330 నుంచి రూ.436కు పెంచగా, పీఎంఎస్బీవై ప్రీమియాన్ని ఏడాదికి రూ.12 నుంచి రూ.20 చేశారు. పీఎంజేజేబీవై అనేది రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీనిస్తుంది. పీఎంఎస్బీవై అనేది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి స్థాయి అంగవైకల్యం పాలైన సందర్భంలో రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం లభిస్తుంది. పీఎంజేజేబీవైని 18–50 ఏళ్ల వారు, పీఎంఎస్బీవైని 18–70 ఏళ్ల వారు తీసుకోవచ్చు. బ్యాంకుకు దరఖాస్తు ఇస్తే, వారి ఖాతా నుంచి ప్రీమియాన్ని డెబిట్ చేస్తారు. ప్రోత్సహించాలి.. కస్టమర్లు ఏటా ఈ పథకాలను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఒకటికి మించిన సంవత్సరాలకు కొనుగోలు చేసేలా వారిని ప్రోత్సహించాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. గత వారం పీఎస్‌బీల సారథులతో, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు గాను వివిధ పథకాల పరిధిలో 2023–24 సంవత్సరానికి విధించిన లక్ష్యాలను బ్యాంకులు సాధించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాలపై మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 1ను ప్రారంభించడం గమనార్హం. బ్యాంకులు తమ కరస్పాండెంట్ నెట్వర్క్ ద్వారా మరింత మంది కస్టమర్లతో ఈ బీమా పథకాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. -
‘పరిశ్రమల స్థాపన’లో స్టాండ్–అప్ ఇండియా స్కీమ్ చేయూత
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గర్వకారణం... 1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మూడవ స్తంభం స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది. – భగవత్ కిసన్‌రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి -
మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: ‘స్టాండప్ ఇండియా’ పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81శాతం మంది మహిళలున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 4 సంవత్సరాల కాలంలో రూ .16,712 కోట్ల విలువైన రుణాలు అందిచినట్టు తెలిపింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చిన ఆరు పథకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), ప్రధానమంత్రి జన-ధన్ యోజన (పీఎంజేడీవై), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జెజెబీ), ప్రధానమంత్రి బీమా సురక్షా యోజన (పీఎంఎస్బీవై) పథకాల ద్వారా మహిళలు సాధికారతతో మరింత మెరుగైన జీవితాన్ని సాగించేందుకు, వ్యాపారవేత్తలుగా తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ పథకాలు తోడ్పడ్డాయని ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. గత ఆరు సంవత్సరాల్లో, మంత్రిత్వ శాఖ మహిళల సాధికారత కోసం ప్రత్యేక నిబంధనలు కలిగిన వివిధ పథకాలను ప్రారంభించామని వెల్లడించింది.2020 ఫిబవ్రరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొత్తగా సంస్థను ప్రారంభించేందుకు.. కనీసం ఒక్కరికైనా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలిచ్చే ఉద్దేశంతో 2016 ఏప్రిల్ 5న స్టాండప్ ఇండియా స్కీమ్‌ను కేంద్రం ప్రారంభించింది. అలాగే ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద మొత్తం రుణగ్రహీతలలో 70 శాతం మహిళలు. కార్పొరేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు రూ .10 లక్షల వరకు రుణాలు అందించే లక్ష్యంతో పీఎంఎంవై 2015 ఏప్రిల్ 8 న ప్రారంభించింది. ఈరుణాలను వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బిలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎంఎఫ్ఐలు, ఎన్‌బిఎఫ్‌సిలు అందిస్తాయి -
మహిళామణులకు చేయూత
- స్టాండప్ ఇండియా పథకంలో కదలిక - ఆర్థిక స్వావలంబన దశగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు - జిల్లాలో 30కిపైగా ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు - రూ.10 లక్షల నుంచి కోటి వరకు రుణ సదుపాయం - రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహణకు ఆదేశించిన సీఎస్ ఒంగోలు టూటౌన్ : జిల్లాలో దళిత మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా పథకంలో కదలిక మొదలైంది. పరిశ్రమలు స్థాపించేందుకు వినూత్న ప్రాజెక్టులతో ఔత్సాహిక దళిత మహిళలు ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 30 మందికి పైగా దళిత మహిళా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా వీరిలో 10 మంది ఔత్సాహికులకు బ్యాంకర్లు రుణ సదుపాయం కల్పించారు. మరో 10 యూనిట్ల స్థాపనకు బ్యాంకు అధికారులు ప్రాథమిక అంగీకారం తెలియజేయగా.. ఇంకొక పది యూనిట్ల దరఖాస్తులను అధికారులు పరిశీలన చేస్తున్నారు. గత యేడాది ఏప్రిల్ 5న ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే గత మేనెల 17న విజయవాడలో ఈ పథకం అమలపై రాష్ట్ర స్థాయి వర్క్ షాపు, జిల్లా స్థాయిలో వర్క్‌షాపులు జరిగాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకంను దిగువస్థాయిలో నిర్వహించాల్సిన కార్యాచరణకు సంబంధించిన అంశాలను వర్క్ షాపులలో అధికారులకు అవగహన కల్పించారు. అనంతరం జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, బ్యాంకర్లు, రూడ్సెట్, ఎపిట్కో.. డిక్కీ సంస్థకు చెందిన ప్రతినిధులు వర్క్‌షాపుల ద్వారా అవగహన కల్పించడంతో పథకంపై ఔత్సాహిక దళిత మహిళలు ముందుకొస్తున్నారు. పథకం ముఖ్య ఉద్ధేశం.. మేకిన్ ఇండియాలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సాహించడం ముఖ్య ఉద్ధేశం. ఇప్పటి వరకు బ్యాంకర్లు పేద మహిళలకు రుణ సదుపాయం కల్పించడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాని స్టాండప్ ఇండియా పథకం కింద కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ కనీసం ఇద్దరు ఎస్సీ, ఎస్టీల వర్గాలకు తప్పని సరిగా ఈ పథకం కింద రుణం ఇవ్వాలని నిబంధన విధించారు. యూనిట్‌కు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు హామీ లేకుండా రుణ సదుపాయం చేసేందుకు సీజీటీఎస్ఐఎల్(క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ స్టాండఫ్ ఇండియాలోన్స్) గా గతంలో ఉన్న సీజీటిఎంఎస్ఈకి బదులుగా సీజీటీఎస్ఐఎల్ను ప్రవేశపెట్టారు. 18 నెలల పాటు మారిటోరియం పిరియడ్ విధించడంతోపాటు ఔత్సాహికులు తప్పని సరిగా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం భరించాలని వివరించారు. ఈ పథకాన్ని ఇంకా తయారీ రంగంతో పాటు ట్రేడింగ్, సర్వీస్ సెక్టార్లకు విస్తరించారు. గ్రామీణ బ్యాంకులు కూడా ఈ పథకానికి చేయూత నందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు.. ఔత్సాహికులు తమ ప్రాజెక్టు నివేదికలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆరు దశలలో స్టాండప్ మిత్ర పోర్టల్ ద్వారా దరఖాస్తు పంపాలి. కనీసం మూడు బ్యాంకులకు తమ ప్రతిపాదనలను పంపుకోవచ్చు. లీడ్ జిల్లా మేనేజర్, నాబార్డ్ ఏజీఎంఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి ఆయా బ్యాంకులకు దరఖాస్తులను పంపిస్తారు. అనంతరం బ్యాంకర్లు ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించి నెల రోజుల్లో తమ నిర్ణయాన్ని దరఖాస్తు దారులకు తెలియజేయాలి. స్పష్టత కోసం రాష్ట్ర స్థాయి వర్క్ షాపు.. ఈ పథకంపై ఇంకా స్పష్టత కోసం రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహణకు రాష్ర్ట సీఎస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్ల డి క్కీ జిల్లా కోఆర్డినేటర్ భక్తవత్సలం తెలిపారు. ఆన్లైన్ విధానంతోపాటు సెక్యురిటీ సబ్సిడీ, మార్జిన్ మని తదితర అంశాలలో నిర్ధిష్టత లేనందున బ్యాంకర్లు అధికారులు ఎవరికి వారు తమకు తోచిన విధంగా అన్వయించుకోవడం.. దరఖాస్తుదారులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే విషయాన్ని డిక్కీ ప్రతినిధులు ఇటీవల రాష్ర్ట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మళ్లీ రాష్ర్ట స్థాయి వర్క్ షాపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ, బ్యాంకర్లు, అధికారులతో చర్చించి పథకంపై స్పష్టత ఇవ్వాలని, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. -
సాధికారతకు ‘స్టాండప్ ఇండియా’
కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ మహిళలు, ఎస్సీ, ఎస్టీల్లోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం నోయిడా: ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రారంభించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు దేశంలోని 1.25 లక్షల బ్యాంకు బ్రాంచులు ఈ పథకం కింద వారికి రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు ఇస్తాయని చెప్పారు. మంగళవారమిక్కడ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల వారికి జీవనోపాధి కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 5,100 ఈ-రిక్షాలను మోదీ పంపిణీ చేశారు. స్టాండప్ ఇండియా పథకం గురించి చెబుతూ.. ప్రతీ బ్యాంకుకు చెందిన బ్రాంచ్ ఇద్దరికి రుణాలిస్తుందని, దీంతో దేశంలో 2.5 లక్షల మంది వ్యాపారులు తయారవుతారన్నారు. ప్రతీ ఒక్కరికి ఉద్యోగం కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, ఈ పథకం ద్వారా ఉద్యోగార్థులే ఉద్యోగ సృష్టికర్తలుగా మారతారని చెప్పారు. దళితులు, గిరిజనుల జీవితాలను ఈ పథకం మార్చేస్తుందన్నారు. ప్రతీ ఒక్క భారతీయుడిని తన సొంత కాళ్ల మీద నిలబడేలా చేయడమే స్టాండప్ ఇండియా లక్ష్యమని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ దేశం గర్వించదగ్గ నేత అని, ఆయన జయంతి రోజున స్టాండప్ ఇండియా పథకాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా జగ్జీవన్ రామ్ జయంతి నాడు ఒక్క కార్యక్రమాన్నీ జరపలేదని కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆయన వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి దోహదం చేశారని, 1971 నాటి యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నారని చెప్పారు. ఆయన అందించిన అపార సేవలను మరిచిపోవడం దురదృష్టకరమన్నారు. ఈ-రిక్షాలతో ఆదాయం..ఈ-రిక్షా కార్మికులు తమ పిల్లలను ముఖ్యంగా బాలికలను విద్యావంతులుగా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దళితులు, పేదలకు అవకాశం కల్పిస్తేగానీ దేశం అభివృద్ధి చెందదన్నారు. ‘గతంలో రిక్షా కార్మికులు తమ శక్తినంతటినీ కూడబలుక్కొని రిక్షా తొక్కినప్పటికీ వారికి వచ్చేది చాలా తక్కువ. అయితే ఈ-రిక్షాను నడపడం వల్ల వారికి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఆదాయం ఎక్కువ ఉంటుంది. అదీగాక వారు దీనికి ఒక్క రూపాయీ అద్దె కట్టక్కర్లేదు. రోజూ చిన్నపాటి మొత్తం డబ్బు చెల్లిస్తే వారే యజమానులు అవుతారు’ అని చెప్పారు. పర్యావరణహితమైన ఈ-రిక్షాను సౌరవిద్యుత్ బ్యాటరీ కేంద్రంలో రీచార్జ్ చేసుకోవచ్చన్నారు. ఓలా యాప్ ద్వారాఈ-రిక్షాను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. లక్ష్యం కంటే ఎక్కువ రుణాలు: జైట్లీ ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా తాను పెద్ద కంపెనీలతో సంప్రదింపులు జరిపి పేదల ప్రయోజనం కోసం ఎంతగానో కృషిచేశామని చెప్పారు. పీఎం ముద్ర యోజన కింద బ్యాం కులు 3.26 కోట్ల మందికి రూ.1.35 లక్షల కోట్ల రుణాలిచ్చాయని, ఇది ప్రధాని నిర్దేశించిన రూ.1.22 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువని చెప్పారు. రూ. 5 వేల కోట్ల కార్పస్ ఫండ్ స్టాండప్ ఇండియా పథకం కింద రుణం తీసుకునే వారు రూపే డెబిట్ కార్డు ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే వారికి ముందస్తు శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్ తదితరాపై అవగాహన కల్పిస్తారు.చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి), నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీలు రూ.5వేల కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేస్తాయి. రూ. 10వేల కోట్లు రీఫైనాన్స్ చేస్తాయి. సిడ్బి, నాబార్డు కార్యాలయాలు స్టాండప్ ఇండియా అనుసంధాన కేంద్రాలుగా పనిచేస్తాయి. పేదలు కడతారు.. సంపన్నులు ఎగ్గొడతారు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లాంటి దిగ్గజ కార్పొరేట్ ఎగవేతదారులైపై మోదీ ధ్వజమెత్తారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయేందుకు కొంతమంది సంపన్నులు దారులు వెతుకుతుండగా, పేదలు మాత్రం నిజాయితీగా, ఉదారంగా తిరిగి చెల్లిస్తున్నారన్నారు. ‘జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతా తెరిచేందుకు పేదలను ప్రోత్సహించగా, వారు తమ వద్ద ఉన్న రూ.50, 100, 200 డబ్బును ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇలా రూ.35 వేల కోట్లకుపైగా డిపాజిట్ చేశారు. ఇది పేద ప్రజల ఉదారత’ అని పేర్కొన్నారు. అయితే, 17 బ్యాంకులకు రూ.9వేలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన మాల్యా పేరును మోదీ నేరుగా ప్రస్తావించలేదు.