ముద్ర యోజనతో 5.5 కోట్ల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్న వ్యాపారస్తులకు వరం లాంటి ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం(పీఎంఎంవై) భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించిందని తాజా రిపోర్టులో తెలిసింది. ఈ పథకం పారిశ్రామిక రాష్ట్రాల్లో దాదాపు 5.5 కోట్ల మందికి ఉద్యోగవకాశాలు కల్పించినట్టు స్కోచ్ రిపోర్టు పేర్కొంది.. ముద్ర పథకంతో ఎక్కువగా లబ్ది పొందిన రాష్ట్రాల్లో కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నట్టు చెప్పింది.
2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముద్ర స్కీమ్‌ను లాంచ్ చేశారు. ఈ స్కీమ్ కింద 8 కోట్లకు పైగా ప్రజలకు రూ.3.42 లక్షల కోట్ల రుణాలు అందజేశారు. వీరిలో ఎక్కువగా చిన్న వ్యాపారస్తులే ఉన్నారని రిపోర్టులో తెలిసింది. వ్యవసాయేతర కార్యకలాపాలకు రూ.10 లక్షల వరకు ముద్ర రుణం అందుబాటులో ఉంటుంది. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు డెయిరీ, ఫౌల్ట్రీ, బీ-కీపింగ్ వంటి వాటికి ముద్ర పథకం రుణాలు అందిస్తోంది.