Jeevan Jyoti Bima Yojana
-
Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత
పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్‌కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్ ది చేంజ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’ ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్ ఎకౌంట్ రిజిస్టర్ చేయించింది. తండ్రి ఫైనాన్షియల్ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్‌కు ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్‌కు ఎకనామిక్స్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫైనాన్స్ రంగంలోనే తన కెరీర్ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ అపార్ట్మెంట్లో హౌస్‌కీపింగ్ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఇతర వర్కర్లతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది. ఈ నేపథ్యంలో జిందాల్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ ప్రారంభించింది. తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్‌లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్‌లో చేరేలా ఆన్లైన్ అప్లయింగ్, ఫామ్–ఫిల్లింగ్ వరకు జిందాల్ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు. ‘రోటరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది జిందాల్. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్ బాయ్‌గా పనిచేసే ప్రకా‹ష్ మండల్... కోవిడ్ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడికి ఉపయోగపడే గవర్నమెంట్ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్ బృందం. ‘ఎన్నో స్కీమ్‌లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్‌లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్. భవిష్యత్‌లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్. ‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్. వారి నమ్మకమే మన బలం గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని. – కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్ ది చేంజ్–ఫౌండర్ -
బీమా విక్రయాలపై బ్యాంకులకు లక్ష్యాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల విక్రయాలకు సంబంధించి 2023–24 సంవత్సరానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం లక్ష్యాలు విధించింది. అలాగే, ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాలకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక శాఖ లక్ష్యాలు విధించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2015లో ఈ పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. చౌక ధరకే బీమా రక్షణ కల్పించాలన్నది వీటి ఉద్దేశ్యం. 2023 మార్చి నాటికి పీఎంజేజేబీవై పరిధిలో 15.99 కోట్ల మంది పేర్లను నమోదు చేసుకోగా, పీఎంఎస్బీవై పరిధిలో 33.78 కోట్ల మంది సభ్యులుగా చేరారు. గతేడాది పీఎంజేజేబీవై ప్రీమియంను ఏడాదికి రూ.330 నుంచి రూ.436కు పెంచగా, పీఎంఎస్బీవై ప్రీమియాన్ని ఏడాదికి రూ.12 నుంచి రూ.20 చేశారు. పీఎంజేజేబీవై అనేది రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీనిస్తుంది. పీఎంఎస్బీవై అనేది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి స్థాయి అంగవైకల్యం పాలైన సందర్భంలో రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం లభిస్తుంది. పీఎంజేజేబీవైని 18–50 ఏళ్ల వారు, పీఎంఎస్బీవైని 18–70 ఏళ్ల వారు తీసుకోవచ్చు. బ్యాంకుకు దరఖాస్తు ఇస్తే, వారి ఖాతా నుంచి ప్రీమియాన్ని డెబిట్ చేస్తారు. ప్రోత్సహించాలి.. కస్టమర్లు ఏటా ఈ పథకాలను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఒకటికి మించిన సంవత్సరాలకు కొనుగోలు చేసేలా వారిని ప్రోత్సహించాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. గత వారం పీఎస్‌బీల సారథులతో, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు గాను వివిధ పథకాల పరిధిలో 2023–24 సంవత్సరానికి విధించిన లక్ష్యాలను బ్యాంకులు సాధించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాలపై మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 1ను ప్రారంభించడం గమనార్హం. బ్యాంకులు తమ కరస్పాండెంట్ నెట్వర్క్ ద్వారా మరింత మంది కస్టమర్లతో ఈ బీమా పథకాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. -
సంవత్సరానికి రూ.436 కడితే.. రూ.2 లక్షల బెన్ఫిట్
కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని అందిస్తోంది. అతి తక్కువ ప్రీమియంతో ఈ స్కీమ్ లబ్ధి దారులు రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్‌లో చేరిన వారు సంవత్సరానికి రూ.436 చెల్లించి రూ.2 లక్షల వరకు జీవిత బీమా భద్రతను పొందవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో పాలసీ దారుడు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షల్ని కేంద్రం అందజేస్తుంది. పథకంలో ఎలా చేరాలి? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ స్కీమ్‌లో చేరేందుకు బ్రాంచ్ బ్యాంక్, పోస్టాఫీస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న మొత్తం అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. అర్హతలు ఇవే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే అర్హులు. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. రూ. 2 లక్షలు ఎలా వస్తాయి? పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది. అందువల్ల మీరు ప్రతి ఏడాది రూ.436 కట్టాలి. ఇలా డబ్బులు కట్టి పాలసీ తీసుకున్న వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే.. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు లేదంటే నామినీకి రూ.2 లక్షల అందజేస్తారు. -
జీవన్ జ్యోతి, సురక్షా బీమా ప్రీమియం: కేంద్రం షాక్
న్యూఢిల్లీ: తక్కువ ప్రీమియానికే పేదలను, సామాన్యులను సైతం బీమా కవరేజీ పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో.. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) ప్రీమియంలు పెరిగాయి. ఆర్థికంగా ఈ ఉత్పత్తులు మనుగడ సాగించేందుకు వీలుగా ప్రీమియం పెంచినట్టు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పీఎం జేజేబీవై ప్రీమియంను ఒక రోజుకు 1.25కు పెంచారు. అంటే వార్షికంగా ప్రస్తుతమున్న రూ.330 ప్రీమియం రూ.436 అయింది. అంటే 32 శాతం పెరిగినట్టు. ఇక పీఎం ఎస్బీవై వార్షిక ప్రీమియం రూ.12 నుంచి రూ.20కు పెరిగింది. ఇది 67 శాతం పెరిగింది. నూతన ప్రీమియం రేట్లు ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అధిక క్లెయిమ్‌లు.. ఈ పథకాలకు సంబంధించి దీర్ఘకాలంలో నమోదైన క్లెయిమ్‌ల ఆధారంగా ప్రీమియం రేట్ల సవరణ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పీఎం ఎస్బీవై అన్నది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి వైకల్యం పాలైనా రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లిస్తుంది. పాక్షిక వైకల్యం పాలైతే రూ.లక్ష పరిహారాన్ని చెల్లిస్తారు. పీఎం జేజేబీవై కింద పాలసీదారు ఏ కారణంతో మరణించినా రూ.2లక్షల పరిహారం లభిస్తుంది. పీఎం ఎస్బీవై ప్లాన్ ఆరంభం నుంచి 2022 మార్చి 31 వరకు రూ.1,134 కోట్ల ప్రీమియం వసూలైంది. కానీ, పాలసీ దారులకు పరిహారంగా బీమా సంస్థలు చెల్లించిన మొత్తం రూ.2,513 కోట్లుగా ఉంది. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రెట్టింపు మొత్తం అవి చెల్లించాయి. ఇక పీఎం జేజేబీవై కింద 2022 మార్చి నాటికి రూ.9,737 కోట్ల ఆదాయం వసూలు కాగా, చెల్లించిన మొత్తం రూ.14,144 కోట్లుగా ఉంది. -
కనిపించని ‘ముద్ర’
11,587 మందికే ఆర్థిక సాయం రుణాలు ఇచ్చేందుకు వెనకాడుతున్న బ్యాంకర్లు నేడు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నల్లగొండ: దిగువ, మధ్య తరగతి వ్యాపారులు, సేవ లు, సంబంధిత సంస్థలు, వివిధ రంగాల్లో రాణిస్తు న్న వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్ర భుత్వ గతేడాది ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ ఆశించిన రీతి లో అమలుకావడం లే దు. ఎలాంటి జమాన తు లేకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాల్సిన పథకం పలుకుబడి ఉన్నవారికి అందుతుంది. 2015-16 ఆర్థికసంవత్సరానికి గాను ఒక్కో బ్రాంచి కనీసం పది మందికి ముద్ర పథకం కింద ఆర్థికంగా చేయూత నివ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత మళ్లీ మార్పులు చేసి బ్యాంకు పరిమితులకు లోబడి ఎంతమందికైనా రుణాలు ఇవ్వొచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 రకాల బ్యాంకుల్లో పథకం అమలవుతోంది. వీటి పరిధిలో 360 బ్రాంచి కార్యాలయాలు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. దీంట్లో 28 రకాల బ్యాంకు ల్లో మాత్రమే ముద్ర పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ బ్యాంకులు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 11,587 మందికే రుణాలు మంజూరు చేశా యి. బీమా పథకాలది అదే తీరు. జిల్లా జనాభా 34 ల క్షలు ఉండగా దాంట్లో కనీసం 15 లక్షల మందిని బీ మా పథకాల్లో చేర్చాలని నిర్ణయించారు. కానీ జీవన్ జ్యోతి బీమా యోజనలో 1.47 లక్షలు, సురక్ష బీమా యోజనలో 4.02 లక్షల మందిని మాత్రమే చేరారు. నేడు పథకాలపై సమీక్ష... కలెక్టరేట్లో గురువారం బ్యాంకర్ల సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కలెక్టర్, జిల్లా ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు, వివిధ శాఖల అధి కారులు హాజరుకానున్నారు.