న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు దౌత్యపరమైన, అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో భారత్‌కు తిరిగి రావడం మినహా వారికి మరో మార్గం అంటూ ఉండదన్నారు. రుణ వితరణ, ఆర్థిక వృద్ధిపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు.
‘ఆర్థిక నేరస్థులను తీసుకొచ్చే విషయంలో విధానాలు, చట్టపరంగా నడుచుకుంటున్నాం. మేమిచ్చే సందేశం సుస్పష్టం. మీ దేశానికి తిరిగి రండి. ఇందుకోసం మా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రధాని ప్రస్తావించలేదు. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీలను తీసుకొచ్చేందుకు భారత్ ఇటీవలి కాలంలో చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బ్యాంకులు వినూత్నంగా పనిచేయాలి..
దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి తమ సర్కారు గడిచిన ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలను అమలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏలు గత ఐదేళ్లలోనే కనిష్ట స్థాయిలకు చేరినట్టు చెప్పారు. చురుకైన చర్యల ద్వారా రూ.5 లక్షల కోట్ల మొండి రుణాలను వసూలు చేసినట్టు పేర్కొన్నారు.
‘‘సంపద సృష్టి కర్తలకు, ఉపాధి కల్పించే వారికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. వారికి రుణ వితరణ అందేలా చూడాలి. నిజాయితీ నిర్ణయాల్లో మీకు రక్షణగా నేను ఉంటాను’ అంటూ బ్యాంకులకు మార్గదర్శనం చేశారు. 2022 ఆగస్ట్ 15 నాటికి ప్రతీ బ్యాంకు శాఖ.. పూర్తి డిజిటల్‌గా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కనీసం 100 క్లయింట్లను అయినా కలిగి ఉండాలన్న లక్ష్యాన్ని ప్రధాని నిర్ధేశించారు.
సొంతంగా 5జీ, 6జీ సామర్థ్యాలు
టెలికం రంగానికి సంబంధించి 5జీ, 6జీ టెక్నాలజీల్లో స్వీయ సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనికితోడు సెమీ కండక్టర్ల తయారీపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. గురువారం ‘సిడ్నీ డైలాగ్’ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని వర్చువల్(ఆన్‌లైన్ మాధ్యమంలో)గా మాట్లాడారు. నూతన తరం టెలికం టెక్నాలజీల అభివృద్ధిలో జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కలసి భారత్ పనిచేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి గొప్ప ఉత్పత్తి డేటాయేనన్నారు. డేటాను కాపాడడం, గోప్యత, భద్రతకు సంబంధించి పటిష్ట కార్యాచరణను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ప్రజా సార్వభౌమాధికారం కోసం డేటాను ఉపయోగించుకుంటామన్నారు. డిజిటల్ డొమైన్‌లో భారత్ సాధించిన ఘతనను ప్రస్తావించారు. ‘‘క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాం. డిజిటల్ సార్వభౌమాధికారానికి ఇది కీలకం. క్వాంటమ్ కంప్యూటింగ్‌లోనూ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌లకు సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలు, సేవలను అందించడంలో భారత్ ఇప్పటికే ప్రముఖ కేంద్రంగా ఉంది. సైబర్ సెక్యూరిటీకి సైతం భారత్‌ను కేంద్రంగా మార్చేందుకు పరిశ్రమతో కలసి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహకాల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment