‘ముద్ర’ ప్రారంభం
జార్ఖండ్‌లో ప్రారంభించిన ప్రధాని
ఖుంటి(జార్ఖండ్): జార్ఖండ్‌లో శుక్రవారం ముద్ర యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. సంథాల్ పరగణాలోని దుంకాలో ‘ముద్ర మహారుణ మేళా’ను, బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ పథకాన్ని ప్రారంభించారు. ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులకు తొలి విడతగా మోదీ రూ. 10 వేల చొప్పున రుణం అందించారు. ఇది రుణమని, దీన్ని నామమాత్ర వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వడ్డీ భారం పడకుండా విడతలవారీగా రుణం తీసుకోవడం ఉత్తమమని సూచించారు. పేదల జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజనను ముందుకు తీసుకువచ్చామన్నారు.
సంథాల్ పరగణాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను ప్రస్తావిస్తూ.. పేదలకు బ్యాంకింగ్ సదుపాయాలు, బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ. 26 వేల కోట్లను 20 లక్షల మంది మహిళలు సహా అర్హులైన 42 లక్షల మందికి రుణాలుగా అందిస్తారు. అంతకుముందు, జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా కోర్టు, కలెక్టరేట్‌లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన 180 కేవీ సౌర విద్యుత్ ప్లాంటునూ మోదీ ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ, ఆయన జయంతి అక్టోబర్ 2 తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్నారు. పేదలకు న్యాయం జరగాలన్న బాపూజీ కల.. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు ద్వారానే సాకారమవుతుందన్నారు. దేశంలోనే సౌరవిద్యుత్ సౌకర్యమున్న తొలి కోర్టుగా ఖుంటి జిల్లా కోర్టు నిలిచిందని, ఇదే బాపూజీకి ఘన నివాళి అని అన్నారు.
స్వచ్ఛభారత్‌కు కలసిరండి.. లేదా తప్పుకోండి!
న్యూఢిల్లీ: ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తే తప్ప ‘స్వచ్ఛభారత్’ విజయం సాధించలేదని మోదీ తేల్చి చెప్పారు. ఆ ఉద్యమాన్ని ఏ ఒక్క వ్యక్తికో, ప్రభుత్వానికో, లేక ఏ ఒక్క పార్టీకో ఆపాదిస్తే అది విఫలమవుతుందన్నారు. ‘స్వచ్ఛభారత్ కార్యక్రమం నచ్చనివారు అందులో పాల్గొనకండి.. పక్కకు తప్పుకోండి.. అంతేకానీ విమర్శించకండి’ అంటూ విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛభారత్‌లో చురుగ్గా పాల్గొన్న వారికి శుక్రవారం ఆయన ఢిల్లీలో అవార్డులు అందజేసి ప్రసంగించారు.