సాధికారతకు ‘స్టాండప్ ఇండియా’
కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళలు, ఎస్సీ, ఎస్టీల్లోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
నోయిడా: ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రారంభించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు దేశంలోని 1.25 లక్షల బ్యాంకు బ్రాంచులు ఈ పథకం కింద వారికి రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు ఇస్తాయని చెప్పారు. మంగళవారమిక్కడ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల వారికి జీవనోపాధి కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 5,100 ఈ-రిక్షాలను మోదీ పంపిణీ చేశారు.
స్టాండప్ ఇండియా పథకం గురించి చెబుతూ.. ప్రతీ బ్యాంకుకు చెందిన బ్రాంచ్ ఇద్దరికి రుణాలిస్తుందని, దీంతో దేశంలో 2.5 లక్షల మంది వ్యాపారులు తయారవుతారన్నారు. ప్రతీ ఒక్కరికి ఉద్యోగం కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, ఈ పథకం ద్వారా ఉద్యోగార్థులే ఉద్యోగ సృష్టికర్తలుగా మారతారని చెప్పారు. దళితులు, గిరిజనుల జీవితాలను ఈ పథకం మార్చేస్తుందన్నారు. ప్రతీ ఒక్క భారతీయుడిని తన సొంత కాళ్ల మీద నిలబడేలా చేయడమే స్టాండప్ ఇండియా లక్ష్యమని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ దేశం గర్వించదగ్గ నేత అని, ఆయన జయంతి రోజున స్టాండప్ ఇండియా పథకాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా జగ్జీవన్ రామ్ జయంతి నాడు ఒక్క కార్యక్రమాన్నీ జరపలేదని కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆయన వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి దోహదం చేశారని, 1971 నాటి యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నారని చెప్పారు. ఆయన అందించిన అపార సేవలను మరిచిపోవడం దురదృష్టకరమన్నారు.
ఈ-రిక్షాలతో ఆదాయం..ఈ-రిక్షా కార్మికులు తమ పిల్లలను ముఖ్యంగా బాలికలను విద్యావంతులుగా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దళితులు, పేదలకు అవకాశం కల్పిస్తేగానీ దేశం అభివృద్ధి చెందదన్నారు. ‘గతంలో రిక్షా కార్మికులు తమ శక్తినంతటినీ కూడబలుక్కొని రిక్షా తొక్కినప్పటికీ వారికి వచ్చేది చాలా తక్కువ. అయితే ఈ-రిక్షాను నడపడం వల్ల వారికి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఆదాయం ఎక్కువ ఉంటుంది. అదీగాక వారు దీనికి ఒక్క రూపాయీ అద్దె కట్టక్కర్లేదు. రోజూ చిన్నపాటి మొత్తం డబ్బు చెల్లిస్తే వారే యజమానులు అవుతారు’ అని చెప్పారు. పర్యావరణహితమైన ఈ-రిక్షాను సౌరవిద్యుత్ బ్యాటరీ కేంద్రంలో రీచార్జ్ చేసుకోవచ్చన్నారు. ఓలా యాప్ ద్వారాఈ-రిక్షాను బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
లక్ష్యం కంటే ఎక్కువ రుణాలు: జైట్లీ
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా తాను పెద్ద కంపెనీలతో సంప్రదింపులు జరిపి పేదల ప్రయోజనం కోసం ఎంతగానో కృషిచేశామని చెప్పారు. పీఎం ముద్ర యోజన కింద బ్యాం కులు 3.26 కోట్ల మందికి రూ.1.35 లక్షల కోట్ల రుణాలిచ్చాయని, ఇది ప్రధాని నిర్దేశించిన రూ.1.22 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువని చెప్పారు.
రూ. 5 వేల కోట్ల కార్పస్ ఫండ్
స్టాండప్ ఇండియా పథకం కింద రుణం తీసుకునే వారు రూపే డెబిట్ కార్డు ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే వారికి ముందస్తు శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్ తదితరాపై అవగాహన కల్పిస్తారు.చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి), నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీలు రూ.5వేల కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేస్తాయి. రూ. 10వేల కోట్లు రీఫైనాన్స్ చేస్తాయి. సిడ్బి, నాబార్డు కార్యాలయాలు స్టాండప్ ఇండియా అనుసంధాన కేంద్రాలుగా పనిచేస్తాయి.
పేదలు కడతారు.. సంపన్నులు ఎగ్గొడతారు
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లాంటి దిగ్గజ కార్పొరేట్ ఎగవేతదారులైపై మోదీ ధ్వజమెత్తారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయేందుకు కొంతమంది సంపన్నులు దారులు వెతుకుతుండగా, పేదలు మాత్రం నిజాయితీగా, ఉదారంగా తిరిగి చెల్లిస్తున్నారన్నారు. ‘జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతా తెరిచేందుకు పేదలను ప్రోత్సహించగా, వారు తమ వద్ద ఉన్న రూ.50, 100, 200 డబ్బును ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇలా రూ.35 వేల కోట్లకుపైగా డిపాజిట్ చేశారు. ఇది పేద ప్రజల ఉదారత’ అని పేర్కొన్నారు. అయితే, 17 బ్యాంకులకు రూ.9వేలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన మాల్యా పేరును మోదీ నేరుగా ప్రస్తావించలేదు.