Suraksha Bima Yojana
-
బీమా విక్రయాలపై బ్యాంకులకు లక్ష్యాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల విక్రయాలకు సంబంధించి 2023–24 సంవత్సరానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం లక్ష్యాలు విధించింది. అలాగే, ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాలకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక శాఖ లక్ష్యాలు విధించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈ పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. చౌక ధరకే బీమా రక్షణ కల్పించాలన్నది వీటి ఉద్దేశ్యం. 2023 మార్చి నాటికి పీఎంజేజేబీవై పరిధిలో 15.99 కోట్ల మంది పేర్లను నమోదు చేసుకోగా, పీఎంఎస్బీవై పరిధిలో 33.78 కోట్ల మంది సభ్యులుగా చేరారు. గతేడాది పీఎంజేజేబీవై ప్రీమియంను ఏడాదికి రూ.330 నుంచి రూ.436కు పెంచగా, పీఎంఎస్బీవై ప్రీమియాన్ని ఏడాదికి రూ.12 నుంచి రూ.20 చేశారు. పీఎంజేజేబీవై అనేది రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీనిస్తుంది. పీఎంఎస్బీవై అనేది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి స్థాయి అంగవైకల్యం పాలైన సందర్భంలో రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం లభిస్తుంది. పీఎంజేజేబీవైని 18–50 ఏళ్ల వారు, పీఎంఎస్బీవైని 18–70 ఏళ్ల వారు తీసుకోవచ్చు. బ్యాంకుకు దరఖాస్తు ఇస్తే, వారి ఖాతా నుంచి ప్రీమియాన్ని డెబిట్ చేస్తారు. ప్రోత్సహించాలి.. కస్టమర్లు ఏటా ఈ పథకాలను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఒకటికి మించిన సంవత్సరాలకు కొనుగోలు చేసేలా వారిని ప్రోత్సహించాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. గత వారం పీఎస్‌బీల సారథులతో, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు గాను వివిధ పథకాల పరిధిలో 2023–24 సంవత్సరానికి విధించిన లక్ష్యాలను బ్యాంకులు సాధించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాలపై మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 1ను ప్రారంభించడం గమనార్హం. బ్యాంకులు తమ కరస్పాండెంట్ నెట్వర్క్ ద్వారా మరింత మంది కస్టమర్లతో ఈ బీమా పథకాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. -
ఏడాదికి 20రూపాయలే..బెనిఫిట్ రూ.2 లక్షలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఈ స్కీమ్ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు సాయపడుతుంది. రూ.2 లక్షల వరకు ప్రయోజనం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో ఏడాదికి రూ.20 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. మే నెల చివరిలో బ్యాలెన్స్ కట్ పీఎం సురక్ష బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారు సంబంధిత బ్యాంకులు, పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ బీమా పాలసీ తీసుకున్న పాలసీ దారులు ఆటో డెబిట్ పెట్టుకుంటే వారి అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం రూ.20 బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా కట్ అవుతాయి. కావాల్సిన డాక్యుమెంట్లు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారికి బ్యాంక్ అకౌంట్,ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అర్హులు ఎవరంటే కేంద్రం అందిస్తున్న ఈ పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరేందుకు అర్హులు. -
జీవన్ జ్యోతి, సురక్షా బీమా ప్రీమియం: కేంద్రం షాక్
న్యూఢిల్లీ: తక్కువ ప్రీమియానికే పేదలను, సామాన్యులను సైతం బీమా కవరేజీ పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో.. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) ప్రీమియంలు పెరిగాయి. ఆర్థికంగా ఈ ఉత్పత్తులు మనుగడ సాగించేందుకు వీలుగా ప్రీమియం పెంచినట్టు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పీఎం జేజేబీవై ప్రీమియంను ఒక రోజుకు 1.25కు పెంచారు. అంటే వార్షికంగా ప్రస్తుతమున్న రూ.330 ప్రీమియం రూ.436 అయింది. అంటే 32 శాతం పెరిగినట్టు. ఇక పీఎం ఎస్బీవై వార్షిక ప్రీమియం రూ.12 నుంచి రూ.20కు పెరిగింది. ఇది 67 శాతం పెరిగింది. నూతన ప్రీమియం రేట్లు ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అధిక క్లెయిమ్‌లు.. ఈ పథకాలకు సంబంధించి దీర్ఘకాలంలో నమోదైన క్లెయిమ్‌ల ఆధారంగా ప్రీమియం రేట్ల సవరణ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పీఎం ఎస్బీవై అన్నది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి వైకల్యం పాలైనా రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లిస్తుంది. పాక్షిక వైకల్యం పాలైతే రూ.లక్ష పరిహారాన్ని చెల్లిస్తారు. పీఎం జేజేబీవై కింద పాలసీదారు ఏ కారణంతో మరణించినా రూ.2లక్షల పరిహారం లభిస్తుంది. పీఎం ఎస్బీవై ప్లాన్ ఆరంభం నుంచి 2022 మార్చి 31 వరకు రూ.1,134 కోట్ల ప్రీమియం వసూలైంది. కానీ, పాలసీ దారులకు పరిహారంగా బీమా సంస్థలు చెల్లించిన మొత్తం రూ.2,513 కోట్లుగా ఉంది. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రెట్టింపు మొత్తం అవి చెల్లించాయి. ఇక పీఎం జేజేబీవై కింద 2022 మార్చి నాటికి రూ.9,737 కోట్ల ఆదాయం వసూలు కాగా, చెల్లించిన మొత్తం రూ.14,144 కోట్లుగా ఉంది. -
బీమా పథకాలపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ రఘునందన్‌రావు సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల ఐకేపీ, ఈజీఎస్ సిబ్బంది, బ్యాంకు మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన పథకాలన్నీ తక్కువ మొత్తంతో ఎక్కువ లబ్ధి కలిగించేవిగా ఉన్నాయన్నారు. ఈ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు పథకాల కింద జిల్లాలో కనిష్టంగా 10 లక్షల మంది నుంచి ప్రీమియం కట్టించేలా చూడాలని పేర్కొన్నారు. ఇందుకుగాను గ్రామాల్లో ప్రత్యేకంగా సభలు నిర్వహించి ప్రచారం చేయాలని, ప్రతి ఒక్కరికీ ఈ పథకాలపై వివరించాలన్నారు. ఈ నెల 25లోగా అర్హులంతా బ్యాంకుల్లో బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత ప్రీమియం చెల్లించేవారు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.