- స్టాండప్ ఇండియా పథకంలో కదలిక
- ఆర్థిక స్వావలంబన దశగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు
- జిల్లాలో 30కిపైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు
- రూ.10 లక్షల నుంచి కోటి వరకు రుణ సదుపాయం
- రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహణకు ఆదేశించిన సీఎస్
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో దళిత మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా పథకంలో కదలిక మొదలైంది. పరిశ్రమలు స్థాపించేందుకు వినూత్న ప్రాజెక్టులతో ఔత్సాహిక దళిత మహిళలు ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 30 మందికి పైగా దళిత మహిళా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా వీరిలో 10 మంది ఔత్సాహికులకు బ్యాంకర్లు రుణ సదుపాయం కల్పించారు. మరో 10 యూనిట్ల స్థాపనకు బ్యాంకు అధికారులు ప్రాథమిక అంగీకారం తెలియజేయగా.. ఇంకొక పది యూనిట్ల దరఖాస్తులను అధికారులు పరిశీలన చేస్తున్నారు. గత యేడాది ఏప్రిల్ 5న ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
అందులో భాగంగానే గత మేనెల 17న విజయవాడలో ఈ పథకం అమలపై రాష్ట్ర స్థాయి వర్క్ షాపు, జిల్లా స్థాయిలో వర్క్‌షాపులు జరిగాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకంను దిగువస్థాయిలో నిర్వహించాల్సిన కార్యాచరణకు సంబంధించిన అంశాలను వర్క్ షాపులలో అధికారులకు అవగహన కల్పించారు. అనంతరం జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, బ్యాంకర్లు, రూడ్‌సెట్, ఎపిట్కో.. డిక్కీ సంస్థకు చెందిన ప్రతినిధులు వర్క్‌షాపుల ద్వారా అవగహన కల్పించడంతో పథకంపై ఔత్సాహిక దళిత మహిళలు ముందుకొస్తున్నారు.
పథకం ముఖ్య ఉద్ధేశం..
మేకిన్ ఇండియాలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సాహించడం ముఖ్య ఉద్ధేశం. ఇప్పటి వరకు బ్యాంకర్లు పేద మహిళలకు రుణ సదుపాయం కల్పించడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాని స్టాండప్ ఇండియా పథకం కింద కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ కనీసం ఇద్దరు ఎస్సీ, ఎస్టీల వర్గాలకు తప్పని సరిగా ఈ పథకం కింద రుణం ఇవ్వాలని నిబంధన విధించారు.
యూనిట్‌కు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు హామీ లేకుండా రుణ సదుపాయం చేసేందుకు సీజీటీఎస్‌ఐఎల్(క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ స్టాండఫ్ ఇండియాలోన్స్) గా గతంలో ఉన్న సీజీటిఎంఎస్‌ఈకి బదులుగా సీజీటీఎస్‌ఐఎల్‌ను ప్రవేశపెట్టారు. 18 నెలల పాటు మారిటోరియం పిరియడ్ విధించడంతోపాటు ఔత్సాహికులు తప్పని సరిగా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం భరించాలని వివరించారు. ఈ పథకాన్ని ఇంకా తయారీ రంగంతో పాటు ట్రేడింగ్, సర్వీస్ సెక్టార్లకు విస్తరించారు. గ్రామీణ బ్యాంకులు కూడా ఈ పథకానికి చేయూత నందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
ఔత్సాహికులు తమ ప్రాజెక్టు నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆరు దశలలో స్టాండప్ మిత్ర పోర్టల్ ద్వారా దరఖాస్తు పంపాలి. కనీసం మూడు బ్యాంకులకు తమ ప్రతిపాదనలను పంపుకోవచ్చు. లీడ్ జిల్లా మేనేజర్, నాబార్డ్ ఏజీఎంఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి ఆయా బ్యాంకులకు దరఖాస్తులను పంపిస్తారు. అనంతరం బ్యాంకర్లు ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించి నెల రోజుల్లో తమ నిర్ణయాన్ని దరఖాస్తు దారులకు తెలియజేయాలి.
స్పష్టత కోసం రాష్ట్ర స్థాయి వర్క్ షాపు..
ఈ పథకంపై ఇంకా స్పష్టత కోసం రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహణకు రాష్ర్ట సీఎస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్ల డి క్కీ జిల్లా కోఆర్డినేటర్ భక్తవత్సలం తెలిపారు. ఆన్‌లైన్ విధానంతోపాటు సెక్యురిటీ సబ్సిడీ, మార్జిన్ మని తదితర అంశాలలో నిర్ధిష్టత లేనందున బ్యాంకర్లు అధికారులు ఎవరికి వారు తమకు తోచిన విధంగా అన్వయించుకోవడం.. దరఖాస్తుదారులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే విషయాన్ని డిక్కీ ప్రతినిధులు ఇటీవల రాష్ర్ట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మళ్లీ రాష్ర్ట స్థాయి వర్క్ షాపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ, బ్యాంకర్లు, అధికారులతో చర్చించి పథకంపై స్పష్టత ఇవ్వాలని, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
మహిళామణులకు చేయూత
Published Tue, Nov 1 2016 3:24 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement