పరారీలో 58 మంది ఆర్థిక నేరగాళ్లు | Centre On Lookout For 58 Economic Offenders | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 21 2018 9:31 AM | Last Updated on Fri, Dec 21 2018 9:31 AM

Centre On Lookout For 58 Economic Offenders - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య యాభై ఎనిమిదికి చేరింది. ఈ వైట్‌కాలర్‌ నేరగాళ్లను వెనక్కి రప్పించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విజయ్‌ మాల్యా మాత్రమే కాదు నీరవ్‌ మోదీ, మొహుల్‌ చోక్సీ, నితిన్, చేతన్‌ సందేస్రా, లలిత్‌ మోదీ, యూరోపియన్‌ దళారీ గ్యూడో రాల్ఫ్‌ హస్చకే, కార్ల్‌ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్‌అవుట్‌ సర్క్యులర్స్‌ (ఎల్‌ఒసీ), ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు ఇప్పటికే జారీ చేశామని కేంద్రం పేర్కొంది.

బ్రిటన్, యూఏఈ, బెల్జియం, ఈజిప్ట్, అమెరికా, అంటిగా, బార్బుడా దేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాల్సిందిగా భారత్‌ ఆయా దేశాల ప్రభుత్వాలకు అప్పగింత అభ్యర్థనలను సమర్పించింది. ఇప్పటిదాకా చేసిన 16 అప్పగింత అభ్యర్థనలు ఎంతవరకు పురోగతి సాధించాయో అని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, డీఆర్‌ఐ వంటి సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలపై మరింత ఒత్తిడిపెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. వీవీఐపీ హెలికాప్టర్ల స్కామ్‌లో మధ్యవర్తిగా వ్యవహరించిన గ్యూడో రాల్ఫ్, కార్లో గెరోసాల అప్పగింత అభ్యర్థన, సంబంధిత నోటీసుల తాజా పరిస్థితిని విదేశాంగ శాఖ లోక్‌సభకు నివేదించింది. గెరోసా అప్పగింతపై గత ఏడాది నవంబర్‌లో, గ్యూడో అప్పగింతపై ఈ ఏడాది జనవరిలో అభ్యర్థనలు పంపిస్తే వాటిని ఇటలీ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపింది.

రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మొహుల్‌ చోక్సీ అప్పగింతపై 2 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. చోక్సీపై ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. గుజరాత్‌కు చెందిన వ్యాపారి ఆశిష్‌ జోబన్‌పుత్ర, ఆయన భార్య ప్రీతిని అమెరికా నుంచి రప్పించడానికి ట్రంప్‌ సర్కార్‌కు భారత్‌ ఇప్పటికే అప్పగింత విజ్ఞప్తులు పంపింది. దీపక తల్వార్‌ను యూఏఈ నుంచి తీసుకురావడానికి అవసరమైన న్యాయపోరాటం చేస్తోంది. స్టెర్లింగ్‌ బయోటెక్‌ ద్వారా బ్యాంకులకు 5వేల కోట్లు ఎగ్గొట్టిన చేతన్, నితిన్, దీప్తి సందేసర, హితేష్‌కుమార్‌ పటేల్‌లపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీఅయ్యాయి. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌ను వెనక్కి తీసుకురావడంలో సక్సెస్‌ సాధించిన బీజేపీ సర్కారు మిగిలిన వారినీ తీసుకువస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement